పెరుగు – సిట్రస్ పండ్లు: చాలామంది పెరుగు ఆరోగ్యానికి మంచిదని ఉదయాన్నే తింటుంటారు. కానీ ఖాళీ కడుపుతో పెరుగు తినడం వల్ల అసిడిటీ, గ్యాస్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
అలాగే నారింజ, నిమ్మ వంటి విటమిన్-సి అధికంగా ఉండే సిట్రస్ పండ్లను కూడా నేరుగా తీసుకోకూడదు. వీటిలోని ఆమ్ల గుణాలు కడుపులో, గొంతులో మంటను కలిగిస్తాయి.
టీ లేదా కాఫీ: మనలో చాలామందికి బెడ్ టీ లేదా కాఫీ తాగనిదే రోజు గడవదు. కానీ ఖాళీ కడుపుతో కెఫిన్ తీసుకోవడం వల్ల జీర్ణరసాల ఉత్పత్తిలో మార్పులు వచ్చి అజీర్ణం, గ్యాస్ సమస్యలు తలెత్తుతాయి. టీ తాగే ముందు కనీసం ఒక గ్లాసు నీళ్లు తాగడం లేదా చిన్న బిస్కెట్ వంటివి తీసుకోవడం మంచిది.
పచ్చి కూరగాయలు: బ్రోకలీ, కాలీఫ్లవర్ వంటి పచ్చి కూరగాయలు ఆరోగ్యకరమే అయినప్పటికీ, ఖాళీ కడుపుతో తిన్నప్పుడు ప్రమాదకరం. వీటిలో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది. కడుపు ఖాళీగా ఉన్నప్పుడు వీటిని అరిగించుకోవడం జీర్ణవ్యవస్థకు కష్టమవుతుంది. తద్వారా తీవ్రమైన కడుపు నొప్పి, ఉబ్బరం కలుగుతాయి.
వేయించిన – కారంగా ఉండే ఆహారాలు: ఉదయాన్నే నూనెలో డీప్ ఫ్రై చేసిన ఆహారాలు లేదా అతిగా కారం ఉన్న వంటకాలు తింటే కడుపులో చికాకు మొదలవుతుంది. ఇది కాలక్రమేణా తీవ్రమైన అసిడిటీకి, గ్యాస్ట్రిక్ సమస్యలకు దారితీస్తుంది. ఉదయం పూట వీలైనంత వరకు తక్కువ మసాలాలు ఉన్న ఆహారం తీసుకోవడం ఉత్తమం.
కూల్ డ్రింక్స్ – బేకరీ ఐటమ్స్:కూల్ డ్రింక్స్, ప్యాక్ చేసిన పండ్ల రసాలు, కేకులు, బిస్కెట్లు లేదా పేస్ట్రీలు వంటి చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలను ఖాళీ కడుపుతో అస్సలు తీసుకోకూడదు. ఇవి శరీరంలో ఇన్సులిన్ స్థాయిని ఒక్కసారిగా పెంచడమే కాకుండా కాలేయంపై ఒత్తిడిని కలిగిస్తాయి.
అల్పాహారం అంటే రాత్రిపూట ఉపవాసాన్ని ముగించడం. అందుకే ఈ సమయంలో సాత్వికమైన, తేలికగా అరిగే ఆహారాన్ని ఎంచుకోవడం ముఖ్యం. గోరువెచ్చని నీరు, నానబెట్టిన బాదం లేదా ఓట్స్ వంటి వాటితో రోజును ప్రారంభించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా రోజంతా ఉత్సాహంగా ఉండవచ్చు.
































