ఏపీలో హెల్మెట్ పెట్టుకోకపోతే ఇవన్నీ కట్ -పోలీసులకు హైకోర్టు కీలక సూచన

www.mannamweb.com


ఏపీలో ట్రాఫిక్ పోలీసులపై హైకోర్టు మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గతంలో పలుమార్లు ద్విచక్ర వాహన దారుల హెల్మెట్ వినియోగంపై హెచ్చరికలు చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆక్షేపించింది.

వీరి నిర్లక్ష్యం కారణంగా గత మూడు నెలల్లో 667 మంది ప్రాణాలు కోల్పోవడాన్ని తీవ్రంగా పరిగణించింది. దీనిపై స్వయంగా వివరణ ఇవ్వాలని ట్రాఫిక్ విభాగం ఐజీని హైకోర్టు ఆదేశించింది. అంతే కాదు హెల్మెట్ పెట్టుకోని బైకర్ల ఇళ్లకు అవన్నీ కట్ చేయాలని సూచించింది.

బైకర్లు హెల్మెట్లు పెట్టుకోకుండా డ్రైవింగ్ చేసి ప్రమాదాల బారిన పడుతున్నారని, వారిపై వెయ్యి రూపాయల జరిమానా విధించి పోలీసులు చేతులు దులుపుకుంటున్నారని హైకోర్టు ఆక్షేపించింది. బైకర్లపై భారీ జరిమానాలు విధించడం సరికాదని అభిప్రాయపడింది. ఇలా ఉల్లంఘనలు చేస్తున్న వారి ఇళ్లకు విద్యుత్, నీటి సరఫరా నిలిపేసే విషయాన్ని పరిశీలించాలని ట్రాఫిక్ పోలీసులకు హైకోర్టు కీలక సూచన చేసింది..

హెల్మెట్లు ధరించే విషయంలో విజయవాడకూ, హైదరాబాద్ కూ హైకోర్టు పోల్చి చూపించింది. విజయవాడలో హెల్మెట్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తున్న వారు తక్కువగా కనిపిస్తున్నారని, అదే హైదరాబాద్ లో పరిస్ధితి భిన్నంగా ఉందని తెలిపింది. విజయవాడ నుంచి తెలంగాణలోకి ఎంట్రీ కాగానే కార్లలో వెళ్లే వారు కూడా సీట్ బెల్టులు పెట్టుకుంటున్నారని హైకోర్టు వ్యాఖ్యానించింది. దీన్ని బట్టి ఏపీలో పోలీసులంటే వాహనదారులకు భయం లేదని తెలిపింది. ఈ వ్యవహారంలో రవాణాశాఖ కమిషనర్ ను ప్రతివాదిగా చేర్చడంతో పాటు ట్రాఫిక్ ఐజీని ఈ నెల 18న జరిగే తదుపరి విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.