పీపీఎఫ్ నుంచి డబ్బులు ఎలా తీయాలి? విత్‌డ్రా ప్రక్రియ, కీలక రూల్స్ ఇవే

సుదీర్ఘకాల పొదుపునకు భరోసా ఇచ్చే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకునేందుకు ఐదేళ్ల తర్వాత పాక్షిక ఉపసంహరణకు అనుమతి ఉంటుంది. ఇందుకోసం ఇన్వెస్టర్లు తప్పనిసరిగా ఫామ్-సి నింపాలి. దాంతో పాటు పీపీఎఫ్ పాస్‌బుక్ జతచేసి బ్యాంకులో సమర్పించాలి.

భారతదేశంలో దీర్ఘకాలిక పొదుపునకు అత్యంత విశ్వసనీయమైన, ప్రభుత్వ మద్దతు ఉన్న పథకాల్లో పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) ముందుంటుంది. ముఖ్యంగా రిస్క్ తీసుకోని సంప్రదాయ ఇన్వెస్టర్లకు ఇది చాలా భరోసా ఇస్తుంది. పీపీఎఫ్ మెచ్యూరిటీ కాలం 15 ఏళ్లు అయినప్పటికీ, కొన్ని షరతులకు లోబడి గడువుకు ముందే పాక్షికంగా డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు ఇది అనుమతిస్తుంది.


పీపీఎఫ్ నుంచి డబ్బులు ఎలా ఉపసంహరించుకోవాలి అనేదానిపై పూర్తి వివరాలు, కీలక నియమ నిబంధనలు ఇక్కడ వివరంగా ఉన్నాయి.

పీపీఎఫ్ నిధులను విత్‌డ్రా చేసే విధానం

స్టెప్ 1: ఫామ్ డౌన్‌లోడ్ చేసుకోండి: పీపీఎఫ్ నుంచి డబ్బులు విత్‌డ్రా చేసుకోవాలంటే, ఖాతాదారుడు ముందుగా ‘ఫామ్-సి’ అని పిలిచే పీపీఎఫ్ విత్‌డ్రాయల్ ఫామ్‌ను తమ బ్యాంకు వెబ్‌సైట్ నుంచి లేదా బ్యాంకు శాఖ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవాలి.

స్టెప్ 2: వివరాలు నింపండి: ఈ ఫామ్‌లో మీరు విత్‌డ్రా చేయాలనుకుంటున్న మొత్తం, ఖాతా ఎన్ని సంవత్సరాలుగా యాక్టివ్‌గా ఉందనే వివరాలను ఖచ్చితంగా నమోదు చేయాలి.

స్టెప్ 3: పాస్‌బుక్ జత చేయండి: నింపిన ఫామ్-సికి మీ పీపీఎఫ్ పాస్‌బుక్ కాపీని తప్పనిసరిగా జతచేయాలి.

స్టెప్ 4: సమర్పించండి: ఈ డాక్యుమెంట్లను మీ సంబంధిత బ్యాంక్ శాఖలో సమర్పించాలి.

ఒకవేళ మీకు పీపీఎఫ్ ఖాతాపై ఏదైనా లోన్ బకాయి ఉంటే, విత్‌డ్రాకు అర్హత పొందిన మొత్తం నుంచి ఆ లోన్ సొమ్మును మినహాయించి మిగిలిన మొత్తాన్నే ఖాతాదారుడికి చెల్లిస్తారని క్లియర్ ట్యాక్స్ (Clear Tax) సంస్థకు చెందిన పన్ను నిపుణులు సీఏ చాందిని ఆనందన్ వివరించారు.

పీపీఎఫ్ విత్‌డ్రాలలో ఎన్ని రకాలు?

మీరు పెట్టుబడి పెట్టిన నిధులను ఎప్పుడు, ఎలా యాక్సెస్ చేసుకోవచ్చో తెలుపుతూ ప్రభుత్వం పీపీఎఫ్ విత్‌డ్రాయల్ నియమాలను రూపొందించింది. ఈ నియమాలను ప్రధానంగా మూడు రకాలుగా వర్గీకరించారు.

  • పాక్షిక ఉపసంహరణ (Partial Withdrawal)
  • ముందస్తు మూసివేత (Premature Closure)
  • మెచ్యూరిటీ తర్వాత ఉపసంహరణ (Withdrawal after Maturity)

పాక్షిక ఉపసంహరణ వివరాలు

పీపీఎఫ్ ఖాతా తెరిచిన ఆర్థిక సంవత్సరం ముగిసిన తర్వాత ఐదేళ్లు పూర్తయితేనే ముందస్తుగా లేదా పాక్షికంగా డబ్బును విత్‌డ్రా చేసుకునేందుకు అనుమతి ఉంటుంది. ఉదాహరణకు, మీరు 2010-11 ఆర్థిక సంవత్సరంలో పీపీఎఫ్ ఖాతా తెరిచి ఉంటే, 2016-17 ఆర్థిక సంవత్సరంలో లేదా ఆ తర్వాత మాత్రమే విత్‌డ్రా చేసుకోవడానికి అర్హులు.

గరిష్టంగా ఎంత విత్‌డ్రా చేయవచ్చు?

పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవడానికి అనుమతించే గరిష్ట మొత్తం ఒక పరిమితి ఉంటుంది. విత్‌డ్రా చేసుకునే సంవత్సరం ముందు నాలుగో సంవత్సరం చివర్లో ఉన్న బ్యాలెన్స్ లేదా అంతకు ముందు సంవత్సరం చివర్లో ఉన్న బ్యాలెన్స్… ఈ రెండింటిలో ఏది తక్కువైతే, ఆ మొత్తంలో 50% వరకే విత్‌డ్రా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ఒకవేళ ఖాతాలో ఏదైనా సంవత్సరంలో కనీస డిపాజిట్ ( 500) చేయకపోతే, ఆ ఖాతా ‘నిలిపివేసినది’గా పరిగణిస్తారు. అలాంటప్పుడు, ఖాతాను తిరిగి యాక్టివేట్ చేసేంత వరకు విత్‌డ్రాలకు అనుమతి లభించదు.

పాక్షిక విత్‌డ్రా లెక్క: ఒక ఉదాహరణ

పాక్షికంగా ఎంత విత్‌డ్రా చేసుకోవచ్చో సీఏ చాందిని ఆనందన్ ఒక ఉదాహరణతో వివరించారు. మిస్టర్ ‘ఏ’ తన రిటైర్మెంట్ పొదుపు కోసం 31 జనవరి 2021న (ఫైనాన్షియల్ ఇయర్ 2020–21) పీపీఎఫ్ ఖాతా తెరిచారు. మొదట్లో 1 లక్ష డిపాజిట్ చేసి, ప్రతి సంవత్సరం 10,000 క్రమం తప్పకుండా జమ చేస్తూ ఖాతాను యాక్టివ్‌గా ఉంచారు.

ఇప్పుడు, 31 జులై 2026 నాటికి మిస్టర్ ‘ఏ’కి అత్యవసరంగా డబ్బు అవసరమై, పాక్షిక ఉపసంహరణకు నిర్ణయించుకున్నారు. లెక్క ఈ విధంగా ఉంటుంది.

విత్‌డ్రా సంవత్సరానికి ముందు నాలుగో సంవత్సరం (FY 2022–23) చివరిలో ఉన్న బ్యాలెన్స్: వడ్డీతో కలిపి 1,57,000

ఐదో సంవత్సరం (FY 2025–26) చివరిలో ఉన్న బ్యాలెన్స్: వడ్డీతో కలిపి 2,26,000

ఈ రెండింటిలో తక్కువైన మొత్తం 1,57,000 ను 50% విత్‌డ్రా పరిమితికి పరిగణిస్తారు. కాబట్టి, మిస్టర్ ‘ఏ’ 78,500 విత్‌డ్రా చేసుకోవడానికి అర్హులు.

ఒకవేళ ఆయనకు పీపీఎఫ్ లోన్ బకాయి 10,000 ఉంటే, నికరంగా విత్‌డ్రా చేసుకునేందుకు అర్హత ఉన్న మొత్తం 68,500 అవుతుంది.

పీపీఎఫ్ విత్‌డ్రాకు సంబంధించిన కీలక నియమాలు

పీపీఎఫ్ ఖాతా 15 ఏళ్ల గడువు పూర్తి చేసుకున్న తర్వాత, ఖాతాదారుడు మొత్తం మొత్తాన్ని విత్‌డ్రా చేసి ఖాతాను మూసివేయవచ్చు లేదా పొడిగించుకోవచ్చు.

“పీపీఎఫ్ ఖాతా యాక్టివ్‌గా ఉండాలంటే, ఇన్వెస్టర్లు ప్రతి ఆర్థిక సంవత్సరంలో కనీసం 500 డిపాజిట్ చేయాలి. ఖాతా 15 సంవత్సరాల తర్వాత మెచ్యూర్ అవుతుంది. కావాలంటే, అభ్యర్థన మేరకు 5 సంవత్సరాల బ్లాక్‌లలో ఖాతాను పొడిగించుకోవచ్చు. మెచ్యూరిటీ పీరియడ్ చివరిలో మొత్తం బ్యాలెన్స్‌ను విత్‌డ్రా చేసుకోవచ్చు” అని నిపుణులు తెలిపారు.

పీపీఎఫ్ అనేది భారతదేశంలో దీర్ఘకాలిక పొదుపు పథకంగా పరిగణించినప్పటికీ, అత్యవసరంగా నిధులు అవసరమైన ఇన్వెస్టర్లకు ఫ్లెక్సిబిలిటీని, సెక్యూరిటీని అందించాలనే ఉద్దేశంతో ఐదేళ్ల తర్వాత పాక్షిక ఉపసంహరణకు ఇది అనుమతిస్తుంది. అయితే, పీపీఎఫ్ లో పెట్టుబడి అనేది ఒక వ్యక్తి యొక్క ఆర్థిక లక్ష్యాలు, అవసరాలపై ఆధారపడి ఉండాలి.

(డిస్‌క్లెయిమర్: ఈ కథనం కేవలం అవగాహన కోసం మాత్రమే. దీనిని పెట్టుబడి వ్యూహంగా పరిగణించకూడదు. పెట్టుబడి నిర్ణయాలు తీసుకునే ముందు సర్టిఫైడ్ నిపుణులను సంప్రదించాలని మేము ఇన్వెస్టర్లకు సూచిస్తున్నాము.)

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.