హద్దు మీరొద్దు.. పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

పోలీసుల ఇష్టారాజ్యంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం


పెద్దల మెప్పు కోసం పని చేయొద్దు.. సమస్య వస్తే వాళ్లు మిమ్మల్ని కాపాడరు

పరిధులు గుర్తెరిగి పని చేయండి..

ఏం చేస్తున్నా మేం చూడనట్లు ఉండాలని భావిస్తున్నారు

పోలీసుల తీరు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతోంది.. చాలా క్యాజువల్‌గా కేసులు పెడుతున్నారు

అదే రీతిలో వాంగ్మూలాలను సృష్టిస్తున్నారు.. ప్రభుత్వంపై డ్రామా రూపంలో వ్యంగ్య విమర్శలు తప్పా?

అది తప్పయితే.. ప్రతీ హీరోను, నటుడిని అరెస్ట్‌ చేయాలి

పోలీసులనే కాదు.. మా మేజిస్ట్రేట్‌లను కూడా తప్పుపట్టాలి.. కాగితాల్లో ఏముందో కూడా చూడటం లేదు..

ఈ విషయాన్ని మేం ఒప్పుకోవాల్సిందే

పోలీసుల తీరు చూస్తుంటే మాకు రక్తపోటు (బీపీ) పెరిగిపోతోంది. చాలా క్యాజువల్‌గా కేసులు పెడుతున్నారు. వాంగ్మూలాలను సృష్టిస్తున్నారు. ఏదో ఒక కేసు నమోదు చేయాలి. ఎవరో ఒకరిని అరెస్టు చేయాలనే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు.
-హైకోర్టు ధర్మాసనం

తప్పు చేస్తే.. కేసు పెట్టడం, అరెస్ట్‌ చేయడం తప్పు కాదు. కానీ అరెస్ట్‌ చేయడానికే కేసు పెడితేనే సమస్య. మీ తప్పులను ఎన్నని ఎత్తి చూపాలి? ఎలా పడితే అలా వ్యవహరించే ముందు బాగా ఆలోచించుకోండి. పోలీసులు పరిధి దాటి వ్యవహరించడంపై మాకు చాలా విషయాలు తెలుసు. మేం కోర్టుల్లో ఉంటాం కాబట్టి క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలియదని ఎంత మాత్రం అనుకోవద్దు. మీరేం చేస్తున్నా చూస్తూ ఉండాలంటారా? మేమేం చేయలేం..! మీరు మరో మార్గం చూసుకోండని పిటిషనర్లకు చెప్పమంటారా? పోలీసులకు సొంత నిబంధనలతో కూడిన మాన్యువల్‌ ఉంది. దాన్ని కూడా ఫాలో కావడం లేదు. కేవలం పోలీసులను మాత్రమే తప్పుపడితే సరిపోదు.. మా మేజిస్ట్రేట్లను కూడా తప్పు పట్టాల్సి ఉంది. పోలీసులు ఏది దాఖలు చేస్తే దాని ఆధారంగా రిమాండ్‌ విధించేస్తున్నారు. వారు సమర్పించిన కాగితాల్లో ఏముందో కూడా కనీస స్థాయిలో చూడటం లేదు.

రాష్ట్రంలో పోలీసుల ‘అతి’పై హైకోర్టు మరోసారి నిప్పులు చెరిగింది. పెద్దల మెప్పు కోసం పనిచేస్తే, సమస్య వచ్చినప్పుడు వాళ్లొచ్చి మిమ్మల్ని కాపాడరని వ్యాఖ్యానించింది. చట్టం, నిబంధనలు, పోలీసు మాన్యువల్‌కు లోబడి పని చేయాల్సిందేనని స్పష్టం చేసింది. పోలీసులు తమ పరిధులు గుర్తెరిగి విధులు నిర్వర్తించాలంది. పోలీసులు ఎలా పనిచేస్తున్నారో తమకు బాగా తెలుసని పేర్కొంది. అలాగే తాము ఏమీ చేయలేమని అనుకోవద్దని హెచ్చరించింది.

