అవినాష్ రెడ్డికి బెయిలు రద్దైతే..?

మాజీ మంత్రి, ముఖ్యమంత్రి జగన్ కు స్వయానా చిన్నాన్న అయిన వైఎస్ వివేకా హత్య కేసు రానున్న ఏపీ ఎన్నికలలో ప్రధాన అజెండాలలో ఒకటి అనడంలో ఎటువంటి సందేహం లేదు. మరీ ముఖ్యంగా కడప జిల్లాలో మాత్రం వివేకా హత్య కేసు ప్రధాన ఎన్నికల అంశంగా మారింది. ఈ కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి వైసీపీ అభ్యర్థిగా కడప లోక్ సభ ఎన్నికల బరిలో ఉన్నారు. ఆయనకు ప్రత్యర్థిగా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రంగంలో ఉన్నారు. దీంతో కడప జిల్లాలో ఎన్నికల ప్రచారం మొత్తం వైఎస్ వివేకా హత్య కేసు చుట్టూనే సాగుతున్నది. వైఎస్ షర్మిలకు మద్దతుగా వైఎస్ వివేకా కుమార్తె డాక్టర్ సునీత కూడా ప్రత్యక్ష ప్రచారంలో చురుగ్గా పాల్గొంటూ తన తండ్రి హంతకుడు అవినాష్ రెడ్డే అంటూ నేరుగానే ఆరోపణలు గుప్పిస్తున్నారు.


దీంతో అనివార్యంగా వైసీపీ కూడా వివేకా హత్యపై వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితిలో పడింది. వైఎస్ అవినాష్ రెడ్డి కానీ, ఇతర నేతలు కానీ ఇస్తున్న వివరణలు ఏ మాత్రం హేతుబద్ధంగా ఉండటం లేదు. ముఖ్యమంత్రి జగన్ కు స్వయానా మేనమామ అయిన రవీద్రనాథ్ రెడ్డి బహిరంగంగానే వేదికపై అవినాష్ ను పక్కన పెట్టుకునే చెప్పిన విషయాలు వివేకా హత్య కేసులో అవినాష్ ప్రమేయాన్ని బట్టబయలు చేశాయి. సాక్ష్యాల నాశనం జరుగుతుంటే పాపం అవినాష్ ఏం చేయాలో తెలియక చూస్తూ నిలబడిపోయారంటూ రవీంధ్రనాథ్ రెడ్డి చేసిన సమర్థింపు వివేకాహత్య కేసులో అవినాష్ ప్రమేయం ఉందన్న నిర్ణారణకు అందరూ వచ్చేలా చేసింది.

ఇదంతా ఒకెత్తయితే సీబీఐ వివేకా హత్య కేసులో సాక్షుల భద్రతపై వ్యక్తం చేసిన ఆందోళన అవినాష్ బెయిలు రద్దయ్యే అవకాశాలు ఉన్నాయన్న సంగతిని తేటతెల్లం చేసింది. నిజంగానే అవినాష్ బెయిలును కోర్టు రద్దు చేస్తే.. వైసీపీ పరిస్థితి ఏమిటి? అన్న ఆందోళన ఆ పార్టీ వర్గాల్లో వ్యక్తం అవుతోంది. అవినాష్ బెయిలు రద్దై ఆయన జైలుకు వెడితే.. ఇక కడప జిల్లాలో విజయంపై వైసీపీ ఆశలు వదిలేసుకోవలసిందేనన్న అభిప్రాయం ఆ పార్టీ శ్రేణులలోనే వ్యక్తం అవుతోంది. అన్నిటికీ మించి అవినాష్ బెయిలు రద్దై జైలుకు వెడితే కడప లోక్ సభ బరిలో అవినాష్ స్థానంలో మరో అభ్యర్థిని వైసీపీ నిలబెట్టాల్సి ఉంటుంది. అదే జరిగితే వైసీపీకి జిల్లా వ్యాప్తంగా తేరుకోలేని నష్టం వాటిల్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

రాష్ట్ర వ్యాప్తంగా జగన్ సర్కార్ పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతున్నదన్న విషయాన్ని సర్వేలన్నీ చెబుతున్నాయి. అయితే రాయలసీమలో మరీ ముఖ్యంగా కడప జిల్లాలో మాత్రం ఇప్పటికీ మొగ్గు వైసీపీ వైపు ఉంది. సర్వేలు సైతం అదే చెబుతున్నాయి. కానీ షర్మిల కడప లోక్ సభ బరిలో దిగడం, వైఎస్ వివేకాహత్య వెనుక ఉన్నది అవినాష్ రెడ్డే అని బహిరంగంగా విమర్శలు చేయడమే కాకుండా, వైఎస్ బిడ్డ వైపు ఉంటారా, వివేకా హంతకుడి వైపు ఉంటారా? అంటూ ఆమె ప్రజలకు సంధిస్తున్న ప్రశ్నాస్త్రం కడప లోక్ సభ నియోజకవర్గంలో పరిస్థితులను మార్చేసే అవకాశాలు లేకపోలేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో అవినాష్ బెయిలు రద్దు అయ్యి అరెస్టయితే మాత్రం వైసీపీ కడపపై ఆశలు వదిలేసుకోవలసిందేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.