Jeff Bezos: మరో రెండు దశాబ్దాల్లో అంతరిక్షంలో మనుషుల నివాసం: జెఫ్ బెజోస్

కృత్రిమ మేధ సహా వివిధ రకాల సాంకేతికతలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఫలితంగా మానవ సమాజం సమూలంగా మారిపోతుందని కొందరు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాబోయే రెండు దశాబ్దాల్లో ప్రపంచం గుర్తుపట్టలేనంతగా మారిపోతుందని చెప్పుకొచ్చారు. ఇటాలియన్ టెక్ వీక్ 2025 సదస్తులో ఆయన ఈ కామెంట్స్ చేశారు (Jeff Bezos – Humans Living in Space by 2045).


2045 కల్లా అంతరిక్షంలో జనావాసాలు వెలుస్తాయని జెఫ్ బెజోస్ తెలిపారు. లక్షల మంది ప్రజలు అంతరిక్షంలో నివసిస్తుంటారని తెలిపారు. భూమ్మీద జీవనం ఎప్పటిలాగే సాఫీగా సాగిపోతున్నా లక్షల మంది ఇష్టపూర్వకంగానే అంతరిక్షంలో జీవిస్తుంటారని అన్నారు. సాంకేతికత అంతటి వేగంగా అభివృద్ధి చెందుతోందని చెప్పారు. జనాలు గ్రహాల మధ్య జర్నీలు చేస్తారని, సాధారణ పనులను రోబోలు చక్కబెట్టేస్తుంటాయని తెలిపారు.

ఇక ఏఐతో భారీగా ఉద్యోగాల కోత ఉంటుందన్న భయాలను కూడా ఆయన తోసిపుచ్చారు. ఏఐ, ఆటోమేషన్ వల్ల మానవ సమాజం మరింత సుసంపన్నం అవుతుందని అన్నారు. గతంలో వెలుగులోకి వచ్చిన ఆవిష్కరణలన్నీ సమాజాన్ని మెరుగుపరిచాయని తెలిపారు. కొన్ని వేల ఏళ క్రితం ఎవరో ఒక వ్యక్తి నాగలి కనుగొనడంతో మానవ సమాజం అంతా లాభపడిందని వివరించారు. ఈ ఒరవడి భవిష్యత్తులోనూ కొనసాగుతుందని తేల్చి చెప్పారు.

ప్రస్తుతం మనుషులు చేస్తున్న పనులన్నీటినీ భవిష్యత్తులో ఏఐ చక్కబెడుతుందని ఇటీవల టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ కూడా పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ అభివృద్ధి కారణంగా సార్వత్రిక ఆదాయ విధానం కూడా అమల్లోకి వస్తుందని, మనుషులు తమ ఆదాయాలతో సంబంధం లేకుండా నచ్చిన జీవనశైలిని అనుభవిస్తారని అన్నారు.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.