ఈ ఫొటోలో కనిపిస్తున్న బొబ్బర్లు అంటారు. మనలో చాలా మందికి వీటి గురించి తెలిసే ఉంటుంది. సాయంత్రం పూట స్నాక్స్‌లాగా వీటిని తీసుకుంటుంటారు. బొబ్బర్లను ప్రతీ రోజూ క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ఇందులోని ఎన్నో మంచి గుణాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇంతకీ బొబ్బర్లు తింటే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం..
* బొబ్బర్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. శరీరంలో వైరస్ వ్యాప్తి చెందకుండా హానికర ట్యాక్సిన్లను నివారించడంలో బొబ్బర్లు ఉపయోగపడతాయి. పోషకాహార లోపం సమస్యను దూరం చేయడంలో బొబ్బర్లు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ప్రతీరోజూ కొన్ని బొబ్బర్లను తీసుకోవాలని సూచిస్తున్నారు.
* బరువు తగ్గాలనుకుంటున్నారా.? అయితే సాయంత్రం ఆయిల్‌తో చేసిన స్నాక్స్ బదులుగా బొబ్బర్లు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులో క్యాలరీలతోపాటు కొవ్వులు కూడా తక్కువగా ఉంటాయి. అలాగే ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. ఇది బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
* ఇక బొబ్బర్లలో ఉండే ఫైబర్ కంటెంట్ కారణంగా జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు. ముఖ్యంగా మలబద్ధకంతో బాధపడేవారికి ఇవి ఎంతగానో ఉపయోగపడుతాయి.
* మధుమేహంతో బాధపడేవారికి కూడా ఇవి బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులోని లో-గైసిమిక్ ఇండెక్స్ చాలా ఆరోగ్యకరం. ఇవి బ్లడ్ షుగర్ స్థాయిలను అదుపులో ఉంచడంలో సహాయపడుతాయి.
* రక్తంలో కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గించడంలో బొబ్బర్లు కీలకపాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇందులోని మెగ్నీషియం, పొటాషియం గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
* బొబ్బర్లను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం కూడా మెరుగువుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ప్రోటీన్ కంటెంట్ చర్మ రంధ్రాలు తెరుచుకొనేలా చేస్తుంది. వాటిలోని యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ ఎ, సి చర్మ కణాలను రక్షిస్తాయి.
నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.