ప్రస్తుత కాలంలో యువతపై నోటి, దవడ, నాలుక క్యాన్సర్లు పంజా విసురుతున్నాయి. వీటినే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్లుగా వ్యవహరిస్తుంటారు. హైదరాబాద్ నగరంలో గుట్కా, ఖైనీ, తంబాకు తదితర పాన్ మసాలాలు అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. నిషేధం ఉన్నప్పటికీ కిరాణ దుకాణంలో ఇవి సులువుగా లభ్యమవుతున్నాయి. ఏప్రిల్ హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ల అవగాహన మాసం సందర్భంగా ప్రత్యేక కథనం.
బాధితుల్లో 25-45 వయసు వారే ఎక్కువ : చిన్నవయసులోనే చాలామంది గుట్కా, పాన్ మసాలా, పొగతాగడం లాంటి అలవాట్లకు బానిస కావడం వల్ల నోటి, నాలుక, గొంతు ఇతర క్యాన్సర్ల బారిన పడుతున్నారు. ఎంఎన్‌జే హాస్పిటల్‌కు వస్తున్నవారిలో ఇవే అధిక శాతం ఉంటున్నాయి. బాధితుల్లో 25-45 ఏళ్ల వయసు వారే ఎక్కువ మంది ఉంటున్నట్లు సమాచారం. ఉపాధి, ఇతర కూలీనాలీ కోసం వస్తున్న యువత పాన్‌మసాలా, గుట్కా లాంటి వాటికి బానిసగా మారుతున్నారు.
కొంతమంది దవడ కింద గుట్కా, ఖైనీలు గంటల తరబడి ఉంచుకోవడం వల్ల ఆ ప్రాంతాల్లో పూత ఏర్పడి పుండుగా మారి క్యాన్సర్ మహమ్మారికి దారి తీస్తోంది. పోలీసులు ఎప్పటికప్పుడు దాడులు నిర్వహించి పెద్దమొత్తంలో మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకుంటున్నప్పటికీ దందామాత్రం ఆగడం లేదు. బాధితుల్లో 80 శాతం మంది వ్యాధి ముదిరిన తర్వాతే డాక్టర్లను సంప్రదిస్తున్నారు.
తొలి దశలో గుర్తిస్తే నివారించవచ్చు : 15ఏళ్లప్పుడు వీటికి(గుట్కా, ఖైనీలు) అలవాటు పడితే 25ఏళ్లు వచ్చే సరికి నోటి క్యాన్సర్‌గా మారుతుంది అని ప్రభుత్వ క్యాన్సర్ చికిత్స నిపుణులు జయలత చెబుతున్నారు. నోట్లో పుండ్లు ఉంటే వెంటనే డాక్టర్లను చూపించుకోవడం ఉత్తమమని తెలిపారు. నోటి శుభ్రతను పాటించడం అవసరమని ఆమె వివరించారు. కొంతమందికి అడ్డదిడ్డంగా దంతాలు దవడ లోపలకు చొచ్చుకుని పోయి ఉంటాయని డాక్టర్ జయలత వివరించారు.
దీర్ఘ కాలంలో నోటి క్యాన్సర్‌గా మారే ప్రమాదం : దవడకు పదేపదే గుచ్చుకోవడం వల్ల అది పుండుగా మారి దీర్ఘకాలంలో నోటి క్యాన్సర్‌గా మారే ప్రమాదం కూడా ఉంటుందని డాక్టర్ జయలత వివరించారు. నోటి, నాలుక, దవడ క్యాన్సర్లను తొలిదశలోనే గుర్తిస్తే పూర్తిగా వాటిని నయం చేయవచ్చన్నారు. 60-70శాతం మంది వ్యాధి ముదిరిన తర్వాతే డాక్టర్ల వద్దకు వస్తున్నారు. దీంతో దవడ, నాలుక తొలగించడం తప్పనిసరి అవుతోందని ఆమె వివరించారు.
ఈ లక్షణాలు గమనిస్తే అశ్రద్ధ వద్దు
తరచూ జ్వరం
బరువు తగ్గడం, నీరసం
ఆకలి లేకపోవడం
గొంతు బొంగురుపోవడం, మింగటానికి కష్టం
నోట్లో, దవడలు, నాలుకపై పుండ్లు
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.