మహిళల గర్భసంచి తొలగించడం ఎంత వరకు సేఫ్? ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది?

www.mannamweb.com


స్త్రీ జీవితంలో రుతుస్రావం ఒక సహజ ప్రక్రియ. కానీ కొందరికి ఇది నరకం చూపిస్తుంది. అధిక రక్తస్రావం, కడుపు నొప్పి, నీరసం.. ఇలా ఎన్నో సమస్యలు వారిని వెంటాడుతుంటాయి.
వీటితో పాటు ఇతర సమస్యల కారణంగా, పిల్లలు పుట్టిన తర్వాత చాలామంది మహిళలు గర్భసంచి తొలగించే సర్జరీ (Uterus Removal) చేయించుకుంటున్నారు. దీనివల్ల అన్ని సమస్యలు పోతాయని అనుకుంటున్నారు. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్? గర్భసంచి తీసివేస్తే మహిళ ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం పడుతుంది? ఇలాంటి ప్రశ్నలకు ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ షీతల్, ఇటీవల హెల్త్ ఓపీడీ అనే యూట్యూబ్ ఛానెల్‌తో మాట్లాడుతూ సమాధానమిచ్చారు. ఆ వివరాలు చూద్దాం.

* గర్భాశయం ప్రాముఖ్యత
గర్భాశయం లేదా గర్భసంచి అనేది స్త్రీ శరీరంలో ఒక ముఖ్యమైన భాగం. ఇది ప్రత్యుత్పత్తికి అత్యంత అవసరం, గర్భధారణలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది దాదాపు 35 గ్రాముల బరువు, 7.5 సెం.మీ పొడవు, 5 సెం.మీ వెడల్పు, 2.5 సెం.మీ మందంతో కూడిన ఒక కండరాల అవయవం. గర్భధారణ సమయంలో దీని సైజు బాగా పెరుగుతుంది. బిడ్డను మోసేది ఈ గర్భాశయమే, అందుకే ఇది స్త్రీకి ఒక వరం.

గర్భసంచిని తొలగించడాన్ని వైద్య పరిభాషలో హిస్టెరెక్టమీ (Hysterectomy) అంటారు. కడుపులో కోత పెట్టడం ద్వారా లేదా యోని మార్గం ద్వారా గర్భాశయాన్ని తీసేస్తారు. కొన్ని ఆరోగ్య సమస్యలకు ఇది పరిష్కారం కావచ్చు, కానీ దీనివల్ల అనేక నష్టాలు కూడా ఉన్నాయి.

* పెరుగుతున్న కేసులు
అధిక రక్తస్రావం (Heavy Menstrual Bleeding) ఉంటే గర్భసంచి తీయించుకోవాలని కొన్ని వెబ్‌సైట్లు చెబుతున్నాయి. కానీ ఇది పూర్తిగా అవాస్తవం, చాలా తప్పుడు సమాచారం. వైద్యుల నిర్లక్ష్యం కూడా ఈ కేసులు పెరగడానికి కారణంగా చెప్పుకోవచ్చు. కొందరు వైద్యులు గర్భాశయం తొలగింపు వల్ల కలిగే నష్టాలు, ప్రత్యామ్నాయ చికిత్సల గురించి మహిళలకు సరిగ్గా చెప్పడం లేదు. దాంతో బాధిత మహిళలు అనవసరంగా ఆపరేషన్ చేయించుకుంటున్నారు.

* ఎంతవరకు సేఫ్?
గర్భాశయం తొలగింపు అనేది సాధారణ విషయం కాదు. ఇది కేవలం క్యాన్సర్ నిర్ధారణ అయినప్పుడు, పెద్ద ఫైబ్రాయిడ్లు ఉన్నప్పుడు లేదా తీవ్రమైన గర్భాశయ సమస్యలు ఉన్నప్పుడే వైద్యులు సిఫార్సు చేస్తారు. అధిక రక్తస్రావం అవుతున్నంత మాత్రన గర్భసంచి తీసేయాల్సిన అవసరం లేదు. ఇందుకు ఇతర ట్రీట్‌మెంట్ ఆప్షన్స్ కూడా అందుబాటులో ఉన్నాయి.

అనవసరంగా గర్భాశయం తొలగిస్తే అనేక సమస్యలు వస్తాయి. హార్మోన్ల అసమతుల్యత ఏర్పడుతుంది. ఈస్ట్రోజెన్ వంటి హార్మోన్లు తగ్గిపోయి ఆరోగ్య సమస్యలు వస్తాయి. డిప్రెషన్, ఆందోళన వంటి మానసిక సమస్యలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అంతేకాదు, శరీరం బలహీనపడుతుంది. కడుపులోని కండరాలు, అంతర్గత అవయవాలు దెబ్బతినే అవకాశం ఉంది. లైంగిక జీవితంలో కూడా మార్పులు వస్తాయి. కొంతమంది మహిళలు ఆపరేషన్ తర్వాత లైంగిక ఆనందం తగ్గిందని చెబుతున్నారు.

* ఎప్పుడు తొలగించాలి?
పూర్తి వైద్య పరీక్షల తర్వాత మాత్రమే ఈ సర్జరీ చేయాలి. ఇది సాధారణంగా మూడు పరిస్థితులలో అవసరమవుతుంది. గర్భసంచిలో ఫైబ్రాయిడ్లు (Fibroids) పెద్దగా ఉన్నప్పుడు, గర్భాశయంలో క్యాన్సర్ లేదా క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నప్పుడు, గర్భాశయ పొర అసాధారణంగా మందంగా ఉన్నప్పుడు మాత్రమే గర్భాశయం తొలగించాల్సి వస్తుంది. కాబట్టి, ఆన్‌లైన్ సమాచారాన్ని గుడ్డిగా నమ్మకుండా, డాక్టర్లను సంప్రదించి, సరైన సలహా తీసుకోవాలి.