పొద్దుపొద్దున్నే దట్టమైన పొగమంచు.. ఆ తర్వాత కాస్త ఎండ.. ఆ తర్వాత దట్టంగా మబ్బులు కమ్ముకుని వర్షం.. ఎక్కడా అని అనుకుంటున్నారా..? ఏపీలోని ఈ హిల్ స్టేషన్స్ కు వెళ్తే ప్రపంచాన్ని మర్చిపోతారు.
గత కొంతకాలంగా ఈ ప్రాంతాలకు ప్రజలు క్యూ కడుతున్నారు. మరి వాటి గురించి ఇక్కడ తెలుసుకుందాం.
అరకు లోయ
ఏపీలోని తూర్పు కనుమలలో ఉన్న ఒక సుందరమైన కొండ ప్రాంతమే అరకు లోయ. ఇది విశాఖపట్నానికి పశ్చిమాన 111 కి.మీ దూరంలో ఉంది. కాఫీ తోటలకు, స్థానిక తెగలకు, సహజ సౌందర్యానికి ప్రసిద్ధి చెందింది. అందుకే ఈ ప్రాంతాన్ని “ఆంధ్ర ఊటీ” అని పిలుస్తారు. ఇక్కడ దట్టమైన అడవులు, పచ్చదనం సహజ సౌందర్యంతో కూడి ఉంటాయి. శీతాకాలంలో పూసే వలిసపూలు కొండలకు మరింత అందాన్నిస్తాయి. ఇక్కడ అనేక తెగలు నివసిస్తున్నాయి.
అరకు కాఫీ పండించడానికి అద్భుతమైన ఎత్తైన ప్రాంతంగా గుర్తింపు పొందింది. అరకు లోయను విశాఖపట్నం నుండి రోడ్డు, రైలు మార్గం ద్వారా చేరుకోవచ్చు.
హార్సిలీ హిల్స్
హార్సిలీ హిల్స్ అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె పట్టణానికి 15 కి.మీ. దూరంలో ఉన్నాయి. ఇది ఒక కొండల శ్రేణి, పర్యాటక ప్రదేశం. అలాగే ఈ ప్రాంతాన్ని ఏనుగుల మల్లమ్మ కొండగా పిలుస్తుంటారు. పూర్వం మల్లమ్మ అనే భక్తురాలు ఈ కొండపై తపస్సు చేసినపుడు, అడవిలో సంచరించే ఓ ఏనుగు ఈమెకు పండ్లు తెచ్చి ఆకలిని తీర్చినందున ఈ ప్రాంతానికి ఆ పేరు వచ్చినట్లు స్థానికులు చెబుతుంటారు. బ్రిటిష్ కాలంలో మదనపల్లె కలెక్టర్ గా పనిచేసిన డబ్ల్యు .డి. హార్సిలీ అనే అధికారి 1863లో వేసవి విడిదిగా ఇక్కడ ఒక ఇంటిని నిర్మించుకున్నారు. అప్పటి నుంచి ఆయన పేరుతో హార్సిలీ హిల్స్ అని పిలుస్తున్నారు.
హార్సిలీ హిల్స్ పై పర్యాటకులు ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడి అటవీ ప్రాంగణంలో మినీ జంతు ప్రదర్శనశాల, మొసళ్ల పార్కు, చేపల ప్రదర్శనశాల ఉన్నాయి. చిన్నారులు ఆడుకునేందుకు ఏర్పాట్లూ చేశారు. వేసవి రాత్రుల్లో ఏసీలో ఉన్నట్లుగా ఈ ప్రాంతం ఉంటుంది. చందనం చెట్లు, శీకాయ వృక్షాలు, యూకలిప్టస్ చెట్లు అధికంగా ఉన్నాయి. అందుకే హార్సిలీ హిల్స్ కు ఏడాది పొడుగునా పర్యాటకులు వస్తుంటారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా పర్యాటకులు ఇక్కడికి వస్తుంటారు. వేసవి వినోదాన్ని ఆస్వాదిస్తుంటారు.
