సచివాలయంలో ఫైళ్లు కట్టుదిట్టం
కక్ష సాధింపుల ‘సిట్’ ఆఫీసుకు సీల్
పోలీసుల ఐటీ వింగ్ ఆధీనంలోకి ఈ-ఆఫీస్
నేరుగా రంగంలోకి గవర్నర్
సచివాలయంలో ఫైళ్లు స్వాధీనం చేసుకోవాలని ఆదేశం
అడ్డగోలుగా అక్రమ బదిలీలు, పదోన్నతులు
అస్మదీయులకు వేల కోట్ల విలువైన కాంట్రాక్టులు
ఉన్నతాధికారుల పాత్రపైనా ఆరోపణలు
వాటి ఫైళ్లు ధ్వంసమయ్యే ముప్పు
ఐదు బ్లాకుల్లోని ఫైళ్లు, సమాచారమంతా స్వాధీనం
సచివాలయ ఉద్యోగుల వ్యక్తిగత ల్యాప్‌టాప్‌లూ కట్టడి
చెక్ చేసి తిరిగిస్తామంటున్న జీఏడీ ఉన్నతాధికారులు
(అమరావతి – ఆంధ్రజ్యోతి)
‘వైసీపీ అధికారుల’ తప్పుల లెక్కలు తేల్చేందుకు రంగం సిద్ధమైంది. ‘అక్రమాల ఫైళ్ల’కు రెక్కలు రాకుండా ఏకంగా గవర్నర్ కార్యాలయమే రంగంలోకి దిగింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజునే పాత సర్కారు పాతకాలను పద్ధతిగా బయటపెట్టే ప్రక్రియ మొదలైంది. సచివాలయం నుంచి ఒక్క కాగితం కూడా బయటకు పోవడానికి వీల్లేదని, ప్రధాన కార్యాలయాలపై నిఘా పెంచాలని గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ బుధవారం స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. ఆ వెంటనే జీఏడీ పొలిటికల్ సెక్రటరీ సురేశ్ కుమార్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు.. కార్యదర్శులకు దీనిపై ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు… కేవలం చంద్రబాబును, టీడీపీ నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా జగన్ సర్కారు ఏర్పాటు చేసిన ‘సిట్’ కార్యాలయానికి కూడా బుధవారం తాళం పడింది. తాడేపల్లిలోని ఈ ఆఫీసు కేంద్రంగానే కుట్రలు నడిచాయి. అడిషనల్ కమాండెంట్ బెటాలియన్స్ ప్రకాశ్ నేతృత్వంలోని బృందం బుధవారం ఇక్కడికి చేరుకుంది. కార్యాలయానికి సీలు వేసేందుకు సిట్ డీఎస్పీ ధనుంజయ్ నిరాకరించారు. అక్నాలెడ్జ్‌మెంట్ కావాలని, ఆదేశాలు కావాలని సహాయ నిరాకరణ చేశారు. దీంతో… నేరుగా డీజీపీ హరీశ్ కుమార్ గుప్తా జోక్యం చేసుకున్నారు. దీంతో… సిట్ ఆఫీసు ప్రధాన ద్వారానికి సీల్ పడింది. అక్కడ ఏపీఎస్పీ పోలీసులను కాపలా పెట్టారు. ఇక స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన ‘సిట్’ అధిపతి కొల్లి రఘురామి రెడ్డికీ షాక్ ఇచ్చారు. ఆయన తక్షణమే పోస్టులన్నీ వదిలేసి హెడ్ క్వార్టర్స్‌లో రిపోర్టు చేయాలని డీజీపీ గుప్తా మంగళవారం ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఆయన ఆయన మంగళగిరిలోని డీజీపీ కార్యాలయంలో రిపోర్టు చేశారు. జగన్ హయాంలో ఏకకాలంలో విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీ, డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్, సిట్ అధిపతిగా ఉన్న కొల్లి రఘురామి రెడ్డి పనిచేశారు. అలాంటి అధికారి డీజీపీ కార్యాలయంలో ఒక మూల కూర్చున్నారు.
నిఘా వలయంలోకి ఐదు బ్లాక్‌లు
ముఖ్యమంత్రిగా జగన్మోహనరెడ్డి రాజీనామా చేశారు. త్వరలోనే కొత్త ప్రభుత్వం కొలువు తీరనుంది. ఈ సంధికాలంలో కీలకమైన ఫైళ్లు మాయమయ్యే ప్రమాదం ఉంది. గత ప్రభుత్వంలో వివాదాస్పద భూ కేటాయింపులు, అక్రమ బదిలీలు, పదోన్నతులు, టెండర్ ప్రక్రియల్లో అవినీతి జరిగాయన్న ఆరోపణలున్నాయి. దానికి సంబంధించిన ఫైళ్లను కొత్త సర్కారు కొలువుతీరేలోపే మొత్తంగా ధ్వంసం చేసే అవకాశముండటంతో గవర్నర్ రంగంలోకి దిగారు. ఫైళ్లు మొత్తం భద్రంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో సచివాలయం ఐదు బ్లాకుల్లోని వివిధ కార్యాలయాలు, అందులోని సామగ్రి వివరాలను పరిశీలించి నమోదు చేసుకున్నారు. మంత్రులు, సలహాదారుల పేషీల నుంచి నేమ్ ప్లేట్లు ఉన్న బోర్డులను సాధారణ పరిపాలనశాఖ సిబ్బంది తొలగించారు. మంత్రుల పేషీల్లోని ఫర్నీచర్, కంప్యూటర్ల వివరాలు నమోదు చేసుకుని తమ దగ్గర ఉన్న వివరాలతో జీఏడీ అధికారులు సరిపోల్చుకున్నారు. మంత్రుల పేషీల్లోని వ్యక్తిగత సామగ్రిని సచివాలయం నుంచి బయటకు తీసుకు వెళ్లాలంటే ముందుగా బిల్లులు చూపించాలని జీఏడీ స్పష్టం చేసింది. కార్యాలయాల నుంచి బయటకి వెళ్లే వాహనాలను ఎస్పీఎఫ్ సిబ్బంది తనిఖీలు చేయడం కనిపించింది.
