ఆర్‌బీఐ చర్యలతో తగ్గనున్న హోమ్‌లోన్స్ వడ్డీ రేట్లు..? నిపుణులు చెప్పేది తెలిస్తే షాక్

www.mannamweb.com


భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఇటీవల తన కీలక వడ్డీ రేటును యథాతథంగా ఉంచింది. ముఖ్యంగా ఆర్‌బీఐ నిర్ణయం వల్ల దేశంలో హోమ్‌లోన్స్ ఈఎంఐ పెరుగుతుందా? అనే అనుమానాలు చాలా మందికి ఉంటాయి.

రియల్ ఎస్టేట్ రంగంలో హౌసింగ్ డిమాండ్‌ను పెంచడానికి ఆర్‌బీఐ తటస్థ వైఖరి అవలంభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఫిబ్రవరి 2023 నుంచి రెపో రేటు స్థిరంగా ఉన్నప్పటికీ మరో మూడు నుంచి ఆరు నెలల్లో సెంట్రల్ బ్యాంక్ రేటు మార్పు ఉండే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. ప్రస్తుత పండుగ సీజన్‌లో హౌసింగ్ డిమాండ్‌ను పెంచడానికి ఆర్‌బిఐ కీలక వడ్డీ రేట్లను తగ్గించాల్సి ఉందని తదుపరి సమావేశంలో రెపో రేటును తగ్గించే అంశాన్ని పరిగణించాలని నిపుణులు చెబతున్నారు. అయితే రెపో రేటు నిర్ణయం వల్ల హౌసింగ్ రంగం ఏ మాత్రం పుంజుకుంటుందో? అనే అంశంపై నిపుణుల అభిప్రాయాలను తెలుసుకుందాం.

ఆర్‌బిఐ ‘తటస్థ వైఖరి’ వైపు వెళ్లడం ఆర్థిక వ్యవస్థ నిర్వహణలో జాగ్రత్తగా ఉంటుందని బేసిక్ హోమ్ లోన్స్ అడిషనల్ సీఈఓ అతుల్ మోంగా పేర్కొన్నారు. ఈ మార్పు తక్కువ గృహ రుణ వడ్డీ రేట్లకు హామీ ఇవ్వనప్పటికీ ఇది భవిష్యత్ ద్రవ్యోల్బణం ధోరణులు, మొత్తం ఆర్థిక పనితీరు ఆధారంగా రేట్ల సవరణలకు సంభావ్యతను సృష్టిస్తుందని తెలిపారు. ద్రవ్యోల్బణం అదుపులో ఉండి ఆర్థిక పరిస్థితులు స్థిరంగా ఉంటే భవిష్యత్ సమావేశాల్లో ఆర్‌బిఐ రెపో రేట్లను తగ్గించే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. డిసెంబర్ 2024 నాటికి గృహ రుణ వడ్డీ రేట్లు తగ్గడం వల్ల ఈఎంలు కూడా తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. రియల్టర్ల సంఘం నరెడ్కో ప్రెసిడెంట్ జి.హరిబాబు కూడా ఆర్‌బీఐ తదుపరి ఎంపీసీ సమావేశంలో రేట్ల తగ్గింపును పరిశీలించాలని సూచిస్తున్నారు. గృహ రుణ రేట్లపై వాస్తవ ప్రభావం ఎక్కువగా బ్యాంకులు రుణగ్రహీతలకు వడ్డీరేట్ల కోతలను ఎంత వేగంగా పంపుతాయనే దానిపై ఆధారపడి ఉంటుందని, క్రెడిట్ డిమాండ్, వ్యక్తిగత బ్యాంక్ పాలసీలు వంటి అంశాలు కూడా ఈఎంఐల తగ్గింపు ప్రభావం చూపుతాయని వివరిస్తున్నారు.

హోమ్ లోన్‌పై రెపో రేటు ప్రభావం ఇలా

రెపో రేటు తగ్గింపు

ఆర్‌బీఐ రెపో రేటును తగ్గించినప్పుడు, వాణిజ్య బ్యాంకులు సెంట్రల్ బ్యాంక్ నుంచి రుణం తీసుకోవడం తక్కువ ఖర్చు అవుతుంది. ఈ తగ్గింపు తరచుగా బ్యాంకులు గృహ రుణాలతో సహా రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడానికి దారి తీస్తుంది. ఫలితంగా రుణగ్రహీతలు తక్కువ ఈఎంఐల (ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్స్) నుంచి ప్రయోజనం పొందుతారు. ఇది ఇంటి యాజమాన్యాన్ని మరింత సరసమైనదిగా చేస్తుంది.

రెపో రేటు పెంపు

మరోవైపు, ఆర్‌బిఐ రెపో రేటును పెంచితే బ్యాంకులు రుణం తీసుకునే ఖర్చు పెరుగుతుంది. దీన్ని భర్తీ చేయడానికి బ్యాంకులు సాధారణంగా గృహ రుణాలతో సహా తమ రుణ రేట్లను పెంచుతాయి. ఇది ఫ్లోటింగ్-రేటు లోన్‌లతో రుణగ్రహీతలకు అధిక ఈఎంఐలు, కొత్త రుణగ్రహీతలకు అధిక వడ్డీ రేట్లకు దారి తీస్తుంది.