Indian railways: వెయిటింగ్ లిస్టులకు స్వస్తి.. ఎప్పుటినుంచంటే..!

రైల్వే ప్రయాణమంటే ఎలా ఉంటుందో చాలా మందికి అనుభవమే. కిక్కిరిసిన ప్రయాణికులు.. డోర్‌ల దగ్గర వ్రేలాడడం వంటి సీన్లు కనిపిస్తుంటాయి. జనరల్ బోగీల్లో కనీసం నిలబడేందుకు కూడా చోటు లేక ఇబ్బందులు పడుతుంటారు.


ప్రస్తుతం రైల్వే వ్యవస్థలో జనరల్‌కు.. రిజర్వేషన్‌కు పెద్ద తేడా ఏమి ఉండడం లేదు. జనరల్ ప్యాసింజర్స్ కూడా రిజర్వేషన్ బోగీల్లోకి ఎక్కేసి ప్రయాణం చేస్తున్నారు. దీంతో రిజర్వేషన్ ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. పూర్వ కాలం నుంచి ఉన్న ట్రైన్‌లే ఇప్పుడు నడుస్తున్నాయి. కొత్తగా రైళ్లు పెంచకపోవడం.. జనరల్ బోగీలు తగ్గించడం.. ఆ మధ్య కోవిడ్ సందర్భంగా కొన్ని రైళ్లు ఆపేయడంతో ప్రయాణికుల కష్టాలు మరింత తీవ్రం అయ్యాయి. ఇక ఎమర్జెన్సీ ప్రయాణికుల ఇబ్బందులు ఎవరికీ చెప్పుకోనక్కర్లేదు. అప్పటికప్పుడు రిజర్వేషన్ చేయించుకుందామంటే చాంతాడంతా వెయింటింగ్ లిస్ట్.. తప్పని పరిస్థితుల్లో ప్రయాణం చేయాలంటే లేనిపోని కష్టాలు తెచ్చుకోవడం జరుగుతుంటుంది. నాలుగు నెలల ముందుగానో.. లేదంటే మూడు నెలల ముందుగానో రిజర్వేషన్ చేసుకుంటేనే తప్ప సీట్లు దొరకని పరిస్థితులు నేటి రైల్వే వ్యవస్థలో దర్శనమిస్తున్నాయి. అయితే ఇలాంటి కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు కేంద్ర రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది.

ఈ ఏడాది వేసవి కాలంలో అదనంగా నాలుగు కోట్ల మంది ప్రయాణికులు ప్రయాణం చేసినట్లుగా రైల్వే శాఖ గుర్తించింది. రిజర్వేషన్ చేయించుకుందామంటే సీట్లు దొరకని పరిస్థితులు. తప్పనిసరి పరిస్థితుల్లో ప్రజలు ప్రయాణాలు సాగించారు. ఈ నేపథ్యంలో వెయిటింగ్ లిస్టుకు స్వస్తి పలకాలని రైల్వే శాఖ భావిస్తోంది. ఇందులో భాగంగా 2031-32 నాటికి ఆ సమస్యను పరిష్కరించాలని రైల్వే శాఖ లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రకటించింది. ప్రయాణికులందరూ 2032 నాటికి వెయిటింగ్ లేకుండా సీట్లు పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు రైల్వేశాఖ పేర్కొంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన అత్యున్నత స్థాయి సమావేశంలో భద్రతా మరియు మౌలిక సదుపాయాలపై రాజీ పడొద్దని రైల్వేమంత్రి అధికారులకు సూచించారు.

అలాగే వేసవిలో ఏసీలు, ఫ్యాన్లులు, వాటర్ కూలర్లు అందుబాటులో ఉండేలా ప్లాన్ చేయాలని ఆదేశించారు. అలాగే రైళ్ల సమయపాలన, ప్రయాణికుల సౌకర్యాల దృష్టి పెట్టాలని రైల్వేమంత్రి సూచించారు.