భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా ఇప్పటికే వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. అలాగే, స్లీపర్‌తో పాటు వందే భారత్ మెట్రోను సైతం తీసుకురాబోతున్నది.
సరికొత్తగా హైడ్రోజన్ రైళ్లపై సైతం దృష్టి సారించింది. తొలిసారిగా హైడ్రోజన్ రైలును తీసుకురాబోతున్నది. ఈ రైలు ప్రత్యేకతలు, ఫీచర్స్‌ను కేంద్ర రైల్వేశాఖ మంత్రి వివరించారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైడ్రోజన్ రైళ్ల ఇంజిన్లు 500 నుంచి 600 హార్స్‌పవర్ శక్తిని ఉత్పత్తి చేస్తుండగా.. భారత రైల్వేల హైడ్రోజన్ రైలు మాత్రం 1200 హార్స్‌పవర్ వరకు శక్తిని ఉత్పత్తి చేయగల సామర్థ్యం ఉంది. అంతే కాకుండా ఈ రైలు ప్రపంచంలోనే అత్యంత పొడవుగా ఉంటుందని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో ప్రకటించారు. రైలు పొడవుతో పాటు సాంకేతికంగా బాగా అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు.
భారత్ మొట్టమొదటి హైడ్రోజన్ రైలును పూర్తిగా స్వదేశీ సాంకేతికతతో అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. డీజిల్ ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ (DEMU) రేక్‌లపై హైడ్రోజన్ ఇంధన కణాల రెట్రోఫిట్మెంట్ ద్వారా ఈ రైలును తయారు చేస్తున్నారు. రైల్వే రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) స్పెసిఫికేషన్లను సిద్ధం చేసింది. హైడ్రోజన్ రైలు స్టేటస్‌పై ఎంపీ అజిత్ కుమార్ భూయాన్ అడిగిన ప్రశ్నకు ఆయన రైల్వే మంత్రి సమాధానం ఇచ్చారు. రైలుతో పాటు హైడ్రోజన్‌ను తిరిగి నింపేందుకు ఇంటిగ్రేటెడ్ హైడ్రోజన్ ఉత్పత్తి, నిల్వ, పంపిణీ సౌకర్యాన్ని రూపొందించినట్లు పేర్కొన్నారు. ఈ మేరకు అవసరమైన ఆమోదం కోసం పెట్రోలియం, పేలుడు పదార్థాల భద్రతా సంస్థ (PESO)ను అభ్యర్థించినట్లు తెలిపారు. ప్రత్యామ్నాయ ఇంధన వనరులైన క్లీన్ ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ వినియోగాన్ని ప్రోత్సహించేందుకు భారతీయ రైల్వే తీసుకున్న కీలకమైన చొరవ అని పేర్కొన్నారు. ఇప్పటివరకు కేవలం నాలుగు దేశాలు మాత్రమే హైడ్రోజన్ రైళ్లను ప్రారంభించాయి.
ఈ జాబితాలో జర్మనీ, ఫ్రాన్స్, స్వీడన్, చైనా ఉన్నాయి. హైడ్రోజన్ రైలును అభివృద్ధి చేస్తున్న ఐదో దేశంగా నిలువనుంది. అయితే, ఆ దేశాలన్నింటిని అధిగమించబోతున్నది. ప్రస్తుతం ఆయా దేశాల్లో ఉన్న హైడ్రోజన్ రైలు ఇంజిన్స్ గరిష్ఠంగా 500 నుంచి 600 వరకు హార్స్ పవర్‌ను మాత్రమే ఉత్పత్తి చేస్తాయి. భారతీయ రైల్వే తీసుకురాబోతున్న హైడ్రోజన్ రైలు 1200 వరకు హార్స్ పవర్ శక్తిని ఉత్పత్తి చేయనుంది. ప్రస్తుతం ఉన్న వాటి కంటే రెట్టింపు శక్తిని ఉత్పత్తి చేస్తాయి. ప్రస్తుతం హైడ్రోజన్ రైలును చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారవుతుంది. త్వరలోనే ట్రయల్ ఆపరేషన్‌కు తీసుకురానున్నది. హైడ్రోజన్ అనేది పూర్తిగా కాలుష్య రహితం. రైలు ఇంజిన్‌ను భారత రైల్వేల పరిశోధన రూపకల్పన, ప్రమాణాల సంస్థ (RDSO) పూర్తిగా దేశీయంగా నిర్మించింది. భారతదేశపు మొట్టమొదటి హైడ్రోజన్ రైలును జింద్, సోనెపట్ సెక్షన్‌లోని 89 కిలోమీటర్ల మార్గంలో ట్రయల్ రన్ నిర్వహిస్తారు.