AP High Court: పోస్టింగ్‌ ఇవ్వకపోతే ఏబీవీకి తీవ్ర నష్టం

డీజీ ర్యాంకు కలిగిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుపై ఐదేళ్లుగా కక్ష సాధిస్తూ, కోర్టుల ఉత్తర్వులనూ పెడచెవిన పెట్టి ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వకుండా వేధిస్తున్న రాష్ట్రప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఏబీవీపై సస్పెన్షన్‌ ఎత్తేస్తూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ (క్యాట్‌) ఇచ్చిన ఆదేశాలపై స్టే ఇవ్వాలన్న రాష్ట్రప్రభుత్వ విజ్ఞప్తిని హైకోర్టు గురువారం తోసిపుచ్చింది. ఏబీవీ శుక్రవారం పదవీవిరమణ చేయనున్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. రాష్ట్రప్రభుత్వం ఆయనను దాదాపు ఐదేళ్లుగా సస్పెన్షన్‌లోనే ఉంచిందని గుర్తుచేసింది. ఆయనపై సస్పెన్షన్‌ ఎత్తేస్తూ క్యాట్‌ ఇచ్చిన ఆదేశాల్ని ఈ దశలో నిలుపుదల చేస్తే… అది ఏబీవీకి తీవ్రనష్టం కలగజేస్తుందని జస్టిస్‌ సత్తి సుబ్బారెడ్డి, జస్టిస్‌ పి.జ్యోతిర్మయిలతో కూడిన హైకోర్టు వెకేషన్‌ బెంచ్‌ స్పష్టం చేసింది. ఆయనకు పోస్టింగ్‌ ఇవ్వడం వల్ల… ఏబీవీపై ప్రభుత్వం మోపిన అభియోగాల దర్యాప్తునకు ఎలాంటి అవరోధం కలగదని కోర్టు పేర్కొంది.


ఏబీవీకి పోస్టింగ్‌ ఇస్తే దర్యాప్తును ఆయన ప్రభావితం చేస్తారన్న రాష్ట్రప్రభుత్వ వాదన పసలేనిదిగా కొట్టిపారేసింది. ఏబీవీపై సస్పెన్షన్‌ను ఎత్తేస్తూ క్యాట్‌ ఇచ్చిన తీర్పును కొట్టేయాలంటూ రాష్ట్రప్రభుత్వం దాఖలుచేసిన అనుబంధ పిటిషన్‌పై… ప్రభుత్వం కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేశాక తగిన ఉత్తర్వులిస్తామని తెలిపింది. జూన్‌ 20న కోర్టు వేసవి సెలవులు ముగిసిన వెంటనే అనుబంధ పిటిషన్‌పై విచారిస్తామని తెలిపింది. ఏబీవీపై సస్పెన్షన్‌ను ఎత్తేస్తూ కేంద్ర పరిపాలనా ట్రైబ్యునల్‌ హైదరాబాద్‌ బెంచ్‌ ఈ నెల 8న ఇచ్చిన ఉత్తర్వుల్ని సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి హైకోర్టులో రిట్‌పిటిషన్‌ దాఖలు చేశారు. క్యాట్‌ ఇచ్చిన తీర్పు తప్పులతడకగా ఉందని, వాస్తవాలు కళ్లెదుట కనిపిస్తున్నా వాటిని విస్మరించిందని ఆ పిటిషన్‌లో ప్రభుత్వం పేర్కొంది.

ఆ రికార్డులన్నీ హైకోర్టు స్వాధీనం చేసుకుని పరిశీలించాలని, లోతైన విచారణ జరిపించాలని కోరింది. ఆలోగా ఏబీవీపై సస్పెన్షన్‌ ఎత్తేస్తూ క్యాట్‌ ఇచ్చిన ఉత్తర్వుల్ని నిలుపుదల చేయాలని మరో అనుబంధ పిటిషన్‌ దాఖలుచేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌.శ్రీరామ్, ఏబీవీ తరఫున సీనియర్‌ న్యాయవాది ఆదినారాయణరావు, ఆయన సహాయకుడు ఎం.రాజీవ్‌కుమార్‌ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత అనుబంధ పిటిషన్‌పై హైకోర్టు బెంచ్‌ గురువారం ఉత్తర్వులు వెలువరిస్తూ కీలక వ్యాఖ్యలు చేసింది.

