విశాఖపట్నం నగరంలోని అదొక రద్దీ ప్రాంతం.. ఆ ప్రాంతంలో ఓ పాన్ షాప్.. ఇక్కడికి వచ్చే వారిలో కొందరు మత్తు మనుషులున్నారు.. మంచిగా టిప్‌టాప్‌గా వస్తారు..
చాక్లెట్లు కొనుక్కెళతారు.. అదేంటి.. చాక్లెట్లు ఏంటి..? అని ఆలోచిస్తున్నారా.. ఇక్కడ ఉంది అసలు ట్విస్ట్.. ఈ పాన్ షాప్ మాటున మత్తు దందా సాగిపోతుంది..! చాక్లెట్ల రూపంలో గంజాయి సప్లై అయిపోతుంది. అడిగినవారికి అడిగినంత అన్నట్టుగా ఆ దందా సాగిపోతుంది. ఇక చెప్పేదేముంది.. ఆ గంజాయి చాక్లెట్లో తిని మత్తులో చిత్తవుతున్నారు యువత. ఎంతకాలంగా సాగిపోతుందో ఏమోగానీ.. ఎట్టకేలకు పోలీసులకు ఉప్పందింది. సీపీ ఆదేశాలతో పాన్ షాప్ పై మెరుపు దాడులు చేసిన పోలీసులు.. చాక్లెట్ల మాటున గంజాయ్ గుట్టును రట్టు చేశారు.
ఇలా విశాఖలో గంజాయి చాక్లెట్లు కలకలం రేపాయి. టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ పాన్ షాప్ లో విక్రయాలు చేస్తున్నట్టు టాస్క్ ఫోర్స్ కు సమాచారం అందింది. సిపి బాగ్చి ఆదేశాలతో రంగంలోకి దిగిన టాస్క్ ఫోర్స్, 2 టౌన్ పోలీసులు.. క్రాంతి థియేటర్ సమీపంలోని ఓ పాన్ షాప్ లో సోదాలు చేశారు. 660 గ్రాముల 133 గంజాయి చాక్లెట్లు సీజ్ చేశారు. నిందితుడు మనోజ్ కుమార్ చౌదరిని పోలీసులు అరెస్టు చేశారు.
గంజాయి చాక్లెట్లను మనోజ్ కుమార్ కు సప్లై చేస్తున్న వారు ఎవరు.? అవి ఎక్కడి నుంచి వస్తున్నాయనే దానిపై ఇప్పుడు కూపీ లాగుతున్నారు పోలీసులు. గతంలో ఎండు గంజాయి.. ఆ తర్వాత లిక్విడ్ గంజాయి.. సిగరెట్లలో గంజాయి.. ఇప్పుడు పాన్ షాప్ లో ఏకంగా గంజాయి చాక్లెట్ల రూపంలో దర్శనమివ్వడం ఆందోళన కలిగిస్తోంది.
కాగా.. మాదక ద్రవ్యాలపై చంద్రబాబు సర్కార్ ఉక్కుపాదం మోపుతోంది.. గంజాయి నియంత్రణలో భాగంగా ప్రభుత్వం సీరియస్ గా వీటిపై దృష్టి సారించి.. అరికట్టేందుకు ప్రణాళికలు రచిస్తోంది.. దీనికనుగుణంగా పోలీసులకు స్పష్టమైన ఆదేశాలు సైతం జారీ చేసింది.. అందులో భాగంగానే మత్తు ముఠాలపై నిఘా పెంచిన పోలీసులు.. దాడులు చేసి నిందితులను కటకటాల వెనక్కు నెడుతున్నారు.