ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన ప్రశంసలపై కేంద్రమంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ ఫైర్ అయ్యారు.
రేవంత్ పై పవన్ వ్యాఖ్యల్ని పవన్ తప్పుబట్టారు. రేవంత్ ఏ విషయంలో ఆయనకు గొప్పగా కనిపించారో అంటూ సెటైర్లు వేశారు. ఇవాళ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుతో భేటీ తర్వాత మీడియా చిట్ చాట్ లో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. ఈ చిట్ చాట్ లో పవన్ అల్లు అర్జున్ ను తప్పుబట్టారు.
సంధ్య థియేటర ఘటన జరిగిన రెండో రోజే అల్లు అర్జున్ బాధిత కుటుంబం దగ్గరికి వెళ్లి పరామర్శిస్తే సరిపోయేదని, అల్లు అర్జున్ గోటితో పోయే దానికి గొడ్డలి వరకూ తెచ్చుకున్నారని పవన్ అన్నారు. సినిమా ఇండస్ట్రీ విషయంలో రేవంత్ రెడ్డి ఎంతో ప్రోత్సాహం ఇచ్చారన్నారు. అభిమాని మృతిచెందిన తర్వాత వెంటనే వాళ్ల ఇంటికి వెళ్లి పరామర్శించాలని, ఈ విషయంలో మానవతా దృక్పథం లోపించినట్టైంది అన్నారు. అల్లుఅర్జునే కాదు, టీమ్ అయినా సంతాపం తెలపాల్సిదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పేరు చెప్పలేదని, అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారనడం సరికాదంటూ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు.
రేవంత్ రెడ్డి ఆ స్థాయి దాటిన బలమైన నేత అంటూ పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బన్నీ స్థానంలో రేవంత్ ఉన్నా అలాగే అరెస్ట్ చేస్తారంటూ పేర్కొన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదని.. ఈ విషయాన్ని గుర్తు చేసుకోవాలంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. దీనిపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. పవన్ కు రేవంత్ లో ఏం కనిపించిందో తెలియడం లేదన్నారు. పవన్ కు రేవంత్ ఏ యాంగిల్ లో గొప్పగా కనిపించాడో అంటూ వ్యంగాస్త్రాలు సంధించారు. తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయనందుకు నచ్చారా అని పవన్ ను బండి సంజయ్ ప్రశ్నించారు. గతంలో అల్లు అర్డున్ పై రేవంత్ రెడ్డి సర్కార్ చర్యల్ని బీజేపీ తప్పుబట్టింది. ఇప్పుడు అదే రేవంత్ ను పవన్ వెనకేసుకు రావడం బండి సంజయ్ కు మింగుడు పడలేదు.