రంగంలోకి పోలీస్ ఐటీ టీమ్
పోలీసు శాఖలోని ఐటీ టీమ్ రంగంలోకి దిగింది. సచివాలయంలో మూడో బ్లాక్‌లోని ఈ – ఆఫీస్ విభాగంలో తనిఖీలు నిర్వహించింది. ఈ తనిఖీల్లో ఐటీ వింగ్ ఎస్పీ ప్రకాశ్ పాల్గొన్నారు. ఐటీ విభాగంలోని కంప్యూటర్ల నుంచి డేటా చౌర్యం జరిగిందని, పలు ఫైళ్లకు సంబంధించిన డేటాను డిలీట్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పోలీస్ అధికారులు అక్కడ తనిఖీలు నిర్వహించారు. ఈ-ఆఫీ్‌సను స్వాధీనం చేసుకున్నారు. లాగిన్ ఐడీలను క్లోజ్ చేశారు. సీఎం ఆఫీ్‌సకు చెందిన ఫైళ్లు ఈ ఆఫీస్ నుంచి మాయం చేస్తున్నారని డీజీపీకి ఫిర్యాదులు వెళ్లాయని తెలిసింది. దీనిపై సైబర్ క్రైమ్, ఇతర పోలీస్ టీంలు రంగంలోకి దిగాయి. ఐటీ కమ్యూనికేషన్ విభాగంలో వారంరోజులుగా ఫైళ్ల కదలికల తీరును పరిశీలించినట్టు తెలిసింది. ఉద్యోగుల సొంత ల్యాప్‌టా్‌పలను సైతం లోపలే పెట్టి వెళ్లిపొవాలని, చెక్ చేసిన తర్వాత ఇస్తామని ఆదేశించారు. సర్వర్లలో డేటా డిలీట్ చేసేందుకు ప్రయత్నాలు జరిగాయని వచ్చిన ఆరోపణలతోనే ఈ తనిఖీలు జరిగాయే చర్చ జరుగుతోంది. తనిఖీల అనతరం ఈ-ఆఫీస్ గది వద్ద పోలీసులను కాపలా ఉంచారు.
ఫలితాల రోజూ ఫైళ్లు బయటకు..
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం, పేషీపై జీఏడీ ఫోకస్ పెంచింది. మంగళవారం ఫలితాలు ఒకవైపు వెలువడుతుండగానే, సీఎస్ పేషీలో కొన్ని ఫైళ్లకు ఆమోదం తెలిపారు. కొంత మంది కీలక అధికారులు సెలవులపై వెళ్లడానికి అనుమతించారు కూడా. దీనిపై గవర్నర్ కొంత ఆసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
కక్ష సాధించేందుకే ‘సిట్’
జగన్ అధికారంలోకి రాగానే చంద్రబాబును టార్గెట్ చేశా రు. రాజధాని భూముల్లో ఇన్‌సైడ్ ట్రేడింగ్, ఇన్నర్ రింగ్ రోడ్డు, ఫైబర్ నెట్, స్కిల్ డెవల్‌పమెంట్ కార్పొరేషన్‌లలో అక్రమాలు జరిగాయంటూ ఆయనపై పెట్టారు. ‘వైసీపీ ఖాకీ’గా పేరు ఉన్న కొల్లి రఘురామిరెడ్డి నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృం దం(సిట్) ఏర్పాటు చేశారు. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా స్కిల్ డెవల్‌పమెంట్ కేసులో చంద్రబాబును అర్ధరాత్రి నంద్యాలలో అరెస్టు చేసి రాజమహేంద్రవరం జైలులో 52రోజుల పాటు బంధించింది. మిగతా కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ తెచ్చుకోవడంతో ‘సిట్’ పని ఆగిపోయింది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత బాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ సంస్థకు సంబంధించిన పలు డాక్యుమెంట్లను ‘సిట్’ కార్యాలయంలో తగలబెట్టడం అప్పట్లో కలకలం రేపింది. ఈ ఎన్నికల్లో జగన్ పార్టీ ఓడిపోయింది. ఈ నేపథ్యంలో మిగతా డాక్యుమెంట్లు ఏవైనా సిట్ అధికారులు, సిబ్బంది ధ్వంసం, మాయం చేసే అవకాశం ఉందని పోలీసు శాఖ అనుమానించింది. ఈ నేపథ్యంలోనే సిట్ కార్యాలయానికి తాళం వేసింది.