సొంతిల్లు ప్రతి ఒక్కరి కల.. కావాల్సిన స్థలం ఉన్నప్పటికీ నిర్మాణానికి ఎంత వ్యయం అవుతుందోనని చాలామంది తర్జనభర్జన పడుతుంటారు.
స్థానిక సంస్థల అనుమతుల దగ్గర నుంచి మెటీరియల్, లేబర్ కాంట్రాక్ట్ ఇలా ప్రతిదానికి అయ్యే ఖర్చుపై సందేహాలు బుర్రను తొలిచేస్తుంటాయి. పునాదులు మొదలు నిర్మాణం పూర్తయ్యే వరకు దశలవారీగా వ్యయాలు ఉంటాయి. 170 గజాల్లో ఇంటి నిర్మాణం చేపడితే ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఎంత ఖర్చవుతుందంటే?
అనుమతి తప్పనిసరి..
గృహ నిర్మాణానికి స్థానిక సంస్థల నుంచి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. పంచాయతీ లేదా పురపాలిక, కార్పొరేషన్ నుంచి పొందాల్సి ఉంటుంది. నగర శివారు పురపాలికల పరిధిలో 150 నుంచి 170 గజాల్లో… ఎల్‌ఆర్‌ఎస్ ఉంటే రూ.50 వేల నుంచి రూ.60 వేల వరకు ఖర్చవుతుంది. ఎల్‌ఆర్‌ఎస్ లేకపోతే అనుమతుల వ్యయం పెరుగుతుంది.
బేస్‌మెంట్ వరకు..
మొదట స్థలాన్ని పొక్లెయిన్‌తో చదును చేసుకోవాలి. ఇందుకు రూ.5 వేల వరకు వెచ్చించాల్సి వస్తుంది. నిర్మాణానికి ప్లాన్ అన్నింటికంటే ముఖ్యం. ఇంజినీర్‌తో ఇంటి ప్లాన్ సిద్ధం చేయిస్తే రూ.10 వేల నుంచి రూ.15 వరకు తీసుకుంటారు. మంచి ముహూర్తం చూసుకొని భూమి పూజ చేసుకుంటే.. పూజా సామగ్రి, పూజారికి సుమారు రూ.10 వేలు అవుతుంది. ఆపై బోరింగ్ వేయాలి. హైదరాబాద్‌లో 500 అడుగులపైన వేస్తేనే నీరు పడుతుంది. బోర్‌తో పాటు మోటార్ ఏర్పాటుకు ఇంచుమించు రూ.1.50 లక్షల వరకు వెచ్చించాలి. నిర్మాణ దశలో తాత్కాలిక మీటరుతో పాటు బిల్లులు, నిర్మాణానంతరం పూర్తిస్థాయి మీటరుకు రూ.10వేల వరకు ఖర్చు చేయాల్సిందే.
స్తంభాలు (పిల్లర్లు) వేసేందుకు పునాదులు తవ్వాలి. రెండు పడక గదులతో ఇంటి నిర్మాణానికి ప్లాన్ ప్రకారం 12 పిల్లర్ గుంతలు తీయించడానికి రూ.15 వేలు అవుతుంది. బేస్‌మెంట్ నిర్మాణంలో భాగంగా.. నిర్దేశించిన హద్దుల్లో బండరాళ్లతో కట్టి మధ్యలో మట్టిని నింపేందుకు రూ.80 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు ఖర్చు వస్తుంది. ఆపై సంపు, గేటు, మెట్ల దగ్గర రెయిలింగ్, వాటర్ ట్యాంకుల ఏర్పాటుకు రూ. లక్ష వ్యయం తప్పదు. అంటే అనుమతుల దగ్గర నుంచి బేస్‌మెంట్ వరకు దాదాపు నాలుగైదు లక్షలు ఖర్చు చేయాల్సిందే.
సామగ్రి వ్యయాలు ఇలా..
ఒక గజం అంటే 9 చదరపు అడుగులు… 170 గజాలంటే 1530 చదరపు అడుగులు అవుతుంది. నిబంధనల ప్రకారం చుట్టూ ఖాళీ స్థలం వదిలి 150 గజాల్లో నిర్మాణం చేపడితే 1350 చదరపు అడుగులు వస్తుంది.
- అన్ని అవసరాలకు కలిపి 500 నుంచి 550 సిమెంట్ బస్తాలు కావాల్సి వస్తుంది. ఒక్కో బస్తా ధర రూ.300 నుంచి రూ.400 వరకు ఉంది. సగటు బస్తా రూ.350 లెక్క తీసుకుంటే 550 బస్తాలకు రూ.1.92 లక్షలు.
- ఇసుక 80 టన్నుల వరకు కావాలి. టన్ను రూ.1600 నుంచి రూ.1800 ధర ఉంది. సగటున రూ.1700కు కొనుగోలు చేస్తే 80 టన్నులకు రూ.1.36 లక్షలు.
- 8 టన్నుల స్టీలు అవసరం. ధర టన్ను రూ.58 వేల నుంచి రూ.70 వేలకు పైగా ఉంది. రూ.65 వేల రకం కొనుగోలు చేస్తే.. 8 టన్నులకు రూ.5.20 లక్షలు.
- కంకర 15 యూనిట్ల వరకు అవసరం. యూనిట్ ధర రూ.4 వేలు అనుకుంటే రూ.60 వేలు.
- ఇటుకలు 17 వేలు అవసరం. ఒక్కో ఇటుక రూ.7.50 నుంచి రూ.12కు పైగా ఉంది. సరాసరి ఒక్కో ఇటుక రూ.10గా లెక్కిస్తే..మొత్తం రూ.1.70 లక్షలు.
- ఇంటి కట్టుబడికి లేబర్ కాంట్రాక్ట్ చదరపు అడుగుకి రూ.350 నుంచి రూ.400కు పైనే ఉంది. రూ.400కు మాట్లాడుకుంటే 1350 చ.అడుగులకు రూ.5.40 లక్షలు చెల్లించాలి. సొంతంగా చేయించుకునే వారూ ఉన్నారు.
- సాధారణ పెయింటింగ్స్‌కి రూ. లక్ష వరకు, విద్యుత్తు సామగ్రికి మరో రూ.లక్ష అవుతుంది.
ఫ్లోరింగ్‌కి సుమారు 1500కుపైగా చదరపు అడుగుల టైల్స్ అవసరం. టైల్స్ చ.అ.కి రూ.100 నుంచి రూ.120 వరకు లభిస్తున్నాయి. రూ.100 చొప్పున 1500 చ.అ.కి రూ.1.50 లక్షల ఖర్చవుతుంది. వంట గది మినహా మిగిలిన గదుల్లో ఫాల్‌సీలింగ్‌కు రూ.50 వేల వరకు వ్యయం వస్తుంది. ఇలా మొత్తంగా సుమారు రూ.25 లక్షల వరకు ఖర్చవుతుంది. వాడే సామగ్రిని బట్టి రూ.20 లక్షల లోపు పూర్తి చేసేవారు, అదనపు హంగులతో రూ.40 లక్షలకు పెంచుకునే వారూ ఉన్నారు. సగటున చ. అడుగుకు రూ.1650 నుంచి రూ.1850 వరకు ఖర్చవుతుందని బిల్డర్లు చెబుతున్నారు. ఇంటీరియర్ అలంకరణ ఖర్చులు అదనం. వాడే ఉత్పత్తులను బట్టి రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు అవసరమవుతాయి.
































