రామోజీ రావు ఒక అక్షర యోధుడు అని తెలుగుజాతి గర్వించదగిన రామోజీ పేరుతో ఏర్పాటు చేసిన ఈ అవార్డులు అత్యున్నత స్థాయికి చేరుతాయని చంద్రబాబు ఆకాంక్షించారు.
రామోజీ ఫిల్మ్ సిటీలో ఆదివారం నాడు జరిగిన రామోజీ ఎక్సెలెన్స్ అవార్డుల ప్రదాన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామోజీరావు నిర్మించిన వ్యవస్థలు శాశ్వతంగా, చిరస్థాయిగా నిలిచి ఉంటాయన్నారు. నమ్మిన సిద్ధాంతం కోసం రామోజీ దేన్నైనా వదులుకున్నారని, తన జీవితంలో ఫలానా పని చేసిపెట్టాలని ఆయన ఎవరిని అడిగింది లేదని ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. ఫోన్ చేస్తే రామోజీరావు ఎవరూ ఏ పని అయినా చేసేవారని తెలిపారు. రామోజీ ఒక పోరాటయోధునిగా మిగిలిపోయారని, నికార్సైన జర్నలిజంతో ఆయన తెలుగుజాతికి చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ఎక్కడ అవినీతి, దోపిడీ, అన్యాయం జరిగినా ప్రజల పక్షానే నిలబడ్డారని, ప్రతిపక్షం లేకపోతే ప్రజల పక్షాన ప్రతిపక్షంగా నిలబడ్డారని చంద్రబాబు పేర్కొన్నారు.
సామాజిక సేవలోనూ రామోజీకి తిరుగులేదు..
సామాజిక సేవలోనూ రామోజీకి తిరుగులేదని ఏపీ సీఎం చంద్రబాబు ప్రశంసించారు. లాతూర్ భూకంపం అయినా, హుద్ హుద్ తుఫాన్ అయినా, సునామీ అయినా తమ సంస్థల ద్వారా ప్రభావిత ప్రాంతాలను ఆయన ఆదుకున్నారని తెలిపారు. తెలుగుభాషకు రామోజీ రావు చేసిన సేవకు కొలమానం లేదని, తెలుగు భాషను కాపాడుకోవడానికి ముఖ్యమంత్రిగా ఏం చేయాలో అదంతా చేస్తామని హామీ ఇచ్చారు. సరికొత్త తెలుగు పదాలను సృష్టించి కొత్త డిక్షనరీని రూపొందించడంలో రామోజీ రావు పాత్ర అద్భుతమని చంద్రబాబు కొనియాడారు. రామోజీ ఎక్సెలెన్స్ అవార్డులు అందుకున్న వారికి ఆయన అభినందనలు తెలిపారు. ఈనాడు ద్వారా సుశిక్షితులైన జర్నలిస్టుల ద్వారా రామోజీ నికార్సైన జర్నలిజం చేశారని, రామోజీరావు లాంటి వారు 10 మంది ఉంటే సమాజాన్ని మార్చవచ్చని చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
50 ఏళ్ల తర్వాత ఏం చేయాలో రామోజీ ఆలోచించి ఫిల్మ్ సిటీ లాంటి అద్భుతమైన ప్రాజెక్టులు చేపట్టారని చంద్రబాబు అన్నారు. రామోజీపై ఎంత ఒత్తిడి వచ్చినా వెనక్కి తగ్గని వ్యక్తి ఆయనని, ప్రభుత్వాలతో పోరాడి మనుగడ సాధించారని తెలిపారు. ఈనాడు ఒక విశ్వవిద్యాలయం లాంటిదని, ఇక్కడ నేర్చుకున్న వారే దేశ విదేశాల్లో పత్రికా రంగంలో ఉన్నారని పేర్కొన్నారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడాలనే స్ఫూర్తిని ఆయన పెట్టిన న్యూస్ మీడియా ఇచ్చిందని చంద్రబాబు పేర్కొన్నారు.
ప్రజాస్వామ్య పరిరక్షణకు రామోజీరావు కృషిచేశారు: ఎన్వీ రమణ
హైదరాబాద్: రామోజీరావు మీడియా ద్వారా దేశాభివృద్ధికి విశేష కృషి చేశారని సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ అన్నారు. రామోజీ నిబద్ధత కలిగిన వ్యక్తి అని, ఎప్పుడూ అధికారాన్ని కోరుకోలేదన్నారు. రామోజీరావు పేరిట ఏర్పాటు చేసిన రామోజీ ఎక్స్లెన్స్ జాతీయ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో జస్టిస్ ఎన్వీ రమణ మాట్లాడుతూ.. తన పత్రిక ద్వారా ప్రజల్లో చైతన్యం తెచ్చి ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేశారని రామోజీరావు సేవల్ని కొనియాడారు.
‘రామోజీరావు ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక పాత్ర పోషించారు. స్వప్రయోజనాల కోసం రామోజీరావు ఎప్పుడూ తన పత్రికను వాడుకోలేదు. ఆయన వారసత్వాన్ని అలాగే కొనసాగిస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఎన్నో సమస్యలపై మీడియా అధినేతగా ప్రజల పక్షాన నిలిచి పోరాం చేశారని’ అన్నారు. ఈ సందర్భంగా రామోజీ ఫౌండేషన్ రూపొందించిన డిక్షనరీని మాజీ సీజేఐ రమణ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు.
రామోజీరావు జయంతిని పురస్కరించుకొని రామోజీ ఫిల్మ్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ పురస్కారాల ప్రదాన కార్యక్రమానికి ఉప రాష్ట్రపతి సీపీ రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మాజీ సీజేఐ ఎన్వీ రమణ, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, కింజరాపు రామ్మోహన్నాయుడు, బండి సంజయ్, మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తదితరులు పాల్గొన్నారు.
































