సైనికాధికారులు, సిబ్బందిలో తగ్గుతున్న శారీరక సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకుని భారత సైన్యం కొత్త ఫిట్‌నెస్ విధానాన్ని రూపొందించింది. దీని ప్రకారం సైన్యంలో పనిచేస్తున్న ప్రతీఒక్కరికీ ఆర్మీ ఫిజికల్ ఫిట్‌నెస్ అసెస్‌మెంట్ కార్డ్ (ఏపీఏసీ) ప్రవేశపెట్టనున్నారు.
ఆర్మీలో తాజాగా రూపొందించిన శారీరక ప్రమాణాలకు అనుగుణంగా లేని సైనికులకు మెరుగుదల కోసం 30 రోజుల గడువు ఇవ్వనున్నారు. అప్పటికీ విఫలమైతే, ఆ సైనికుని సెలవులను తగ్గించనున్నారు. నూతన మార్పుల ప్రకారం త్రైమాసికానికి ఒకసారి జరిగే ట్రయల్స్‌లో కమాండింగ్ ఆఫీసర్‌కు బదులుగా బ్రిగేడియర్ ర్యాంక్ అధికారి ప్రిసైడింగ్ ఆఫీసర్‌గా వ్యవహరించనున్నారు. ఈ కొత్త విధానంలో 30 రోజులలోపు మెరుగుదల కనిపించకపోతే అధిక బరువు కలిగిన ఆర్మీ సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోనున్నారు. ఇప్పటికే ఉన్న పరీక్షలతో పాటు అదనంగా మరికొన్ని పరీక్షలను కూడా నిర్వహించనున్నారు.
ఈ కొత్త విధానం ఉద్దేశ్యం సైన్య సిబ్బంది పరీక్షల ప్రక్రియలో ఏకరూపతను తీసుకురావడం, శారీరకంగా అన్‌ఫిట్ లేదా స్థూలకాయంగా మారే ముప్పును తగ్గించడం, జీవనశైలి వ్యాధులు నివారణ. ప్రస్తుతం సైన్యం ప్రతి మూడు నెలలకు ఒకసారి బ్యాటిల్ ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (బీపీఈటీ), ఫిజికల్ ప్రొఫిషియన్సీ టెస్ట్ (పీపీటీ) నిర్వహిస్తోంది. బీపీఈటీ పరీక్షలో సిబ్బంది నిర్ణీత సమయంలో 5 కిలోమీటర్లు పరుగెత్తాలి. తాడు పైకి ఎక్కి తొమ్మిది అడుగుల గొయ్యిని దాటాలి. ఇక్కడ వయస్సు ఆధారంగా సమయం నిర్ణయిస్తారు. పీపీటీలో 2.4 కిలోమీటర్ల రన్, 5 మీటర్ల షటిల్, పుష్ అప్స్, చిన్ అప్స్, సిట్ అప్స్, 100 మీటర్ల స్ప్రింట్ ఉంటాయి. ఇది కాకుండా కొన్ని చోట్ల స్విమ్మింగ్ టెస్ట్ కూడా నిర్వహిస్తారు. ఈ పరీక్షల ఫలితాలు వార్షిక రహస్య నివేదిక (ఏసీఆర్)లో పొందుపరుస్తారు.
కొత్త నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒక బ్రిగేడియర్ ర్యాంక్ అధికారితో పాటు ఇద్దరు కల్నల్‌లు, ఒక మెడికల్ ఆఫీసర్ అసెస్‌మెంట్ నిర్వహిస్తారు. బీపీఈటీ, పీపీటీలు కాకుండా సైనికులకు కొన్ని ఇతర పరీక్షలు కూడా నిర్వహిస్తారు. వీటిలో ప్రతి ఆరు నెలలకు 10 కిలోమీటర్ల స్పీడ్ మార్చ్ , 32 కిలోమీటర్ల రూట్ మార్చ్ ఉంటాయి. అదనంగా 50 మీటర్ల స్విమ్మింగ్ టెస్ట్ కూడా నిర్వహించనున్నారు.