వ్యక్తిగత రుణాలు ఎమర్జెన్సీ టైములో మనకు చాలా ఉపయోగపడతాయి. కానీ సరైన ప్లానింగ్ లేకుండా తీసుకుంటే మాత్రం ఇవి తీర్చలేనంత మొత్తాలకు చేరుకుంటాయి. అసలు లోన్ ఎందుకు తీసుకున్నాం రా బాబూ అంటూ తల పట్టుకునే వారు చాలామందే ఉంటారు.
తీసుకున్నదానికి చెల్లించే దానికి అసలు సంబంధం ఉండకుండా పే చేస్తూనే ఉంటారు. చెల్లించాలిసిన మొత్తానికి చెల్లించే దానికి చాలా తేడా వస్తుంది కొన్ని సార్లు. ఎందుకిలా జరుగుతుంది…అసలు పర్సనల్ లోన్ తీసుకునేప్పుడు జరిగే తప్పులేమిటి, ఎక్కడ మీకు తెలియకుండా తప్పులు జరుగుతాయి అనే విషయాలు మీకోసం..
హిడెన్ చార్జెస్:
పర్సనల్ లోన్ తీసుకునే అప్పుడు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఇదే. లోన్ ఆఫర్ ఇస్తారు, అవసరంతోనో, లేక లోన్ దొరుకుతుందికదా ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసేద్దాం అనో ఇంకో కారణంతోనో తీసుకుంటాం. అయితే మొదట బాదుడు మొదలయ్యేది ఇక్కడినుండే. కనిపించని చార్జీలు అంటే ప్రాసెసింగ్ చార్జీలు వంటివి చాలానే ఉంటాయి. ఒక్క ప్రాసెసింగ్ ఫీజు ౦.5 % నుండి 3 % వరకు ఉంటాయి. అదనంగా, లేట్ పేమెంట్ ఫీజులు, ప్రీపేమెంట్ ఛార్జీలు, ఫోర్‌క్లోజర్ ఫీజులు, స్టాంప్ డ్యూటీ వంటి మరిన్ని ఛార్జీలు ఉంటాయి. ఇవన్నీ కలిపి చూస్తే రుణం ఊహించిన దానికంటే రెట్టింపవుతుంది.
వడ్డీ రేట్లు:
సాధారణం గా పర్సనల్ లోన్లు ఫిక్స్డ్ ఇంటరెస్ట్ రేట్లతో వస్తాయి. ప్రస్తుతం ఈ రేట్లు మనకు 10.90% to 24% వరకు ఉన్నాయి. ఐతే మీకు ఏ రేటుకు అప్పు దొరుకుతుంది అనేది మాత్రం కేవలం మీ క్రెడిట్ హిస్టరీ, సిబిల్ రేటింగ్ మీద ఆధార పడి ఉంటుంది. క్రెడిట్ రేట్ బాగోకపోతే మాత్రం మీరు ఎక్కువవడ్డీకు అప్పు తీసుకోవాల్సి రావొచ్చు. ఇది మీరు చెల్లించే మొత్తాన్ని పెంచుతుంది. ఋణం భారంగా మారుతుంది. పర్సనల్ లోన్ లో సాధారణంగా వాడేరేట్లు ఫిక్స్డ్ ఉన్న్డటంతో EMI మారదు కానీ కొన్ని సందర్భాల్లో కొన్ని NBFC లు , బ్యాంకు లు రీ సెట్ క్లాజుతో తో వడ్డీ రేట్లను మార్చే అవకాశాన్ని కలిగి ఉంటారు. ఇది టర్మ్స్ అండ్ కండిషన్ లలో పేర్కొంటారు. అవి కూడా జాగ్రత్తగా చూసుకోవడం చాలా అవసరం.
