‘ఆస్కార్ 2026’ (Oscars 2026)కు భారత్ తరఫున అధికారిక ఎంట్రీ పొందిన చిత్రం ‘హోమ్‌బౌండ్’ (Homebound). ‘ది బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్’ విభాగంలో సెలెక్ట్ అయిన ఈ సినిమాలో ఇషాన్ ఖట్టర్ (Ishaan Khatter), విశాల్ జెత్వా (Vishal Jehtwa), జాన్వీ కపూర్ (Janhvi Kapoor) ప్రధాన పాత్రధారులు. సెప్టెంబరులో థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రస్తుతం ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’ (Netflix)లో స్ట్రీమింగ్ అవుతోంది. 23 చిత్రాలను వెనక్కినెట్టి అకాడమీ అవార్డుకు ఎంట్రీ పొందిన ‘హోమ్‌బౌండ్’లో ఏముంది?
స్నేహితులు కానిస్టేబుళ్లు అయ్యారా..?
అది ఉత్తరాదిలోని ఓ గ్రామం. చందన్ కుమార్ (విశాల్ జెత్వా), మహ్మద్ షోయబ్ (ఇషాన్ ఖట్టర్) మంచి స్నేహితులు. వేర్వేరు సామాజిక వర్గాలు, మతాలకు చెందిన వారు సమాజంలో అవమానాలకు గురవుతుంటారు. ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించి, తమకంటూ గుర్తింపు పొందేందుకు ప్రయత్నాలు మొదలుపెడతారు. పోలీసు కావడమే ఇద్దరి లక్ష్యం. అలా కానిస్టేబుల్ పరీక్ష రాసినా.. ఫలితాల కోసం నిరీక్షించాల్సిన పరిస్థితి. కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండటంతో షోయబ్ ఓ కంపెనీలో ఆఫీస్ బాయ్‌గా చేరతాడు. చందన్ డిగ్రీ చదివేందుకు.. తాను ఇష్టపడిన సుధా భారతి (జాన్వీ కపూర్) చదివే కాలేజీలో జాయిన్ అవుతాడు. ఆ తర్వాత ఊహించని రీతిలో చందన్, షోయబ్ మధ్య మనస్పర్థలొస్తాయి. దానికి కారణమేంటి? ఇద్దరూ ఒకే ఫ్యాక్టరీలో పని చేసేందుకు దారి తీసిన పరిస్థితులేంటి? అప్పటికైనా మళ్లీ కలిశారా? వారి జీవితాల్లో కొవిడ్ ప్రభావమెంత? అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్నారా, లేదా? అన్నది ఈ సినిమా కథ (Homebound Story).
నిజ జీవిత సంఘటనలు..
వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందిన సినిమా ఇది. స్నేహం, వివక్ష, ప్రభుత్వ ఉద్యోగానికి ఉండే పోటీ, కొవిడ్ కష్టాలు.. ఇలా పలు పార్శ్వాలతో కూడిన ఈ కథను ఎవరే కోణంలో చూస్తే అదే ప్రధానాంశంగా అనిపిస్తుంది. ఇప్పటి వరకూ చూడని కథేమీ కాదు, తర్వాత ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ రేకెత్తించే మలుపులూ ఉండవు. నెమ్మదిగా సాగినా ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. వాస్తవిక కథకు తగ్గట్టే ప్రధాన పాత్రధారులు సహజ నటనతో కట్టిపడేస్తారు. ఎలాంటి కమర్షియల్ హంగుల్లేని ఈ సినిమాని మనసు పెట్టి చూడాల్సిందే (Homebound Review).
స్నేహితులైన చందన్, షోయబ్‌ల లక్ష్యమేంటన్నది ప్రారంభంలోనే అర్థమవుతుంది. ప్రభుత్వ ఉద్యోగానికి ఉండే తీవ్ర పోటీ, పరీక్ష రాసినా ఫలితం తేలకపోతే అభ్యర్థులు పడే మనోవేదన, ఒకవేళ పరీక్షలన్నింటిలో పాస్ అయినా పోస్టింగ్ ఆలస్యం కావడం, చివరకు సర్కారు కొలువుపై ఆశలు వదులుకుని ఏదో ఒక పనిలో చేరడం.. ఇలా మన చుట్టూ జరిగిన, జరుగుతున్న వాటిని కళ్లకు కడుతూ కథలోకి లీనమయ్యేలా చేశారు దర్శకుడు. చందన్ పాత్ర కోణంలో కుల వివక్ష, షోయబ్ పాత్ర వైపు నుంచి మతపరమైన ఇబ్బందులే ప్రధానాంశాలు. స్నేహితుల మధ్య గొడవ జరిగినప్పటి నుంచి స్టోరీ ఎమోషనల్‌గా సాగుతుంది. లాక్‌డౌన్ వీరిద్దరి జీవితాలను ఎలా ప్రభావితం చేసిందో తెలిపే సన్నివేశాలు హత్తుకుంటాయి. స్నేహితుడి విషయంలో షోయబ్ నిస్సాహయక స్థితి హృదయాన్ని బరువెక్కిస్తుంది. క్లైమాక్స్ కూడా అదే స్థాయిలో ఉంటుంది.
ఆకట్టుకునేలా నటన..
ఇషాన్, విశాల్ ఒకరికొకరు పోటీ పడి నటించారు. సుధా భారతిగా జాన్వీ కపూర్ కనిపించేది కొద్దిసేపే అయినా ఆకట్టుకుంటారు. అభినయానికి స్కోప్ ఉన్న పాత్ర ఆమెది. తొలి సినిమా ‘మసాన్’తోనే ప్రపంచవ్యాప్త సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించిన దర్శకుడు నీరజ్ ఘైవాన్.. పదేళ్ల తర్వాత ‘హోమ్‌బౌండ్’తో మరోసారి సత్తా చాటారు. ఈ ఏడాది కేన్స్‌కు ఎంపికైన ఏకైక భారతీయ చిత్రం ఇదే కావడం విశేషం. ‘ఆస్కార్’ ఎంట్రీతోపాటు ఇటీవల జరిగిన టొరంటో అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో రెండో రన్నరప్‌గా ఇంటర్నేషనల్ పీపుల్స్ ఛాయిస్ అవార్డునూ గెలుచుకుంది.
- కుటుంబంతో కలిసి చూడొచ్చా?: ఈ సినిమాలో అసభ్యత లేదు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ప్రస్తుతానికి హిందీలోనే స్ట్రీమింగ్ అవుతోంది. రన్‌టైమ్ దాదాపు 2 గంటలు.
- చివరిగా: హృదయాన్ని హత్తుకునే ‘హోమ్‌బౌండ్’ (Homebound Review)!
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
































