నిద్రలేమి చిన్న సమస్య కాదు.. ఇలాంటి ప్రాణాంతక వ్యాధులు తప్పవు

www.mannamweb.com


నిద్రలేమి.. అసలు కొన్నేళ్ల క్రితం ఇలాంటి ఓ సమస్య వస్తుందని కూడా చాలా మంది ఊహించకపోయి ఉండొచ్చు. కానీ ప్రస్తుతం నిద్రలేమి పెద్ద అనారోగ్య సమస్యగా మారింది.

మారిన జీవన విధానం, గ్యాడ్జెట్స్‌ వినియోగం పెరగడం కారణం ఏదైనా చాలా మంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయితే వినడానికి నిద్రలేమి అనేది చిన్న సమస్యే అయినా దీనివల్ల కలిగే దుష్ప్రభావాలు మాత్రం తీవ్రంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి కారణంగా ఎన్నో రకాల అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇంతకీ నిద్రలేమి కారణంగా తలెత్తే ఆ ప్రాణంతక వ్యాధులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* నిద్రలేమి కారణంగా గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. సరైన నిద్రలేకపోతే రక్తపోటు పెరుగుతుంది. ఇది గుండెపోటుతో పాటు స్ట్రోక్‌ ప్రమాదాన్ని పెంచుతుందని హెచ్చరిస్తున్నారు.

* సరైన నిద్రలేకపోవడం కారణంగా తలెత్తే మరో ప్రధాన సమస్య మధుమేహం. నిద్రలేమి శరీరంలోని రక్తంలో చక్కెర స్థాయిని ప్రభావితం చేస్తుంది. ఇది ఇన్సులిన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుంది, ఇది డయాబెటిస్ ప్రమాదాన్ని పెంచుతుంది. 6 గంటల కంటే తక్కువ నిద్రపోయే వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

* నిద్రలేమి కారణంగా మానిసక ఆరోగ్యంపై కూడా ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మెదడు పనితీరుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఈ కారణంగా జ్ఞాపకశక్తి తగ్గుతుందని అంటున్నారు.

* నిద్రలేమి రోగనిరోధక శక్తిపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. నిద్రలేమి కారణంగా త్వరగా తీవ్రమైన ఇన్ఫెక్షన్లకు దారి తీసే అవకాశం ఉంటుందని అంటున్నారు.

* నిద్రలేమికి ఆకలికి మధ్య సంబంధం ఉన్నట్లు పలు అధ్యయనాల్లో వెల్లడైంది. నిద్రలేమి కారణంగా ఆకలిని పెంచే హార్మోన్లు ఎక్కువగా విడుదలవుతాయని దీనికి కారణంగా మనకు తెలియకుండానే ఎక్కువగా తింటాం. ఇది ఊబకాయానికి కారణమవుతుంది.

* రాత్రుళ్లు సరిగా నిద్రపోకపోతే డిప్రెషన్‌, ఆందోళన వంటి మానసిక సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. సరైన నిద్రలేకపోతే మానసిక సమతుల్యత దెబ్బ తింటుందని అంటున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.