నూనెను నీళ్లలా వాడితే.

సాధారణంగా అందరూ ఆరోగ్యకరమైన ఆహారం గురించే మాట్లాడతారు. కానీ, ఆరోగ్యకరంగా ఆహారం వండడం గురించి ఎక్కువగా మాట్లాడరు. ఈ క్రమంలో హెల్దీ కుకింగ్‌లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది నూనె వాడకం. సాధారణంగా మన వంటల్లో నూనె కొంచెం ఎక్కువగానే ఉంటుంది. మనకు తెలియకుండానే తీసుకునే ఈ ఆయిల్‌ వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు ఎదురవుతాయి. ఈ క్రమంలో ఆయిల్‌ వాడకానికి సంబంధించి కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదు అంటున్నారు నిపుణులు.


నూనె లేని వంటలు ఆరోగ్యానికి మంచివని తెలిసినా… వంటకానికి మంచి రుచి కావాలంటే గిన్నెలో ఆయిల్‌ పడాల్సిందే. అయితే నూనెను ఎలా పడితే అలా నీళ్లలా వాడితే మాత్రం భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందే అంటున్నారు నిపుణులు. ఈ క్రమంలో నూనె వాడకంలో కొన్ని జాగ్రత్తలు పాటిస్తే రుచికరమైన ఆహారంతో పాటు ఆరోగ్యమూ సొంతమవుతుంది.

నూనెను తగ్గిద్దామిలా!

⚛ వేపుళ్ల బదులు బేకింగ్, స్టీమింగ్‌కు ప్రాధాన్యమివ్వండి. దీంతో ఆయా విటమిన్లు శరీరానికి పుష్కలంగా అందుతాయి.

⚛ ఫ్రైడ్ స్నాక్స్‌కి బదులు స్టీమ్‌ చేసిన స్నాక్స్‌ను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

⚛ నూనెలు కాస్త తక్కువగా వాడేవారు… వంటలో పొరపాటున కాస్త ఎక్కువైతే తినడానికి ఇబ్బంది పడతారు. ఇలాంటప్పుడు నూనెను కొలత ప్రకారం వాడుకోవడమే పరిష్కారం. ఇందులో భాగంగా డైరెక్ట్‌గా బాటిల్‌లో నుంచి నూనెను పోసే బదులు మెజరింగ్ స్పూన్‌ లాంటి వాటితో వేయండి. అప్పుడు ఎంత నూనె వాడుతున్నారో తెలుస్తుంది.

⚛ ఎప్పుడూ ఒకే నూనెను కాకుండా కాంబినేషన్ ఆయిల్స్‌ను వాడితే మంచిది. సన్‌ఫ్లవర్, రైస్‌ బ్రాన్, నువ్వులు, వేరుశెనగ, కొబ్బరి నూనెల్లో ఉండే మోనోశ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, పాలీ అన్‌శ్యాచురేటెడ్‌ ఫ్యాటీ యాసిడ్స్ మన బాడీకి చాలా అవసరం. మన శరీరం వాటిని స్వయంగా తయారుచేసుకోలేదు. వంట నూనె ద్వారానే అవి శరీరానికి అందుతాయి. అందుకే వేరు వేరు నూనెల్ని కలిపి వాడుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయంటున్నారు నిపుణులు.

⚛ నూనె వినియోగానికి సంబంధించి నెలకు ఎంత వాడుతున్నామో ఒక లెక్క వేసి చూసుకోండి. అప్పుడు మీకు కూడా ఒక అవగాహన వస్తుంది. దీన్ని బట్టి అవసరం అనుకుంటే ఈ టిప్స్‌ ద్వారా నూనె వాడకాన్ని తగ్గించవచ్చు.

⚛ వేపుళ్లకి వాడిన నూనెని మళ్లీ వేయించడానికి ఉపయోగించకండి. ఇందువల్ల శరీరంలోకి టాక్సిన్స్‌ చేరే ప్రమాదం ఉంది.

ఇవి కూడా పాటించండి!

⚛ వంట నూనెను ఎక్కువసేపు వేడి చేస్తే అందులో ఉండే విటమిన్లు శరీరానికి అందవు. అంతేకాదు… ఒకసారి వాడిన నూనెను ఎక్కువసార్లు వాడకూడదు.

⚛ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇప్పటికే వాడిన నూనెతో తాజా నూనెను కలపకండి.

⚛ నూనెను వేడి చేసినప్పుడు దాని టెంపరేచర్‌ కూడా మారుతుంది. ఏ టెంపరేచర్‌ వద్ద నూనె పొగ రావడం మొదలు పెడుతుందో దానిని ‘స్మోకింగ్‌ పాయింట్‌’ అంటారు. దీనిపై కొంచెమైనా అవగాహన కలిగి ఉండాలి. ప్రత్యేకించి ఫ్రై చేయాల్సిన అవసరం వస్తే ఎక్కువ స్మోకింగ్‌ పాయింట్‌ ఉన్న నూనెను మాత్రమే వాడాలి.

⚛ వంట నూనెపై సూర్యరశ్మి పడకుండా చూడాలి. నేరుగా ఎండ పడడం వల్ల నూనెలో కొన్ని రసాయనిక మార్పులు జరిగే అవకాశం ఉంది.

⚛ వంట నూనె కొనే ముందు అందులో ఉన్న కొవ్వు శాతం చూసి మరీ కొనాలి. నిర్ణీత మోతాదు కన్నా ఎక్కువ ఉంటే ఆరోగ్యానికి ప్రమాదకరం అంటున్నారు నిపుణులు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.