ఏం చేస్తున్నా కూడా చూడనట్లుగా తమను (కోర్టు) కళ్లు మూసుకుని ఉండాలని భావిస్తున్నారని, అది ఎంత మాత్రం సాధ్యం కాదని తెలిపింది. పోలీసుల తీరు చూస్తుంటే తమకు రక్తపోటు (బీపీ) పెరిగిపోతోందంటూ వ్యాఖ్యానించింది. చాలా క్యాజువల్‌గా కేసులు పెట్టేస్తున్నారని, వాంగ్మూలాలను సృష్టిస్తున్నారని పోలీసుల తీరును హైకోర్టు తీవ్రంగా ఆక్షేపించింది. ఇలాంటి వాటిని తాము నమ్మాలని పోలీసులు అనుకుంటున్నారని పేర్కొంది. ఏదో ఒక కేసు నమోదు చేయాలి..

ఎవరో ఒకరిని అరెస్ట్‌ చేయాలనే రీతిలో పోలీసులు వ్యవహరిస్తున్నారని మండిపడింది. ప్రభుత్వాన్ని డ్రామా రూపంలో వ్యంగ్యంగా విమర్శించినందుకు కేసు పెడితే.. ప్రతి సినిమా హీరోను, ప్రతి నటుడినీ అరెస్ట్‌ చేయాల్సి ఉంటుందని వ్యాఖ్యానించింది. వ్యంగ్య విమర్శలతో ప్లకార్డులు పట్టుకోవడం తప్పా? దానిపై రీల్‌ చేయడం తప్పా? అని పోలీసులను నిలదీసింది. వ్యంగ్య విమర్శలతో ప్లకార్డులు పట్టుకోవడం వర్గాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం కిందకు వస్తుందా? అని విస్మయం వ్యక్తం చేసింది.

పోలీసులు ఎలా పడితే అలా కేసులు పెడితే విశ్వసనీయత ఏముంటుందని ప్రశ్నించింది. కేవలం పోలీసులను మాత్రమే తప్పుపడితే సరిపోదని, తమ మేజిస్ట్రేట్లను కూడా తప్పు పట్టాల్సి ఉందని హైకోర్టు తెలిపింది. పోలీసులు ఏం దాఖలు చేస్తే దాని ఆధారంగా రిమాండ్‌ విధించేస్తున్నారని ఘాటుగా వ్యాఖ్యానించింది. పోలీసులు సమర్పించిన కాగితాల్లో ఏముందో కూడా కనీస స్థాయిలో చూడటం లేదని, ఈ విషయాన్ని తాము ఒప్పుకుని తీరాల్సిందేనని పేర్కొంది.

ఇప్పటికే పలు సందర్భాల్లో మేజిస్ట్రేట్ల తీరును ఆక్షేపించామని హైకోర్టు గుర్తు చేసింది. డ్రామా రూపంలో వ్యంగ్యంగా ప్రభుత్వాన్ని విమర్శించి, రీల్‌ చేసి సామాజిక మాధ్యమాల్లో పెట్టినందుకు మాదిగ మహాసేన వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రేమ్‌కుమార్‌ అరెస్ట్‌ చేయడంపై సంబంధిత రికార్డులన్నీ తమ ముందుంచాలని కర్నూలు త్రీ టౌన్‌ పోలీసు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌ను ఆదేశించింది.

అలాగే పోలీసులు సమర్పించిన రికార్డులు, నమోదు చేసిన వాంగ్మూలాల కాపీలను తమకు పంపాలని కర్నూలు ఫస్ట్‌ క్లాస్‌ స్పెషల్‌ జుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ను ఆదేశిస్తూ తదుపరి విచారణను ఏప్రిల్‌ 8కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ రావు రఘునందన్‌రావు, డాక్టర్‌ జస్టిస్‌ కుంభజడల మన్మథరావు ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

అక్రమ నిర్భంధంపై హెబియస్‌ కార్పస్‌..
పోలీసులు తన తండ్రి ప్రేమ్‌కుమార్‌ను అక్రమంగా నిర్భంధించారని, ఆయన్ను కోర్టు ముందు హాజరుపరిచేలా పోలీసులను ఆదేశించాలని కోరుతూ కొరిటిపాటి అభినయ్‌ గతేడాది హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఇప్పటికే పలుమార్లు విచారణ జరిపిన జస్టిస్‌ రఘునందన్‌రావు ధర్మాసనం తాజాగా మరోసారి విచారణ నిర్వహించింది. అభినయ్‌ తరఫున న్యాయవాది వేలూరి మహేశ్వరరెడ్డి వాదనలు వినిపించగా, పోలీసుల తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) విష్ణుతేజ వాదనలు వినిపించారు.

తప్పుల మీద తప్పులు…
డ్రామా రూపంలో వ్యంగ్యంగా ప్రభుత్వాన్ని విమర్శించినందుకు బలవంతపు వసూళ్లకు పాల్పడ్డారంటూ కేసు పెడతారా? అది కూడా అరెస్టు సమయంలో రూ.300 దొరికాయంటూ! అని ధర్మాసనం విస్మయం వ్యక్తం చేసింది. పోలీసులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారని, ఇలా చేస్తే సమస్యలపై సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ సమయంలో మహేశ్వరరెడ్డి స్పందిస్తూ.. నానాపటేకర్‌ నటించిన వజూద్‌ సినిమాలో పోలీసులు వ్యవహరించిన రీతిలో ఈ కేసులో పోలీసులు ప్రవర్తిస్తున్నారని తెలిపారు.

సోషల్‌ మీడియా యాక్టివిస్టుల పట్ల పోలీసులు ఏకపక్షంగా, చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాలను సైతం బేఖాతరు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో చట్ట నిబంధనల గురించి పోలీసులను జాగృతం చేయాల్సిన అవసరం ఉందని, ఆ దిశగా ఉత్తర్వులు జారీ చేయాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు. ఈ సమయంలో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది జోక్యం చేసుకుని పోలీసుల చర్యలను సమర్థించే ప్రయత్నం చేయగా ధర్మాసనం ఆయన్ను వారించింది. తప్పు చేసిన వారిని వెనకేసుకురావద్దని హితవు పలికింది.

అరెస్ట్‌ చేయడానికే కేసు పెడతామంటే ఎలా..?
“ప్రేమ్‌కుమార్‌ను అర్థరాత్రి అరెస్ట్‌ చేస్తారా? అంత అత్యవసరంగా అరెస్టు చేయాల్సినంత కేసా ఇది? పైగా కర్నూలు నుంచి 8–9 గంటలు ప్రయాణం చేసి వచ్చి మరీ అరెస్ట్‌ చేస్తారా? ఆయననేమన్నా పారిపోతున్నారా? ప్రేమ్‌కుమార్‌ రీల్‌ను సోషల్‌ మీడియాలో చూశానంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడం.. మీరు పోలోమంటూ కర్నూలు నుంచి అర్థరాత్రి వచ్చి అరెస్ట్‌ చేయడం! అంతేకాదు.. అరెస్ట్‌ చేసి పలు ప్రదేశాలు తిప్పారు. ఇదంతా ఎవరి మెప్పు కోసం చేస్తున్నారు? ఉన్నతాధికారుల మెప్పు కోసం పనిచేస్తే ఇలాంటి సమస్యలు వస్తాయి. ఓ వ్యక్తిని ఎక్కడ అరెస్ట్‌ చేస్తే అక్కడి వ్యక్తులను పంచాయతీదారులుగా చూపాలి.

కానీ ఈ కేసులో కర్నూలు పోలీసులు తమ వెంట అక్కడి నుంచే పంచాయతీదారులను తెచ్చుకున్నారు. దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి? పోలీసులు కొత్త కొత్త పద్ధతులు కనిపెడుతున్నారు. మీరు ఇలాంటివి చేస్తుంటే, మేం కళ్లు మూసుకుని ఉండాలని భావిస్తున్నారు. మీరు ఇలాగే వ్యవహరిస్తుంటే చాలా సమస్యలు వస్తాయి. తప్పు చేస్తే కేసు పెట్టడం, అరెస్ట్‌ చేయడం తప్పు కాదు. కానీ అరెస్ట్‌ చేయడానికే కేసు పెడితేనే సమస్య’ అని ధర్మాసనం పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఎలా పడితే అలా చేసే ముందు బాగా ఆలోచించుకోండి…!
“గుంటూరులో ప్రేమ్‌ కుమార్‌ బలవంతపు వసూళ్లకు పాల్పడితే కర్నూలు పోలీసులు కేసు ఎలా పెడతారు? మీకున్న పరిధి ఏమిటి? అసలు కర్నూలు నుంచి గుంటూరుకు వచ్చేందుకు మీ జిల్లా ఎస్పీ నుంచి అనుమతి తీసుకున్నారా? మేం ఇప్పుడు అనుమతి ఉందా? అని అడిగాం కాబట్టి వచ్చే విచారణ నాటికి అనుమతి తెస్తారు. ప్రేమ్‌కుమార్‌ అరెస్ట్‌ గురించి గుంటూరు పోలీసులకు ముందస్తు సమాచారం ఇవ్వాలి.

