History Of The Pencil : పెన్సిల్ చరిత్ర తెలుసా?

www.mannamweb.com


History Of The Pencil : ‘పిన్సిల్‌’ అనే ఫ్రెంచ్‌ పదం, ‘పిన్సిలస్‌’ అనే లాటిన్‌ పదం నుంచి వచ్చింది. ఆ పదాలకు అర్థం ‘చిన్న కుంచె’ అని.
ఒకప్పుడు చిత్రకారులు ఒంటె తోక వెంట్రుకలను ఉపయోగించి పెయింటింగ్‌ కుంచెలను తయారు చేసేవారు. దాన్ని దృష్టిలో పెట్టుకొనే ‘పెన్సిల్‌’కు ఆ పేరు పెట్టారు.
బ్రిటన్‌లోని ఇంగ్లీష్‌ లేక్‌ డిస్టిక్ట్‌లోని కెస్విక్‌ వద్ద 1564లోనే గ్రాఫైట్ గనులు బయటపడ్డాయి. అక్కడి గొర్రెల కాపరులు.. గ్రాఫైట్ ముక్కలతో గొర్రెల మీద గుర్తులు పెట్టేవారు. దీంతో ఆ కెస్విక్‌ ప్రాంతాల్లో 19వ శతాబ్దంలో పెన్సిల్‌ పరిశ్రమ విస్తరించింది.
నెపోలియన్‌ ఆర్మీలో పనిచేసిన నికోలస్‌ జాక్వస్‌ కాంటే అనే శాస్త్రవేత్త 1795లో నీరు, బంక మట్టి, గ్రాఫైట్‌ మిశ్రమాన్ని బట్టీలో 1900 డిగ్రీల ఫారిన్‌హీట్‌ వద్ద వేడిచేసి నేడు మనం వాడే పెన్సిళ్లను తయారు చేశారు. అవసరాలనుబట్టి నాలుగు మూలలు, గుడ్రిటి పెన్సిళ్లను కూడా తయారు చేశారు. కాలక్రమంలో కర్ర పెన్సిళ్లు వచ్చాయి.
1832లో ‘బ్యాంక్స్, సన్‌ అండ్‌ కంపెనీ’ పేరిట తొలి పెన్సిల్‌ పరిశ్రమ ఏర్పాటయింది. అదే కాలక్రమంలో ‘డెర్వంట్‌ కంబర్‌లాండ్‌ పెన్సిల్‌ కంపెనీ’గా రూపాంతరం చెందింది. కంబర్‌లాండ్‌ పెన్సిళ్లను ప్రపంచంలోనే నాణ్యమైన పెన్సిళ్లుగా పరిగణిస్తారు. కారణం అక్కడ దొరికే గ్రాఫైట్‌కు దుమ్మూ ధూళి అంటదు.
1858లో హైమెన్‌ లిప్‌మ్యాన్‌.. గ్రాఫైటును పొడిచేసి దానికి కొన్ని పదార్థాలు కలిపి సన్నని కర్ర ముక్కల మధ్య పెట్టి, రాసుకోడానికి అనువుగా ఉండేలా తయారు చేశాడు. రాసింది తుడిపేందుకు పెన్సిల్‌కు రబ్బరును చేర్చింది ఇతనే. అంతేకాదు.. పెన్సిల్ మీద ఇతగాడు పేటెంట్ కూడా తీసుకున్నాడు. ఆ పేటెంట్ వచ్చిన మార్చి 30ని ‘పెన్సిల్‌ దినోత్సవం’గా జరుపుతున్నారు.
ఐరోపాలో 1622 నుంచి, అమెరికాలో 1812 నుంచి పెన్సిళ్ల వాడకం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా ఏడాదికి సుమారు 1400 కోట్ల పెన్సిళ్ళు తయారవుతుండగా, ఒక్క అమెరికాలోనే సుమారు 200 కోట్ల పెన్సిళ్ళు తయారు చేస్తారు.
ఒక మాదిరి ఎత్తున్న చెట్టు కలపతో సుమారు 3 లక్షల పెన్సిళ్ళు చేయొచ్చు. ఒక పెన్సిల్‌తో 56 కి.మీ. పొడవున గీత గీయొచ్చు. సుమారు 45,000 పదాలను రాయవచ్చు. ఒక పెన్సిల్‌ను దాదాపుగా 17 సార్లు చెక్కవచ్చు.
అంతరిక్షంలో గురుత్వాకర్షణ ఉండదు కనుక పెన్నులు పనిచేయవు. కనుక వ్యోమగామలు పెన్సిల్ వాడాల్సిందే. నీటిలోనూ పెన్సిల్‌తో రాయొచ్చు. అమెరికాలో రబ్బరు అమర్చిన పెన్సిళ్ళను ఎక్కువగా వాడుతుంటే.. బ్రిటిషర్లు మాత్రం రబ్బరు లేని పెన్సిళ్ళనే ఎక్కువగా వాడతారు.
మొదటి పెన్సిల్‌ ఫ్యాక్టరీని ఇంగ్లాండ్‌లో స్థాపించారు. ఇంగ్లాండ్‌లో ‘కుంబర్‌ల్యాండ్‌ పెన్సిల్‌ మ్యూజియం’ ఉంది. ఇక్కడ 26 అడుగుల ఎత్తు, 446.36 కిలోల బరువున్న ప్రపంచపు అతి పెద్ద రంగుల పెన్సిల్‌ ఉంది.
ఎమిలియో అనే వ్యక్తి 1956 నుంచి 2013 వరకు 16,260 పెన్సిళ్లు సేకరించి రికార్డు కొట్టాడు. ఇక.. యూకేకు చెందిన ఎడ్‌ డగ్లస్‌ మిల్లర్‌ 1,061 అడుగుల పొడవైన పెన్సిల్‌ని తయారు చేసి గిన్నిస్‌ రికార్డు సాధించాడు.