మనం సడెన్‌గా గదిలోకి అడుగుపెట్టామనుకుందాం… మన గురించి మాట్లాడుకుంటే వెంటనే టాపిక్ చేంజ్ చేస్తారు. సమ్‌థింగ్ రాంగ్ అని మనకు అనిపిస్తుంది.
ఎందుకంటే వారు మాట్లాడే మాటలకు బాడీ లాంగ్వేజ్‌కు పొంతన ఉండదు. నోరు ఒకటి చెప్తే శరీర భాష మరొకటి సూచిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో మనుషుల భావాల గురించి అర్థం చేసుకోవడం ముఖ్యం. ఇలాంటి స్కిల్స్ తోడైతే నకిలీ మనుషులకు దూరంగా ఉండొచ్చు. జీవితంలో జరగబోయే కొన్ని ప్రతికూల పరిణామాలను ఆపొచ్చు. ఇంతకీ ఎలా గుర్తించాలి? మనుషులను ఎలా చదవొచ్చు? తెలుసుకుందాం.
1. మైక్రోఎక్స్‌ప్రెషన్స్
మైక్రోఎక్స్‌ప్రెషన్స్ ముఖ కవళికలను సూచిస్తాయి. ఇవి నిజమైన భావాలను వివరిస్తాయి. ఒక్క క్షణం మాత్రమే ఉండే వీటిని.. నిశితంగా పరిశీలిస్తే గుర్తించొచ్చు. ఎదుటి వ్యక్తి మన ప్రజెన్స్‌తో సంతోషంగా ఉన్నాడా? ఇబ్బంది పడుతున్నాడా? ఆశ్చర్యంతో ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడా? అనేది కూడా చెప్పొచ్చు. కళ్లతో నవ్వే చిరునవ్వు సంతోషాన్ని సూచిస్తే.. పైకి లేచిన కను బొమ్మలు, పెద్దగా తెరిచిన కళ్లు ఆశ్చర్యాన్ని సూచిస్తాయి. ముక్కు ముడుచుకోవడం వికారానికి ప్రతీక.
2. బాడీ లాంగ్వేజ్
ఎదుటి వ్యక్తి మనతో నిజంగా మనస్ఫూర్తిగా మాట్లాడుతున్నాడా లేదా అనేది మాటలతోనే కాదు బాడీ లాంగ్వేజ్‌తో కూడా చెప్పేయొచ్చు. చేతులు, కాళ్లను కదిలిస్తే అసౌకర్యంగా ఉన్నట్లు కాగా ముందుకు వంగి వినడం ఆసక్తిని సూచిస్తుంది. చెవులు రిక్కించి మరీ వినడం ఉత్సాహం కిందకు వస్తుండగా.. పెదవులు ముడుచుకోవడం ఇంట్రెస్ట్ లేనట్లుగా.. చెప్పే వ్యక్తి కదలికలను ఫాలో కావడం మమేకమైనట్లుగా సూచిస్తుంది.
3. కంటి కదలికలు
కళ్లను ఆత్మకు విండోస్‌గా అభివర్ణిస్తారు. కళ్లలోకి చూసి మాట్లాడటం నిజాయితీ, ధైర్యాన్ని సూచిస్తే.. ఐ కాంటాక్ట్ లేకుండా ఉండటం అన్‌కంఫర్ట్, నిజాయితీ లేకపోవడానికి సంకేతం. మనం మాట్లాడేటప్పుడు మనవైపు కాకుండా మరోవైపు చూడటం.. అక్కడి నుంచి వెళ్లిపోతే బాగుండు అనే ఫీలింగ్ కావొచ్చు. లేదంటే అయోమయంలో ఉండొచ్చు.
4. టోన్ ఆఫ్ వాయిస్
ఏం మాట్లాడుతున్నారనే దాని కంటే ఎలా మాట్లాడుతున్నారనేది చాలా ముఖ్యమైనది అంటున్నారు నిపుణులు. వాయిస్ మాడ్యులేషన్స్‌లో భావాలు దాగి ఉంటాయి. గట్టి గట్టిగా మాట్లాడటం, అరవడం కోపం, ఉత్సాహానికి సూచిక. కాగా మాటల్లో తడబాటు భయం, అయోమయానికి కారణంగా చెప్పబడుతుంది. వినబడి వినబడనట్లు ఉండే వాయిస్.. ఇంట్రెస్ట్ లేదనేందుకు సిగ్నల్.
