కానీ వారికి మీరెప్పుడు సమాచారం ఇచ్చారు? మీ తప్పులను ఎన్నని ఎత్తి చూపాలి? ఎలా పడితే అలా వ్యవహరించే ముందు బాగా ఆలోచించుకోండి. పోలీసులు పరిధి దాటి వ్యవహరించడంపై మాకు చాలా విషయాలు తెలుసు. మేం కోర్టుల్లో ఉంటాం కాబట్టి, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోందో తెలియదని ఎంత మాత్రం అనుకోవద్దు. పోలీసుల చర్యలు చూస్తుంటే మాకు బీపీ పెరిగిపోతోంది.

ప్రేమ్‌ కుమార్‌ను అర్ధరాత్రి అరెస్ట్‌ చేసిన కర్నూలు త్రీటౌన్‌ ఎస్‌హెచ్‌వో.. ఫిర్యాదులు అందగానే ఎన్ని కేసుల్లో ఇలా అప్పటికప్పుడు అరెస్టులు చేశారు? ఎన్ని కేసుల్లో ఇలా అర్ధరాత్రులు వెళ్లారు? మీరేం చేస్తున్నా చూస్తూ ఉండాలంటారా? మేమేమీ చేయలేం.. మీరు మరో మార్గం చూసుకోండని మమ్మల్ని పిటిషనర్లకు చెప్పమంటారా? పోలీసులకు వారి సొంత నిబంధనలతో కూడిన మాన్యువల్‌ ఉంది. దాన్ని కూడా వాళ్లు ఫాలో కావడం లేదు. ఇక్కడ మా మేజిస్ట్రేట్ల తప్పు కూడా ఉంది.

ఈ కేసులో ప్రేమ్‌కుమార్‌ నేరాలు చేయడమే అలవాటైన వ్యకిŠాత్గ పేర్కొంటూ పోలీసులు రిమాండ్‌ రిపోర్ట్‌లో రాస్తే మేజిస్ట్రేట్‌ దాన్ని కనీస స్థాయిలో కూడా పరిశీలించలేదు. రూ.300 వసూలు చేయడం అలవాటైన నేరం కిందకు వస్తుందా? అనే విషయాన్ని కూడా గమనించలేదు. ఈ కేసుకు సంబంధించిన అన్నీ రికార్డులను మేం పరిశీలించాలనుకుంటున్నాం’ అని ధర్మాసనం తెలిపింది. ఈమేరకు రికార్డులను తమ ముందుంచాలని కర్నూలు త్రీటౌన్‌ ఎస్‌హెచ్‌వో, మేజిస్ట్రేట్‌ను ఆదేశించింది.

పౌర స్వేచ్ఛపై “సుప్రీం’ ఏం చెప్పిందంటే…
“ప్రభుత్వ నిర్ణయాలు, చర్యలను విమర్శించడం.. నిరసించడాన్ని నేరం అంటే ప్రజాస్వామ్య మనుగడే సాధ్యం కాదు..’’

“స్వేచ్ఛగా మాట్లాడటం, భావ వ్యక్తీకరణ లాంటి వాటి గురించి మన పోలీసు యంత్రాంగానికి బోధించాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ విషయంలో వారికి జ్ఞానోదయం కలిగించాలి. స్వేచ్ఛగా మాట్లాడం, భావవ్యక్తీకరణపై ఎంత వరకు సహేతుక నియంత్రణ విధించాలన్న దానిపై అవగాహన కల్పించాలి. రాజ్యాంగం మనకందించిన ప్రజాస్వామ్య విలువల గురించి వారికి అవగాహన కల్పించాల్సిన సమయం వచ్చింది’’

“భిన్నాభిప్రాయం, అసమ్మతి తెలియచేయడం అన్నది రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో అంతర్భాగం. ప్రతి పౌరుడు కూడా ఇతరులు వ్యక్తం చేసే భిన్నాభిప్రాయాన్ని గౌరవించాలి. ప్రభుత్వ నిర్ణయాలపై శాంతియుతంగా నిరసన తెలియచేసే అవకాశం ఇవ్వడం ప్రజాస్వామ్యంలో తప్పనిసరి’’