అమెరికాలో చదువుల కోసం ఎదురుచూస్తున్న విదేశీ విద్యార్థులకు అగ్రరాజ్యం శుభవార్త వినిపించింది. ఇటీవల తాత్కాలికంగా నిలిపివేసిన విద్యార్థి వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ మళ్లీ ప్రారంభించింది.
అయితే వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్లను తప్పనిసరిగా చెక్ చేస్తామని వెల్లడించింది. ఈ మేరకు అమెరికా విదేశాంగశాఖ తాజాగా మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది.
ఈ సోషల్ మీడియా వెట్టింగ్ తో మన దేశంలోకి వచ్చేందుకు ప్రయత్నిస్తున్న ప్రతి వ్యక్తిని పూర్తిగా పరిశీలించేందుకు వీలు లభిస్తుంది. వీసా కోసం దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సోషల్ మీడియా అకౌంట్స్ ను అమెరికా కాన్సులర్ అధికారులు క్షుణ్ణంగా చెక్ చేస్తారు. ఇందుకోసం దరఖాస్తుదారులు తమతమ సోషల్ మీడియా ప్రొఫైళ్లను ప్రైవేట్ సెట్టింగ్స్ ను మార్చుకుని పబ్లిక్ ఆప్షన్ పెట్టుకోవాలంటూ విదేశాంగ శాఖ సీనియర్ అధికారులు ఒకరు తెలిపారు.
ఈ ఏడాది మే చివరి వారం నుంచి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబారా కార్యాలయాల్లో కొత్త దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వీసా ఇంటర్వ్యూల షెడ్యూలింగ్ ను తాత్కాలికంగా నిలిపివేసిన విషయం తెలిసిందే. వీసా జారీకి అవసరమైన సోషల్ మీడియా అకౌంట్స్ పరిశీలనకు సన్నాహాలు చేస్తున్నామని..అందుకే వీసాల జారీని నిలిపివేశామని అప్పట్లో విదేశాంగశాఖ తెలిపింది. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియా వెట్టింగ్ ను తప్పనిసరి చేస్తూ వీసా అపాయింట్ మెంట్ల ప్రక్రియను పునరుద్ధరించింది.
వీసా అప్లయ్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వచ్చా లేదా అనే దాన్ని అంచనా వేయడం కోసం వారి ఆన్ లైన్ యాక్టివిటీని అధికారుుల చెక్ చేస్తారు. దీన్ని సోషల్ మీడియా వెట్టింగ్ అంటారు. సంబంధిత విద్యార్థుల సోషల్ మీడియా ప్రొఫైళ్లను చెక్ చేసిన తర్వాతే వీసా మంజూరు చేస్తారు. ఊదాహరణకు ఎవరైనా విద్యార్థ తన సోషల్ మీడియా అకౌంట్లో పాలస్తీనా జెండాను పోస్ట్ చేస్తే ఆ వ్యక్తిని క్షుణ్ణంగా పరిశీలిస్తారు. వారి వల్ల దేశ భద్రతకు ఏ ప్రమాదం లేదని నిర్ధరించుకున్న తర్వాతే వారిని అమెరికా విద్యాసంస్థల్లో చదువుకునేందుకు అనుమతి ఇస్తారు. అప్పుడే వారికి విద్యార్థి వీసా లభిస్తుంది.
































