AP HighCourt : పథకాలకు నిధులు నిలిపివేతపై ఏపీ హైకోర్టులో విచారణ – ఈసీ వాదన ఏమిటంటే ?

Elections 2024 : పథకాల నగదును లబ్దిదారుల ఖాతాల్లో జమ చేయకుండా ఈసీ ఆదేశాలివ్వడంపై కొంత మంది లబ్దిదారులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఇన్ పుట్ సబ్సిడీ నిధుల పంపిణీ నిలిపివేతపై ఏపీ హైకోర్టులో నేడు అత్యవసర పిటిషన్ దాఖలైంది. దీనిపై నేడు హైకోర్టు విచారణ చేపట్టింది. నిధుల విడుదల నిలిపివేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించాలంటూ పిటిషనర్ కోరారు. ప్రభుత్వం వినతి ఇస్తే పునఃపరిశీలన చేస్తామని ఈసీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలియజేశారు. అందుకు ఏజీ స్పందిస్తూ… ప్రభుత్వం తరఫున వినతి ఇస్తామని స్పష్టం చేశారు. అనంతరం తదుపరి విచారణను హైకోర్టు ధర్మాసనం మే 9కి వాయిదా వేసింది.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

తుపాను, కరవు వంటి విపత్తుల కారణంగా పంటలు నష్ట పోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ, విద్యా దీవెన పథకం నిధుల విడుదలకు అనుమతించాలని ఏపీ సీఎస్ చేసిన విజ్ఞాపనలను ఈసీ తోసిపుచ్చింది. ఇవి కొత్త పథకాలు కావని, ఇప్పటికే అమల్లో ఉన్నాయని ఏపీ ప్రభుత్వం పేర్కొన్నప్పటికీ, ఎన్నికల ప్రక్రియ ముగిశాకే నిధులు విడుదల చేసుకోవాలని ఎన్నికల సంఘం తేల్చి చెప్పింది. ఈ వివాదం ఏపీ చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేదని వెల్లడించారు. పోలింగ్ ముగిసిన తరువాత ఇవ్వాలని ఆదేశించిందని పేర్కొన్నారు.

డీబీటీ విధానం ద్వారా పలు పథకాల లబ్దిదారులకు చెల్లింపులు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఈసీకి లేఖ రాసింది. ఈ పథకాలన్నీ గత ఐదేళ్ల నుంచి అమల్లో ఉన్నవేనని.. కొత్త పథకాలు కావని పేర్కొంది. అమల్లో ఉన్న సంక్షేమ పథకాలు కాబట్టి నిధుల విడుదలకు అంగీకరించాలని కోరింది. అయితే, ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అభ్యర్థనను ఈసీ తోసిపుచ్చింది. అయితే ఈ పథకాలకు నిధులు ఎప్పుడో ఇవ్వాల్సి ఉంది. మార్చిలోనే సీఎం జగన్ బహిరంగసభ పెట్టి బటన్లు నొక్కిన చేయూత పథకం నిధులు. ఫీజు రీఎంబర్స్ మెంట్ తో పాటు రైతులకు ఇవ్వాల్సిన ఇన్ పుట్ సబ్సిడీ కూడా జమ కావాల్సి ఉంది. కానీ ఇంత కాలం పంపిణీ చేయలేదు. ఇప్పుడు ఎన్నికలకు ముందు లబ్దిదారుల ఖాతాల్లో జమ చేస్తామని అడుగుతోంది.

ఇంకా వారం రోజుల ముందు పోలింగ్ ఉన్నందున ఇప్పుడు అత్యవసరంగా నగదు జమ చేయాల్సిన అవసరం లేదని.. అలా చేస్తే ఓటర్లను ప్రభావితం చేసినట్లు అవుతుందని విపక్షాలు అంటున్నాయి. ఇన్ని రోజులు ఆగిన ప్రభుత్వం పోలింగ్ ముగిసిన తర్వాత నిధులు అకౌంట్లలో జమ చేయవచ్చు కదా అని ప్రశ్నిస్తున్నాయి. గురువారం హైకోర్టులో జరిగే విచారణను బట్టి .. తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *