ట్రైనీ డాక్టర్ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో సంచలన విషయాలు.. శరీరంపై 14 చోట్ల గాయాలు

www.mannamweb.com


దేశ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న కోల్‌కతా ట్రైనీ డాక్టర్ హత్యాచార ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

అభయ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. గొంతు నులమడం వల్లే ఊపిరాడక అభయ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఒంటిపై 14 చోట్ల తీవ్రమైన గాయాలు ఉన్నట్లు పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో తెలిపారు. బాధితురాలి తల, ముఖం, మెడ, చేతులు, మర్మాంగాలపై ఈ గాయాలు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. కొనఊపిరితో ఉన్నప్పుడు అభయపై అత్యాచారం జరిగినట్లు డాక్టర్లు నిర్థారించారు. శరీరంపై పలుచోట్ల పంటి గాట్లు, గోళ్ల గీతలు ఉన్నట్లు ఆ రిపోర్ట్‌లో తెలిపారు. ఆహారంలో మత్తుమందు కలిపారా లేదా అనే దానిపై ఫోరెన్సిక్‌ నివేదిక తర్వాత స్పష్టత వస్తుందన్న వైద్యులు తెలిపారు. అభయకు ఎముకలు విరిగినట్లు నిర్థారణ కాలేదని వెల్లడించారు. అలాగే మృతురాలి శరీరంలో పలుచోట్ల రక్తం గడ్డకట్టడంతో పాటు ఊపిరితిత్తుల్లో రక్తస్రావం కనిపించినట్లు పోస్ట్‌మార్టం నివేదిక పేర్కొంది. బాధితురాలిని అత్యంత క్రూరంగా మానవ మృగం అత్యాచారం చేసి హత్య చేసినట్లు పోస్ట్‌మార్టం నివేదిక నిర్థారిస్తోంది.

కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ట్రైనీ డాక్టర్.. ఆగస్టు 9న హత్యాచారానికి గురికావడం తెలిసిందే. ఆ రోజున మెడికల్ కాలేజీలోని చెస్ట్ డిపార్ట్‌మెంట్ సెమినార్ హాల్లో ట్రైనీ డాక్టర్ శవమై కనిపించింది. మరో నిర్భయ ఘటన తరహాలో ఈ ఘటన యావత్ దేశాన్ని కుదిపేస్తోంది. దేశ వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కలకత్తా హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ దర్యాప్తు జరుపుతోంది. అత్యంత సున్నితమైన ఈ కేసుపై సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపల్‌ను నాలుగోసారి ప్రశ్నించింది. నలుగురు మెడికల్ కాలేజీ స్టూడెంట్స్‌ను కూడా విచారించింది. ఇక సీబీఐ మహిళా ఆఫీసర్ నిందితుడి ఇంటికి వెళ్లి విచారించారు. నిందితుడికి సైకాలజీ టెస్ట్ చేయాలని భావిస్తోంది సీబీఐ. హత్యాచార ఘటన జరిగిన స్పాట్‌కు వెళ్లి అత్యాధునిక పరికరాలతో స్కానింగ్ నిర్వహిస్తున్నారు అధికారులు.

అటు కోల్‌కతా ఘటనను సుమోటో కేసుగా సుప్రీంకోర్టు స్వీకరించింది. దీనిపై చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం ఆగస్టు 20న విచారణ జరపనుంది. మంగళవారంనాటి విచారణలో సుప్రీంకోర్టు ఎలాంటి రూలింగ్ ఇవ్వనుందన్న అంశంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంటోంది.