ఇళ్ల అమ్మకాల్లో హైదరాబాద్‌ రికార్డు

www.mannamweb.com


ఇళ్లు/ఫ్లాట్ల విక్రయాల్లో హైదరాబాద్‌ సరికొత్త రికార్డు సృష్టించింది. 2023తో పోలిస్తే 12% వృద్ధితో 2024లో 36,974 ఇళ్లు అమ్ముడయ్యాయి. మెరుగైన జీవన శైలి కోసం, ఆధునిక హంగులతో ఇళ్లు కొనే వారి సంఖ్య పెరుగుతోందని స్థిరాస్తి సేవల సంస్థ నైట్‌ఫ్రాంక్‌ తాజా నివేదికలో వెల్లడించింది. హైడ్రా (హైదరాబాద్‌ డిజాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్‌ ప్రొటెక్షన్‌ ఏజెన్సీ) చెరువులు, కాలువలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణపై దృష్టి సారించడంతో పాటు, అక్రమ కట్టడాలపై కఠిన వైఖరి పెరుగుతున్న నేపథ్యంలో గత ఏడాది కొత్త ప్రాజెక్టుల ప్రారంభం కాస్త నెమ్మదించింది. 2023తో పోలిస్తే 6% తక్కువగా 2024లో 44,013 యూనిట్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.

ధరలు 8% పెరిగాయ్‌
హైదరాబాద్‌లో ఇళ్ల ధరలు సగటున 8% పెరిగాయి. ముఖ్యంగా విలాస గృహాలకు గిరాకీ స్థిరంగా కొనసాగుతోంది. ప్రీమియం ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమైన ఎల్‌బీనగర్, కొంపల్లి ప్రాంతాల్లోనూ ధరలు పెరిగాయి. ఎల్‌బీనగర్‌లో ఏడాది కాలంలో సగటున 11%, కొంపల్లిలో 10% వరకు ధరలు పెరిగాయని నైట్‌ఫ్రాంక్‌ వెల్లడించింది.

మొత్తం ఇళ్ల విక్రయాల్లో రూ.1-2 కోట్ల విలువైనవి 45% ఉన్నాయి. గత ఏడాదిలో ఈ శ్రేణిలోనివి 16,459 ఇళ్లు అమ్ముడయ్యాయి. నీ రూ.2-5 కోట్ల ఇళ్ల విక్రయాల్లో 72% వృద్ధి కనిపించింది. ఇలాంటివి 5,205 విక్రయమయ్యాయి. నీ రూ.5-10 కోట్ల ఇళ్ల అమ్మకాల్లో 39%, రూ.10-20 కోట్ల గృహాల్లో 51% వృద్ధి కనిపించింది. నీ రూ.20-50 కోట్ల విలాస గృహాల అమ్మకాలు 217% వృద్ధితో 35కు చేరాయి.

12 ఏళ్ల గరిష్ఠం
దేశంలోని 8 ప్రధాన నగరాల్లో కలిపి 2024లో 3,50,613 ఇళ్లు/ఫ్లాట్లు అమ్ముడయ్యాయని, ఇది 12 ఏళ్ల గరిష్ఠమని నైట్‌ఫ్రాంక్‌ వెల్లడించింది. రూ.2-5కోట్ల మధ్య ఇళ్లకు మంచి గిరాకీ లభించిందని నైట్‌ఫ్రాంక్‌ ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ శిశిర్‌ బైజల్‌ వెల్లడించారు. దిల్లీ-ఎన్‌సీఆర్‌లో మాత్రం ఇళ్ల విక్రయాలు 4% తగ్గాయి. ముంబయిలో 11%, బెంగళూరులో 2%, పుణెలో 6%, అహ్మదాబాద్‌లో 15%, కోల్‌కతాలో 16%, చెన్నైలో 9% ఇళ్ల విక్రయాలు పెరిగాయి.

వాణిజ్య స్థలాల అద్దె లావాదేవీలూ అధికం

గత ఏడాది హైదరాబాద్‌లో వాణిజ్య స్థలాల అద్దె లావాదేవీల్లో 17% వృద్ధి నమోదయ్యింది. 2020 తర్వాత ఇది అత్యధికం. మొత్తం 1.03 కోట్ల చ.అడుగుల స్థలం లీజుకు వెళ్లింది. మొత్తం ఏడాదిలో కొత్తగా 1.56 కోట్ల చ.అడుగుల ఆఫీసు స్థలం అందుబాటులోకి వచ్చింది. 2023తో పోలిస్తే ఇది 139% అధికం. అద్దె సైతం 7% పెరిగింది. గ్లోబల్‌ క్యాపబిలిటీ సెంటర్లు (జీసీసీ) అధికంగా వస్తుండటం దీనికి కారణం. మొత్తం లావాదేవీల్లో జీసీసీల వాటా 49 శాతమని నైట్‌ఫ్రాంక్‌ వెల్లడించింది.

దేశంలోని 8 ప్రధాన నగరాల్లోనూ ఆఫీసు స్థలాలకు గిరాకీ, కొవిడ్‌ ముందు స్థాయికి చేరిందని నివేదిక పేర్కొంది. మొత్తం 7.19 కోట్ల చదరపు అడుగుల స్థలం అద్దెకు వెళ్లింది.