అనేక అప్పులు ఒకేసారి తీసుకోవడం:
కొంతమంది అవసరం లేకపోయినా కూడా అనేక లోన్స్ తీసుకుంటారు. మరికొంత మంది ఒక అప్పు తీర్చడానికి మరొక లోన్ తీసుకుంటారు. ఇది మరీ ప్రమాదకరం. ఇదే చాలామంది కి పర్సనల్ లోన్ భారంగా మారడానికి ముఖ్య కారణం ఎలా అంటే దానివల్ల ఒక్క లోన్ EMI మిస్సైనా కూడా కూడా అది ఫైన్లు లేదా అదనపు వడ్డీల చెల్లింపుకు దారి తీస్తుంది. సాధారణంగా ఈ వడ్డీలు కంపౌండింగ్ విధానంలో వసూలు చేస్తారు. ఇలా మిస్ చేసుకుంటూ పోతే అది కనిపించకుండా మీరు తిరిగి చెల్లించాలిసిన మొత్తం పై పడి మొత్తం పెరుగుతుంది. దీనివల్ల చెల్లింపులు చేయడం కష్టమవుతుంది, క్రెడిట్ స్కోర్ పడిపోతుంది. ఆర్థిక ఒత్తిడి పెరుగుతుంది.
4. టెన్యూర్ ఎక్కువగా పెట్టుకోవడం:
కొంతమంది లోన్ రే పేమెంట్ వ్యవధి చాలా ఎక్కువగా గా పెట్టుకుంటారు. ఇది నెలవారీ EMI భారాన్ని తగ్గించినట్టు కనిపించిన మీరు తిరిగి చెల్లించే మొత్తాన్ని పెంచుతుంది. అందుకే అవసరానికి అప్పుడు తీసుకున్నా కూడా వీలైనంత తక్కువ వాయిదాలు పెట్టుకోండి. వడ్డీ కలిసి రావడం వల్ల రుణభారం తగ్గుతుంది.
5 . సరైన ప్లానింగ్ లేకపోవడం:
ఇది చాలామంది చేసే అతి పెద్ద తప్పు. పర్సనల్ లోన్ అంటే మన బ్యాంకు లో ఉన్న డబ్బు ఖర్చుపెట్టటం కాదు. అప్పు అని గుర్తు పెట్టుకోండి. లోన్ తీసుకుంటే మొత్తం వాయిదాలు కట్టి అప్పు నుండి బయటపడటం ఒక్కటే మార్గం కాదు. లోన్ రీ పేమెంట్ త్వరగా చెయ్యాలన్న ప్లాన్ ఖచ్చితంగా ఉండాలి. పార్ట్ పేమెంట్ చెయ్యటం, ఎక్కువ వడ్డీ అప్పులను ముందుగా క్లియర్ చెయ్యటం కోసం తక్కువ వడ్డీ లోన్ వస్తుంటే అది తీసుకుని ఎక్కువ వడ్డీ ఉన్న అప్పులను వదిలించుకోవాలి. ఏదైనా పెద్ద మొత్తాలు చేతికందినప్పుడు లోన్ లో కొంతభాగం తీర్చే వీలుంటే తీర్చడం ద్వారా కూడా పర్సనల్ లోన్ భారంగా మారకుండా చూసుకోవచ్చు.
వ్యక్తిగత రుణం అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగపడుతుంది కానీ సాధ్యమైనంత వరకు వీటికి దూరంగా ఉండండి. ఒకవేళ తీసుకోవడం తప్పనిసరి అయితే మాత్రం దరఖాస్తు చేసుకునే ముందు అన్ని ఫీజులు తెలుసుకోండి.అలాగే EMI కాలిక్యులేటర్ ను ఉపయోగించి మీ చెల్లింపు సామర్థ్యాన్ని చెక్ చేయండి. ఒకేసారి పలు రుణాల కోసం అప్లై చేయకండి. వీలైనంత వరకు తక్కువ గడువు ఎంచుకోండి. ప్రీపేమెంట్, రిఫైనాన్సింగ్‌ను అవసరాన్ని బట్టి వాడుకోండి.






