లంబసింగి
లంబసింగి ప్రాంతం అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతపల్లి మండలానికి చెందిన ఓ గ్రామం. ఈ గ్రామానికి కొర్రబయలు అనే పేరు కూడా ఉంది. కొర్ర అంటే కర్ర, బయలు అంటే బయట అని అర్థం. ఎవరైనా ఇంటి బయట పడుకుంటే తెల్లారేసరికి కొయ్యలా బిగుసుకుపోతారనే అర్థంలో అలా పిలుస్తారు. అంటే అంతటి చల్లని ప్రదేశం అని అర్థం. ఆంధ్రా కాశ్మీర్ అని కూడా పిలుస్తుంటారు. లంబసింగి గ్రామం విశాఖపట్నం నగరానికి 101 కిలోమీటర్ల దూరం, నర్సీపట్నం గ్రామానికి 32 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతాలనుండి లంబసింగికి రోడ్డు మార్గం ఉంది. వేసవిలో ఈ ప్రాంతానికి అధికంగా వస్తుంటారు.
నగరి కొండలు
ఇక నగరి కొండలు చిత్తూరు జిల్లాలో ఉన్న నగరి ప్రాంతంలోని కొండలు అని అర్థం. ఈ కొండలు నగరి పట్టణం చుట్టూ ఉన్నాయి, ముఖ్యంగా పర్యాటక ప్రదేశాలు, ఆలయాలు ఉన్నాయి. ఈ కొండలు పర్యాటక ప్రదేశంగానూ, ప్రకృతి సౌందర్యానికి ప్రసిద్ధి చెందినవి. తిరుపతికి 55 కిమీల దూరంలో ఈ హిల్ స్టేషన్ ఉంటుది. చిత్తూరు జిల్లాలోని కుసస్థలి నది ఒడ్డున, సముద్ర మట్టానికి 855 కిమీల ఎత్తులో కొండ ఉంది. ఈ ప్రాంతాన్ని నగరి ముర్కొండ అని కూడా పిలుస్తుంటారు. అక్కడి అటవీ ప్రాంతం, జలపాతాలు పర్యటకులను ఆకట్టుకుంటాయి. ట్రెక్కింగ్ చేసేవారికి ఈ ప్రాంతం అనుకూలమైనది. అలాగే నగరి సమీపంలోని కైలాశకోన జలపాతం కూడా ఉంది.
పాపికొండలు
పాపికొండలు.. తూర్పు కనుమలలోని దట్టమైన అడవులతో కూడిన ఒక పర్వత శ్రేణి. ఇవి పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి జిల్లాల మధ్య ఉన్నాయి. ఈ ప్రాంతం 1,012.86 కి.మీ విస్తీర్ణంలో వ్యాపించి ఉన్నాయి. రాజమండ్రి నగరానికి సుమారు 60 కిలోమీటర్లు, తెలంగాణలోని భద్రాచలం పట్టణం నుండి సుమారు 60 కిలోమీటర్లు దూరంలో వున్న ఈ ప్రాంతం జాతీయ వనంగా గుర్తించబడింది.
రాజమహేంద్రవరం నుండి పాపికొండల విహార యాత్ర దేవీపట్నం మండలంలోని పోశమ్మగండి గుడి వరకు రోడ్డు మార్గంలో సాగుతుంది. అక్కడినుంచి లాంచీలో పూడిపల్లి, సిరివాక, కొల్లూరు మీదుగా పేరంటాలపల్లి ఈశ్వరాలయం వరకు సాగుతుంది. ఈ యాత్రలో గోదావరి చాలా తక్కువ వెడల్పుతో కొండల మధ్య ప్రవహిస్తూ మరింత రమణీయంగా ఉంటుంది.
































