ఆదివారమూ ఆగని ‘హైడ్రా’.. కొనసాగుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేత

www.mannamweb.com


అక్రమ నిర్మాణాలపై నాన్‌స్టాప్‌గా దూసుకెళ్తోంది హైదరాబాద్‌ డిసాస్టర్‌ రెస్పాన్స్‌ అండ్‌ అసెట్స్‌ మానిటరింగ్‌ అండ్‌ ప్రొటెక్షన్‌ అలియాస్‌ హైడ్రా.

హైదరాబాద్‌లో ఆడా,ఈడా అనే తేడా లేకుండా… ఎక్కడ కబ్జా కనిపించినా హై స్పీడుతో కదంతొక్కుతున్న హైడ్రా.. తాజాగా మరోసారి జూలు విదిల్చింది. హైడ్రా ఆదేశాలతో రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పలు ఏరియాల్లో కూల్చివేతలు చేపట్టారు.

కూకట్‌పల్లి, అమీన్‌పూర్‌ ఏరియాల్లో కూల్చివేతలు

కూకట్‌పల్లి, అమీన్‌పూర్‌ ఏరియాల్లో కబ్జానిర్మాణాలపై ఫోకస్‌ పెట్టింది హైడ్రా. కూకట్‌పల్లి నల్లచెరువులోని 66, 67, 68, 69 సర్వే నెంబర్లలో అనుమతులు లేకుండా నిర్మించిన 16 షెడ్లను కూల్చేసింది. ఇప్పటికే ఆయా నిర్మాణాల యజమానులకు నోటీసులు ఇచ్చిన హైడ్రా… ఉదయాన్నే బుల్డోజర్స్‌, ప్రొక్లెయినర్స్‌తో సహా స్పాట్‌కు చేరుకుంది. చెరువును కబ్జా చేసి కట్టిన… మొత్తం 16 కమర్షియల్ షెడ్లు, ప్రహారి గోడలను కూల్చివేసింది. కూకట్‌పల్లి నల్లచెరువు పరిధిలో 4 ఎకరాల స్థలాన్ని స్వాధీనం చేసుకుంది హైడ్రా.

కిష్టారెడ్డిపేటలో మూడు భవనాలు కూల్చిన హైడ్రా

సంగారెడ్డి జిల్లాకు, హైదరాబాద్‌కు వారధిలా ఉండే అమీన్‌పూర్‌ మున్సిపాలిటీలోనూ కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. అమీన్‌పూర్‌ మండలం కిష్టారెడ్డిపేటలో సర్వే నెంబర్ 164లో మూడు భవనాలు కూల్చివేసింది. అవి మూడూ భారీ బహుళ అంతస్తు భవనాలే కావడం విశేషం. వాణిజ్య పరంగా వాడుతున్న ఐదు అంతస్తుల భవనాన్ని నేలమట్టం చేసింది. అక్కడ కబ్జాచేసిన ఎకరం ప్రభుత్వం స్థలాన్ని స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు హైడ్రా కమిషనర్‌ రంగనాథ్‌. అయితే నివాస గృహాలను కూల్చలేదనీ… కేవలం కమర్షియల్‌ భవనాలనే కూల్చేశామనీ చెప్పారు.

12/2, 12/3 సర్వేనెంబర్‌లోని 25 నిర్మాణాల కూల్చివేత

పటేల్ గూడలో ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి కట్టిన నిర్మాణాలన్నీ తొలిగించారు. సర్వే నెం.12/2, 12/3లోని 25 నిర్మాణాల కూల్చివేశారు. పటేల్ గూడలో 3ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకుంది. మొత్తం మూడు ప్రాంతాల్లో దాదాపు 8 ఎకరాలు ప్రభుత్వ స్థలం స్వాధీనం చేసుకున్నట్టు హైడ్రా కమిషనర్‌ తెలిపారు. రెవెన్యూ, నీటిపారుదల, టౌన్ ప్లానింగ్ తో కలిసి కూల్చివేతలు చేపట్టామన్నారు. నీటి వనరుల సంరక్షణ కోసం సంయుక్తంగా కృషి చేస్తున్నామనీ చెప్పారు రంగనాథ్‌. దూకుడుగా ముందుకెళ్తున్న హైడ్రా… తదుపరి టార్గెట్‌ ఏ ఏరియా అన్నదే ఇప్పుడు సస్పెన్స్‌గా మారింది.