వర్షాకాలం వచ్చిందంటే చాలు.. ఫ్లూతో పాటు వైరల్ ఫీవర్స్ వస్తుంటాయి. ఇవి చాలదన్నట్లు దోమల వల్ల మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి వ్యాధులు ఆసుపత్రులు పాలయ్యేలా చేస్తాయి. మలేరియా, డెంగ్యూ కన్నా ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చికెన్ గున్యాతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య బాగా పెరిగిపోయింది. విపరీతమైన చలి, జ్వరంతో పాటు మెలిపెట్టేసే కాళ్ల నొప్పులతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ఇంటికో పేషంట్ చేరుతున్నారు. సామాన్యులే కాదు మెగాస్టార్ చిరంజీవిలాంటి స్టార్ సెలబ్రిటీ కూడా చికెన్ గున్యా బారిన పడ్డారు. రోజు రోజుకీ ఈ కేసులు పెరిగిపోవడంతో జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి స్పెషల్ డ్రైవ్ నిర్వహించేందుకు చర్యలు తీసుకున్నారు.
అక్టోబర్ 2 నుండి యాంటీ లార్వా ఆపరేషన్ కార్యక్రమాలను నిర్వహించాలని ఆమ్రపాలి.. అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. దీన్ని బట్టి చికెన్ గున్యా విజృంభణ ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు. చికెన్ గున్యా కేసు నమోదైన ఇల్లు చుట్టుపక్కల 50 నుండి వంద ఇళ్ల వరకు సర్వే చేయాలని, దోమలు పెరిగే ప్రాంతాలను గుర్తించాలని సూచించారు. నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో యాంటీ లార్వా ఆపరేషన్, ఫాగింగ్ చేయాలని తెలిపారు. నీరు నిల్వ ఉన్న ఖాళీ ప్రాంతాలు, భవన నిర్మాణాలు, ఫంక్షన్ హాల్స్, తాళం వేసిన ఇళ్లను సందర్శించాలని ఆదేశించింది. రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో చికెన్ గున్యా నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించాలని కమీషనర్ తెలిపారు. ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో నమోదైన కేసులను బట్టి రోగి వివరాలు, నమోదు చేయాలని, క్షేత్ర పరిధిలో చికెన్ గున్యాను అరికట్టేందుకు ఎంటమాలజీ కార్యక్రమాలు విస్తృతంగా చేపట్టాలని ఆమ్రపాలి ఆదేశించారు. నగరంలో చికెన్ గున్యా నివారణకు బాధ్యతగా వర్క్ చేయాలని తెలిపారు.
మరీ చికెన్ గున్యా ఎలా వస్తుంది.. లక్షణాలను గుర్తించడం ఎలాగో తెలుసా..? చికెన్ గున్యా ఏడిస్ అనే దోమ కాటు వల్ల వస్తుంది. ఏడిస్ దోమ కుట్టిందంటే చాలు.. హఠాత్తుగా ఫీవర్ వచ్చేస్తుంది. కాళ్లు, కీళ్లు పట్టేసిన ఫీలింగ్ ఉంటుంది. కండరాల నొప్పులు మొదలవుతాయి. తట్టుకోలేనంత చలి, జ్వరం , వికారం, వాంతులు, ఒంటి మీద దద్దర్లు వంటి లక్షణాలు ఉంటాయి. విపరీతమైన తలనొప్పి, ఒళ్లు నొప్పులు వస్తుంటాయి. ఏ పని చేయలేని పరిస్థితి. మంచం మీద నుండి లేవాలన్న కష్టమే. కూర్చోలోని, నిలబడలేని దుస్థితి. చికెన్ గున్యా వచ్చిందంటే.. ఒక పట్టాన ఇట్టే వదలదు. సుమారు నెల రోజులు దీనితో ఇబ్బంది పడాల్సిందే. ఈ లక్షణాలు కనిపిస్తే.. వైద్యులను సంప్రదించడం మేలు.
రక్తపరీక్షల ద్వారా చికెన్ గున్యా నిర్దారిస్తారు వైద్యులు. చికెన్ గున్యాను నివారించడానికి కొన్ని మార్గాలున్నాయి. మీరు నివసించే ప్రాంతాల్లో నీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. దోమలను తరిమికొట్టే లోషన్లను ఉపయోగించండి. వ్యర్థాలు లేకుండా చూసుకోవాలి. శరీరం కప్పి ఉంచేలా దుస్తులు ధరించాలి. లెమన్ గ్రాస్, యూకలిప్టస్ ఆయిల్ కలిపిన క్రిమి సంహారకాలను ఉపయోగించాలి. అలాగే ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా నీరు, పండ్ల రసాలు తీసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే చికెన్ గున్యాను నివారించొచ్చు.