డ్రైవింగ్ చేస్తూ ఇలా చేస్తే.. శిక్ష తప్పదు,,,వాహనదారులకు సజ్జనార్ వార్నింగ్

గరంలో నిత్యం ఏదో ఒక చోట రోడ్డు ప్రమాదాలు సంభవిస్తూనే ఉన్నాయి. మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా అవతలి వారి నిర్లక్ష్యం కారణంగా కొన్ని సందర్భాల్లో ప్రమాదాల బారిన పడాల్సి వస్తుంది.


కొందరి నిర్లక్ష్యం ఎందరో జీవితాలను నాశనం చేస్తుంది. డ్రైవింగ్ చేసే సమయంలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. వాహనం నడుపుతూ మొబైల్ మాట్లాడటం వంటివి చేస్తుంటారు. కొందరైతే చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని డ్రైవింగ్ చేస్తుంటారు. అలాంటి వారి వల్ల ప్రమాదాల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈక్రమంలో సీపీ సజ్జనార్ వాహదారులకు వార్నింగ్ ఇచ్చారు. డ్రైవింగ్ చేస్తూ అలాంటి పనులు చేస్తే శిక్ష తప్పదు అన్నారు. ఆ వివరాలు..

హైదరాబాద్‌లో క్యాబ్, ఆటో డ్రైవర్లకు సీపీ వీసీ సజ్జనార్‌ కీలక హెచ్చరికలు జారీ చేశారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మొబైల్ ఫోన్‌లో వీడియోలు చూడటం, ఇయర్‌ఫోన్లు వాడటం నేరమని తెలిపారు. డ్రైవింగ్ చేస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడటం ప్రమాదకరమని ఆయన స్పష్టం చేశారు. వాహనాలు నడుపుతూ ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని సజ్జనార్ స్పష్టం చేశారు.

ఈమేరకు సజ్జనార్ ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు.. ఇటీవల కాలంలో ఆటో, క్యాబ్ డ్రైవర్లు, బైక్ టాక్సీ నడిపేవారు డ్రైవింగ్ సమయంలో తరచుగా మొబైల్ ఫోన్‌లో వీడియోలు చూడటం, ఇయర్‌ఫోన్స్ వినియోగించడం తాను గమనించానని తెలిపారు. ఇది చట్టరీత్యా నేరమని, అత్యంత ప్రమాదకరమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఉల్లంఘనలకు పాల్పడే వారిపై ఇక మీదట హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కఠినంగా వ్యవహరిస్తారని హెచ్చరించారు.

వాహనదారులకు స్వీయ రక్షణతో పాటు, ప్రయాణీకులు, తోటి రోడ్డు వినియోగదారుల భద్రత కూడా చాలా ముఖ్యమని సీపీ సజ్జనార్‌ నొక్కి చెప్పారు. చిన్న పాటి పరధ్యానం కూడా ప్రాణాలకు హాని కలిగిస్తుందని ఆయన అన్నారు. కాబట్టి, డ్రైవింగ్ సమయంలో ఇలాంటి వాటిపై దృష్టి పెట్టకుండా, సురక్షితంగా ఉండాలని సూచించారు.

కొన్ని సంవత్సరాల విరామం తర్వాత పోలీసు యూనిఫాం వేసుకున్న వీసీ సజ్జనార్ తాజాగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా (సీపీ) బాధ్యతలు చేపట్టారు. తొలి రోజు నుంచే తనదైన మార్క్ చూపిస్తున్నారు. సీపీగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారికి కఠిన హెచ్చరికలు జారీ చేస్తూ వచ్చారు. తాజాగా.. డ్రంక్ అండ్ డ్రైవ్‌ విషయంలో కూడా మందుబాబులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని.. ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే జైల్లో ఊచలు లెక్కపెట్టాల్సి వస్తుందని ఆయన స్పష్టం చేశారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.