ఆ ఆందోళన అర్థరహితం
‘‘ఏబీవీ మే 31న పదవీవిరమణ చేస్తున్నారని ఏజీ చెబుతున్నారు. అలాంటప్పుడు క్యాట్‌ ఆదేశాల మేరకు ఆయనను సర్వీసులో చేర్చుకుని, పోస్టింగ్‌ ఇవ్వడం వల్ల సాక్షుల్ని ప్రభావితం చేస్తారని, దర్యాప్తునకు అవరోధం కలిగిస్తారన్న ఆందోళన అర్థరహితం. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్‌ 19 కింద ఏబీవీ ప్రాసిక్యూషన్‌కు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చిన విషయం మా దృష్టిలో ఉంది. కానీ ఆయనను సర్వీసులో చేర్చుకునేందుకు కేంద్రప్రభుత్వ ఉత్తర్వులు అడ్డం కాదు. ఆయనపై చట్టప్రకారం క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ కొనసాగించేందుకు ఎలాంటి అవరోధం ఉండదు. సాధారణంగా ఒక ఉద్యోగిపై విచారణ జరుగుతున్నప్పుడు ఆయన దానికి అవరోధాలు సృష్టిస్తారని, సాక్షుల్ని ప్రభావితం చేస్తారన్న ఉద్దేశంతో సస్పెండ్‌ చేస్తారు. కానీ ఏబీవీ ముందస్తు బెయిల్‌ పొందాక… దాన్ని రద్దుచేయాల్సిందిగా కోరుతూ ప్రాసిక్యూషన్‌ ఇంతవరకు ఎలాంటి పిటిషన్‌ దాఖలు చేయలేదు. ఆయన అలాంటి చర్యలకు పాల్పడలేదనడానికి అదే నిదర్శనం’’ అని కోర్టు పేర్కొంది. సుదీర్ఘమైన సర్వీసు కలిగిన, ఎన్నో కీలకమైన పదవులు నిర్వహించిన ఏబీవీకి సంబంధించి క్యాట్‌ ఉత్తర్వుల్ని అమలుచేయకుండా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు సరికాదని కోర్టు అభిప్రాయపడింది.

‘‘ఏబీవీ 1989లో సర్వీసులో చేరారు. 2015 జులై 6న నిఘా విభాగం అదనపు డీజీగా నియమితులయ్యారు. 2019 మార్చి 10న డీజీ ర్యాంకుకు పదోన్నతి పొందారు. ఆ తర్వాత ఆయనను బదిలీ చేసి, 2019 ఏప్రిల్‌ 22న ఏసీబీ డీజీగా పోస్టింగ్‌ ఇచ్చారు. 2020 ఫిబ్రవరి 8న ప్రభుత్వం ఆయనను సస్పెండ్‌ చేసింది. ఆయన సస్పెన్షన్‌ ఎత్తేస్తూ పోస్టింగ్‌ ఇవ్వాలని కోర్టు 2022 ఏప్రిల్‌ 22న ఆదేశాలు జారీచేసింది. ప్రభుత్వం 2022 జూన్‌ 14న ఆయనకు ప్రింటింగ్, స్టేషనరీ విభాగం కమిషనర్‌గా పోస్టింగ్‌ ఇచ్చింది. 2022 జూన్‌ 17న ఆయన బాధ్యతలు చేపట్టారు. మళ్లీ రాష్ట్రప్రభుత్వం జీఓ55 ద్వారా ఆయనను 2022 జూన్‌ 28న సస్పెండ్‌ చేసింది. ఆయన దాదాపు ఐదేళ్లు సస్పెన్షన్‌లో ఉన్నారు. ఈ నెల 31న పదవీ విరమణ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయనను సర్వీసులో చేర్చుకోకపోతే తీవ్రంగా నష్టపోతారు’’ అని కోర్టు పేర్కొంది.