రైలు టికెట్‌ బుక్‌ చేస్తే జైలు శిక్ష, 10వేలు జరిమానా..!

www.mannamweb.com


దూర ప్రాంతాలకు వెళ్లాలంటే వెంటనే రైలు గుర్తొస్తుంది కదా. మనం వెళ్లాలనుకునే ప్రదేశానికి రైలు రూటు ఉంటే వెంటనే ఐఆర్‌సీటీసీ ద్వారా ఆన్‌లైన్‌లో టికెట్‌ బుక్‌ చేస్తాం.

చాలాసార్లు మన వ్యక్తిగత ఐఆర్‌సీటీఐ ఐడీ నుంచి మన మిత్రులు, బంధువులు, తెలిసిన వారికి సైతం టికెట్‌ బుక్‌ చేస్తుంటాం. అయితే ఇకపై అలా చేస్తే జైలుశిక్షతో పాటు జరిమానా చెల్లించాల్సిందే. ‘అదేంటి కేవలం రైలు టికెట్‌ బుక్‌ చేస్తేనే అలా చేస్తారా..?’ అనే అనుమానం వస్తుందా.. అయితే, రైల్వేశాఖ తీసుకొచ్చిన కొత్త నిబంధనల గుర్తించి మీకు తెలియాల్సిందే..

స్నేహితులు, బంధువులు, టెక్నాలజీపై అంతలా అవగాహన లేని వారికి, మనకు తెలిసిన వారికి టికెట్‌ బుక్‌ చేసి ఇవ్వాలనే ఉద్దేశం మంచిదే. అయినప్పటికీ, ఈ విధానాన్ని రైల్వేశాఖ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. వ్యక్తిగత ఐడీతో ఇతరులకు టికెట్‌ బుక్‌ చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. అలాచేస్తే ఏకంగా జైలుశిక్షతో పాటు భారీ జరిమానా తప్పదని స్పష్టం చేసింది. ఈ మేరకు రైల్వేశాఖ కొత్త నిబంధనలు ప్రవేశపెట్టింది. టికెట్‌ రిజర్వేషన్‌ వ్యవస్థలో దుర్వినియోగాన్ని కట్టడి చేయడంతోపాటు పారదర్శకత కోసమే ఈ నిబంధనలు తీసుకొచ్చినట్లు ప్రకటించింది.

రైల్వే చట్టం, 1989-సెక్షన్‌ 143 ప్రకారం.. పరిమితులకు మించి టికెట్లు బుక్‌ చేయాలంటే రైల్వేశాఖ గుర్తింపు కలిగిన ఏజెంట్లై ఉండాలి. దీన్ని అతిక్రమిస్తే చట్టపరమైన చర్యలు తప్పవు. ఒకవేళ అనుకోని కారణాల వల్ల కొత్త నిబంధనలు మీరితే మూడేళ్ల వరకు జైలు శిక్ష లేదా రూ.10వేల జరిమానా లేదా రెండూ విధించే అవకాశం ఉంది.

నిబంధనలు ఏం చెబుతున్నాయంటే..

రైల్వేశాఖ నిబంధనల ప్రకారం..ఐఆర్‌సీటీసీ వ్యక్తిగత ఐడీతో కేవలం రక్త సంబంధీకులు లేదా ఒకే ఇంటిపేరు ఉన్న వ్యక్తులకు మాత్రమే టికెట్‌ బుక్‌ చేయాలి. ఆధార్‌తో లింకు చేసుకున్న యూజర్‌ నెలకు 24 టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు. లింక్‌ చేసుకోనివారు 12 టికెట్ల వరకు తీసుకోవచ్చు. ఇది కూడా యూజర్‌తో పాటు తన కుటుంబీకులకే వర్తిస్తుంది. అలా కాకుండా మిత్రులు, ఇతర బంధువులకు టికెట్‌ బుక్‌ చేస్తే చట్టప్రకారం చర్యలు తప్పవు.