రోజూ ఎంత తినాలి..? ఏం తినాలి..? సీఎం చంద్రబాబు చెప్పిన విలువైన ఆరోగ్య చిట్కాలు

అందరు ఆరోగ్యంగా ఉంటేనే దేశం ఆరోగ్యంగా ఉంటుంది. అయితే చాలా వ్యాధుల నివారణకు డైట్ కంట్రోల్ మస్ట్‌. ఇప్పుడున్న లైఫ్‌ స్టైల్‌కు అనుగుణంగా ఫుడ్‌ హ్యాబిట్స్‌ ఛేంజ్‌ అవ్వకపోతే డేంజర్‌ అని వైద్యులు హెచ్చరిస్తూనే ఉంటారు.


ముఖ్యంగా మనం నిత్యం ఆహారంలో వాడే ఉప్పు, వంటనూనె, చక్కెర వినియోగంలో నియంత్రణ లేకపోతే చాలా ప్రమాదం. అసలు మన శరీరానికి రోజుకు ఎంత రేషన్‌ అవసరం..? మనం ఏ స్థాయిలో తీసుకుంటున్నాం..? ఎంత తగ్గించాలి..? ఇదే అంశంపై ఇటీవల మోదీ మాట్లాడితే ఇప్పుడు.. ఏపీ సీఎం చంద్రబాబు కూడా కొన్ని చిట్కాలు చెప్పారు.

అమరావతిలో గ్లోబల్‌ మెడ్‌సిటీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నామన్న చంద్రబాబు.. వైద్యం, ఆరోగ్యంపై పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇచ్చారు. చాలా వ్యాధుల నివారణ కోసం మంచి ఆహారపు అలవాట్లు పాటించాలని సూచించారు. అనారోగ్య సమస్యలు దరిచేరకుండా ఒక కుటుంబం ఉప్పు, వంటనూనె, చక్కెర వినియోగం ఎంత మోతాదులో తగ్గించాలో ఆయన వివరించారు. నలుగురు సభ్యులు కలిగిన సాధారణ కుటుంబం రోజుకు 4 గ్రాముల ఉప్పు చొప్పున నెలకు 600 గ్రాములే తీసుకోవాలి. వంటనూనె కూడా రోజుకు 15 గ్రాములు చొప్పున నెలకు 2 లీటర్లు మాత్రమే వినియోగించాలి.

చక్కెర రోజుకు 25 గ్రాముల చొప్పున నెలకు 3 కిలోలు వాడితే సరిపోతుంది. అంటే ఒక వ్యక్తి రోజుకు ఒక గ్రాము ఉప్పు మాత్రమే తీసుకోవాలి. నూనె 3.75 గ్రాములు. షుగర్‌ 6.25 గ్రాములు తీసుకోవాలి. పొగాకు, ఆల్కహల్, డ్రగ్స్‌కు కూడా దూరంగా ఉండాలని సూచించారు చంద్రబాబు. మిల్లెట్స్‌, బ్రౌన్ రైస్ ఎక్కువగా అలవాటు చేసుకోవాలన్నారు. స్కూల్ ఎడ్యుకేషన్‌ నుంచే పిల్లలకు ఫుడ్ హ్యాబిట్స్‌పై అవగాహన కల్పించాలని సూచించారు. హ్యాపీగా ఉండాలంటే మంచి అలవాట్లు అవసరమన్నారు.

ఇటీవల మోదీ కూడా దేశంలో పెరుగుతున్న ఊబకాయ సమస్యపై ఆందోళన వ్యక్తం చేశారు. 2050 నాటికి 44 కోట్ల మంది భారతీయులు ఊబకాయులుగా మారుతారని అధ్యయనాలు చెబుతున్నాయని గుర్తుచేశారు. ప్రతి ముగ్గురిలో ఒకరు ఊబకాయంతో అవస్థలు పడే ప్రమాదం ఉందన్నారు. ఊబకాయం సమస్య నివారణకు మోదీ ఓ చిట్కా చెప్పారు. ఆహారంలో నూనె వినియోగాన్ని తగ్గించాలని సూచించారు. వంట నూనెల వినియోగాన్ని కనీసం 10 శాతం తగ్గించుకోవాలని సూచించారు. లేకపోతే భవిష్యత్తులో ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.