Home Loan: ఉద్యోగులు ఇల్లు కొనేందుకు ఎలా ప్లాన్ చేసుకోవాలి..? నిపుణుల సలహాలు, సూచనలు..

www.mannamweb.com


కోవిడ్ సంక్షోభం తర్వాత చాలామంది సొంత ఇంటి నిర్మాణం లేదా ఇంటి కొనుగోలుపై దృష్టి పెట్టారు. ఆ సమయంలో బ్యాంకులు, ఆర్థిక సంస్థలు తక్కువ ధరకే హోమ్‌లోన్లు ఆఫర్ చేశాయి.
దీంతో రియల్ ఎస్టేట్ బూమ్ నెలకొంది. అయితే మార్కెట్ డిమాండ్, వడ్డీ రేట్ల పెరుగుదల కారణంగా ఇళ్ల ధరలు క్రమంగా పెరిగాయి. ఈ నేపథ్యంలో, ప్రస్తుత పరిస్థితుల్లో నెలవారీ జీతం పొందే ఒక ఉద్యోగి సొంతింటి కోసం ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా చేసుకోవాలో వివరించారు రియల్ ఎస్టేట్ డెవలపర్ కంపెనీ ఒమాక్స్ (Omaxe) ప్రెసిడెంట్ అవ్నీత్ సోనీ. ఆయన సూచనలు మీకోసం..

వడ్డీ రేట్లు

సాధారణంగా ఇల్లు కొనాలనుకునే ఉద్యోగులు హోమ్ లోన్ తీసుకుంటారు. ఇప్పుడు అనేక బ్యాంకులు వీటిపై తక్కువ వడ్డీ విధిస్తున్నాయి. అయితే అందుబాటులో ఉన్న వడ్డీ రేట్లను పోల్చి చూసి.. మీ ఆర్థిక పరిస్థితులకు బాగా సరిపోయేదాన్ని ఎంచుకోవాలి. ఇందుకు మీ ఆదాయం, కుటుంబ ఖర్చులు, ఆర్థిక లక్ష్యాలను పరిగణనలోకి తీసుకోవాలి.
ప్రభుత్వ పథకాలు

ప్రస్తుతం వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు సామాన్యుల సొంతింటి కలను సాకారం చేసే పథకాలను ప్రవేశపెడుతున్నాయి. వడ్డీ లేని లోన్లు, పన్ను ప్రయోజనాలతో ఇవి ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటున్నాయి. మీరు ఇలాంటి స్కీమ్స్‌కు అర్హులు అయితే, వాటిని ఎంచుకోవడం మంచిది. కొన్నిచోట్ల ప్రైవేట్ డెవలపర్లు, ప్రభుత్వం లాంచ్ చేసిన చౌకైన హౌసింగ్ స్కీమ్స్ సక్సెస్ అయ్యాయి. మొదటిసారి ఇల్లు కొనే వారికి PMAY కింద ప్రభుత్వం సబ్సిడీని అందిస్తుంది. వీటి గురించి కూడా ఆరా తీయాలి.

CIBIL స్కోర్‌

ఉద్యోగులు ఆదాయ పన్ను సక్రమంగా చెల్లించి, మంచి CIBIL స్కోర్‌ మెయింటెన్ చేస్తే.. బ్యాంకులు వారికి సులభంగా హోమ్ లోన్లు ఇస్తాయి. అయితే లోన్ అమౌంట్ అర్హత ఎంతో తెలుసుకొని, తదనుగుణంగా ఆస్తిని ఎంచుకోలి. ఇంటి నిర్మాణం లేదా కొనుగోలుకు అయ్యే మొత్తం ఖర్చులో 85 శాతం వరకు బ్యాంకులు ఆర్థికసాయం ఇస్తాయి. మిగిలిన 15 శాతాన్ని ఉద్యోగి ఖర్చు చేయాల్సి ఉంటుంది. మంచి సిబిల్ స్కోర్ ఉంటే, 85 శాతం వరకు లోన్ సులభంగా పొందవచ్చు.

ఆస్తి సెలక్షన్

ఇంటిని కొనుగోలు చేయాలని నిర్ణయించిన తర్వాత, కొనుగోలుదారులు తప్పనిసరిగా డెవలపర్‌ చేయించే పనులపై శ్రద్ధ వహించాలి. అది కొత్తగా డెవలప్ చేసే ప్రాపర్టీ అయినా లేదా నిర్మాణంలో ఉన్నా.. మీ అవసరాలు, అంచనాలకు అనుగుణంగా నిర్మాణం చేయించుకోవడం మంచిది. అయితే ముందే నిర్ణీత ప్లాన్‌లను మీరు డెవలపర్‌కు ఇవ్వాలి.

ప్రాపర్టీ అగ్రిమెంట్
2016లో రెరా చట్టం అమల్లోకి వచ్చాక దేశంలో రియల్ ఎస్టేట్ మోసాలు చాలా వరకు తగ్గిపోయాయి. అయితే ఇప్పటికీ ప్రాజెక్టుల ఆలస్యం అనేది కొనుగోలుదారులకు పెద్ద సమస్యగా మారింది. అందుకే ప్రాపర్టీ కొనుగోలుకు ముందు డెవలపర్ అనుభవం, మార్కెట్ రెప్యుటేషన్, కంపెనీ ట్రాక్ రికార్డ్‌ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవాలి. ప్రభుత్వ వెబ్‌సైట్లలో సంబంధిత కంపెనీ RERA నంబర్, డేట్ కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒప్పందంలో డెవలపర్ పేర్కొన్న తేదీ లోపు ప్రాపర్టీ చేతికి అందకపోతే పరిహారం లేదా రీఫండ్ డిమాండ్ చేసేలా ముందే ఒప్పందం చేసుకోవాలి.