Nara Lokesh: ఏడాదిలోగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు

ఏడాదిలోగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను మానవ వనరుల అభివృద్ధి (విద్య), ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆదేశించారు.


అమరావతి: ఏడాదిలోగా ప్రభుత్వ పాఠశాలల్లో పూర్తిస్థాయి మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను మానవ వనరుల అభివృద్ధి (విద్య), ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ ఆదేశించారు. కొత్తగా చేపట్టాల్సిన పనులతో పాటు వైకాపా హయాంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన నాడు-నేడు ఫేజ్‌-2, ఫేజ్‌-3 పనులన్నీ ఏడాదిలోగా పూర్తి చేయాలన్నారు. శనివారం ఉండవల్లిలోని నివాసంలో విద్యాశాఖ ఉన్నతాధికారులతో లోకేశ్‌ సమావేశమయ్యారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతపై ఆరా తీశారు. భోజనం రుచికరంగా, నాణ్యంగా ఉండేందుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారిని కోరారు.

ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులకు జులై 15 నాటికి పాఠ్యపుస్తకాలు, నోట్‌ పుస్తకాలు, బ్యాగ్‌ ఇవ్వాలని సూచించారు. ‘పాఠశాలల్లో పారిశుద్ధ్యం నిర్వహణకు సంబంధించి దిల్లీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు, ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితుల్ని అధ్యయనం చేయాలి. గత అయిదేళ్లలో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు పాఠశాలలకు మారిన విద్యార్థుల సంఖ్య, అందుకు గల కారణాలను విశ్లేషించి సమగ్ర నివేదిక ఇవ్వాలి.

బడి మధ్యలో మానేసిన వారి వివరాలనూ సేకరించాలి. ఎన్ని పాఠశాలలు మూతపడ్డాయి, అందుకు కారణాలు ఏమిటనేది ఇవ్వాలి. దేశంలో అత్యుత్తమ గ్రంథాలయ నమూనా ఎక్కడ ఉందో తెలుసుకుని అధ్యయనం చేయాలి. బైజూస్‌ కంటెంట్, ఐఎఫ్‌పీ వినియోగం, సీబీఎస్‌ఈ పాఠశాలలపై సమగ్ర నివేదిక అందజేయాలి. పాఠశాల విద్యార్థులకు కిట్ల పంపిణీ ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలి. గతంలో తెదేపా ప్రభుత్వంలో కొనుగోలు చేసి, మూలన పడేసిన సైకిళ్ల వివరాలివ్వాలి.

ఇకపై ఉపాధ్యాయుల బదిలీలు గతంలో తెదేపా ప్రభుత్వం అమలు చేసిన విధంగా పారదర్శకంగా జరుగుతాయి. కేంద్ర నిధులను పూర్తి స్థాయిలో వినియోగించుకునేలా ప్రణాళిక రూపొందించాలి’ అని అధికారులకు లోకేశ్‌ సూచించారు. ఈ ఏడాది సీబీఎస్‌ఈ పదో తరగతి పరీక్షలు రాయబోయే 82 వేల మంది విద్యార్థులకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారో అధికారులను అడిగి తెలుసుకున్నారు.