నేటి జీవనశైలి కారణంగా గుండెపోటు రోగుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. గుండెపోటుకు ప్రధాన కారణాలలో ఒకటి శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం. కొలెస్ట్రాల్‌తో బాధపడుతున్నట్లు నిర్ధారణ అయితే మనకు తెలియకుండానే రోగాలు పుట్టుకొస్తూనే ఉంటాయి.
క్రమరహిత జీవనశైలి, అనారోగ్య ఆహారపు అలవాట్లు ఈ వ్యాధికి ప్రధాన మూలం. దీని నుంచి బయటపడేందుకు కేవలం వైద్యులు సూచించే మందులు మాత్రమే తీసుకుంటే సరిపోదు.రక్తంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగినప్పుడు.. ఓ విధమైన జిగట పదార్థం రక్తంలో తేలుతుంది. ఇది అధికంగా ఉంటే ధమనుల్లో కూరుకుపోతుంది. ఫలితంగా రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడుతుంది. ఫలితంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. రక్త ప్రసరణకు ఆటంకం ఏర్పడినప్పుడు శరీరంలో రకరకాల సమస్యలు వస్తాయి. వివిధ లక్షణాల ద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిందో లేదో తేలికగా గుర్తించవచ్చు.
వాటిలో ఒకటి మన కళ్ళు. సాధారణంగా మనం వైద్యుల వద్దకు వెళ్లినప్పుడు తొలుత కళ్లను పరీక్షించి అనేక రోగాలను నిర్ధారిస్తారు. అలాగే కొలెస్ట్రాల్ కూడా. శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను కంటి లక్షణాల ద్వారా కూడా అర్థం చేసుకోవచ్చు. ఎలాగంటే..
కొలెస్ట్రాల్ అధికంగా ఉంటే కార్నియా చుట్టూ తెల్లటి వలయం కనిపిస్తుంది. సాధారణంగా ఇలా వృద్ధులలో కనిపిస్తుంది. శాస్త్రీయ పరిభాషలో దీనిని ఓర్కాస్ అంటారు. ఇది సాధారణమైనది. అయితే యవ్వనంలో ఉండగానే కళ్ల చుట్టూ తెల్లటి వలయాలు ఉంటే, అది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగినట్లు సూచిస్తుంది.
కళ్ల చుట్టూ ఏదైనా అసాధారణ గడ్డలు కనిపించినా అప్రమత్తంగా ఉండాలి. కళ్ల చుట్టూ తెల్లగా లేదా పసుపు రంగులో చిన్న చిన్న ముద్దలు మాదిరి గుల్లలు పెరిగితే రక్తంలో కొలెస్ట్రాల్ పెరిగిందని అర్థం చేసుకోవాలి. ఈ సమస్యను శాంథెలాస్మా అంటారు.
అధిక కొలెస్ట్రాల్ కూడా రెటీనాలో సమస్యలను కలిగిస్తుంది. అస్పష్టమైన దృష్టి, కళ్ళచుట్టూ నల్లటి వలయాలు కనిపిస్తే అప్రమత్తంగా ఉండాలి. కాబట్టి ఈ లక్షణాలలో ఏవైనా కనిపిస్తే వైద్యుడిని వెంటనే సంప్రదించడం మర్చిపోకండి