ఇంకా పోస్టింగ్ దక్కని జగన్ హయాం ఐఏఎస్, ఐపీఎస్ లు వీరే.

ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడునెలలవుతోంది. గతంలో వైసీపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జనం ఎన్నికల్లో వేసిన ఓటుతో కూటమి ప్రభుత్వం భారీ మెజార్టీతో అధికారంలోకి వచ్చింది.


వచ్చీ రాగానే రాష్ట్రంలో సీఎం చంద్రబాబు తన టీమ్ ఏర్పాటు చేసుకున్నారు. కీలకమైన స్ధానాల్లో తనకు కావాల్సిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు పోస్టింగ్స్ ఇచ్చారు. అయితే మరికొందరిని మాత్రం ఇప్పటికీ పోస్టింగ్ ఇవ్వకుండా దూరం పెట్టేశారు. వీరంతా గతంలో వైసీపీ హయాంలో కీలక స్ధానాల్లో పనిచేసిన సీనియర్ అధికారులే.

ఏపీలో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక పోస్టింగ్స్ కు దూరమైన సీనియర్ అధికారుల జాబితాలో ముందుగా గత సీఎంవోలో పనిచేసిన సీనియర్ ఐఏఎస్ లు శ్రీలక్ష్మి, ముత్యాలరాజు వంటి వారు ఉన్నారు. అలాగే ఇతర ఐఏఎస్ ల్లో మురళీధర్ రెడ్డి, మాధవీలత, నీలకంఠారెడ్డి వంటి వారు ఉన్నారు. ఐపీఎస్ ల విషయానికొస్తే కొల్లి రఘురామిరెడ్డి, నిశాంత్‌రెడ్డి, రవిశంకర్‌రెడ్డి, పీఎస్సార్ ఆంజనేయులు, ఎన్.సంజయ్, పి.వి.సునీల్ కుమార్, కాంతి రాణా టాటా, విశాల్ గున్నీ వంటి వారు ఉన్నారు. వీరంతా పోస్టింగ్స్ కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉన్నారు. తాజాగా కొందరు వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ లకు ప్రభుత్వం పోస్టింగ్స్ ఇచ్చినా వీరి విషయంలో మాత్రం కరుణించడం లేదు.

ప్రభుత్వాలు మారినప్పుడల్లా కీలకమైన అధికారుల మార్పులు ఏపీలో సర్వసాధారణంగా మారుతూనే ఉన్నాయి. అయితే ఈసారి చాలా మంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు పోస్టింగ్స్ లేకుండా పోయారు. వీరంతా సీనియార్టీ జాబితాల్లో ఉన్న వారు. రాష్ట్రస్దాయిలో పనిచేస్తున్న వారే. వీరిని గత వైసీపీ హయాంలో కీలక స్ధానాల్లో ఉన్నారనే కారణంతో, టీడీపీతో పాటు కూటమి పార్టీల్ని టార్గెట్ చేశారనే కారణంతో పోస్టింగ్స్ ఇవ్వలేదనేది బహిరంగ రహస్యం. అయితే ఇలా ఇంత మంది అఖిల భారత సర్వీస్ అధికారుల్ని ఒకేసారి పోస్టింగ్స్ ఇవ్వకుండా దూరం పెట్డడంతో కూటమి ప్రభుత్వంపై విమర్శలతో పాటు పాలనపైనా ఈ ప్రభావం పడుతోంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.