ఒక చోటు నుంచి మరొక చోటుకి వెళ్లేందుకు చాలామంది రైలు ప్రయాణాలు చేస్తుంటారు. అయితే దూర ప్రయాణాల కోసం చాలామంది ముందుగానే రైలు టిక్కెట్లు బుక్ చేసుకుంటారు.
అయితే ఆకస్మిక పని లేదా మరేదైనా కారణంతో కొన్ని సందర్భాల్లో అనుకోని కారణాలతో రిజర్వేషన్ ఉండి కూడా కొంతమంది ప్రయాణం చేయరు. ఇలాంటి పరిస్థితుల్లో చాలా మంది ప్రయాణికులు తమ టిక్కెట్లను రద్దు చేసుకుంటున్నారు. చాలా మంది తమకు వేరే మార్గం లేదని భావిస్తున్నారు. కానీ టిక్కెట్‌ను రద్దు చేయడమే కాకుండా, మీరు మీ టిక్కెట్‌ను మరొకరికి ట్రాన్స్ ఫర్ లేదా బదిలీ చేయవచ్చు. రిజర్వ్డ్ ట్రైన్ టిక్కెట్లను బదిలీ చేయడానికి రైల్వే ప్రత్యేక నిబంధనలను రూపొందించింది. ప్రతి రైల్వే ప్రయాణీకుడు ఈ నిబంధనల గురించి తెలుసుకోవాలి.
రైల్వే నిబంధనల ప్రకారం.. మీరు ఏ కారణం చేతనైనా ప్రయాణం చేయకపోతే మీ కన్ఫర్మ్ టిక్కెట్‌ను ఎవరికి పడితే వాళ్లకు ట్రాన్స్ ఫర్ చేయడానికి వీల్లేదు. కేవలం మీ కుటుంబ సభ్యులకు మాత్రమే టిక్కెట్ ను బదిలీ చేయవచ్చు. అంటే తండ్రి, తల్లి, సోదరుడు, సోదరి, కుమారుడు, కుమార్తె, భర్త, భార్యకు మాత్రమే టిక్కెట్ ని ట్రాన్స్ ఫర్ చేయవచ్చు. టిక్కెట్ ని ట్రాన్స్ ఫర్ చేయడం వల్ల ఎలాంటి క్యాన్సిలేషన్ ఛార్జీ(Cancellation charge) కూడా ఉండదు.
టిక్కెట్లు ఇలా ట్రాన్స్ ఫర్ చేయబడతాయి
రైలు బయలుదేరడానికి 24 గంటల ముందు మాత్రమే ప్రయాణికుల పేరును రిజర్వేషన్ కౌంటర్ నుండి మార్చవచ్చు. టికెట్‌ను కౌంటర్‌లో కొనుగోలు చేసినా లేదా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నా పేరు మార్చడానికి టికెట్ కౌంటర్‌కు వెళ్లాలి. టికెట్ ప్రింట్ అవుట్, టికెట్ బదిలీ చేయబోయే వ్యక్తి యొక్క గుర్తింపు కార్డు జిరాక్స్ ని రిజర్వేషన్ కౌంటర్‌లో సమర్పించాలి. దీని తర్వాత ఆన్‌లైన్‌లో లేదా కౌంటర్‌లో కొనుగోలు చేసిన టిక్కెట్‌పై పేరు మారుతుంది.
వెయిటింగ్ లేదా RACలో ఈ సదుపాయం
టిక్కెట్లను ఒక్కసారి మాత్రమే బదిలీ చేయవచ్చు. అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే వెయిటింగ్ లేదా RAC టిక్కెట్‌లను బదిలీ చేయలేరు.