చనిపోదాం అనుకున్నవాడు… సీఎం అయ్యాడు!
ఆరేళ్లకు అనాథలా మారాడు. పదేళ్లకు కార్పెంటర్ అవతారమెత్తాడు. పదకొండేళ్లకు తొలిసారి బడిలో అడుగుపెట్టాడు. ఆపైన నైట్ వాచ్‌మన్‌గా పనిచేశాడు. చివరికి బతకలేక ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించాడు. కట్ చేస్తే… అదే కుర్రాడు పీజీ పూర్తి చేశాడు. ఎమ్మెల్యే అయ్యాడు. 22ఏళ్ల పాటు మంత్రిగా బాధ్యతలు నిర్వహించాడు. ఇటీవలే అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు.
కలిఖో పుల్… పాతాళం నుంచి పర్వతం అంచుల దాకా సాగిన ఆయన ప్రయాణం, జీవితానికే కొత్త పాఠాలు నేర్పిస్తుంది.
కలిఖో పుల్… ఆ పేరుకు అర్థం ‘మంచి భవిష్యత్తు’ అని. ఏరికోరి తల్లి అతనికి ఆ పేరు పెట్టుకున్నా, వూహ తెలిసినప్పట్నుంచీ అతనికి చీకట్లు తప్ప, రేపటిపైన ఆశ ఎప్పుడూ కనిపించలేదు. పుల్ పదమూడు నెలల చిన్నారిగా ఉన్నప్పుడు తల్లి అనారోగ్యంతో కన్నుమూసింది. మరో ఐదేళ్లకు అల్లారు ముద్దుగా చూసుకుంటూ వచ్చిన తండ్రి కూడా అనారోగ్యంతో చనిపోయాడు. అలా ఆరేళ్ల వయసులో తల్లిదండ్రుల్ని పోగొట్టుకొని అనాథలా మిగిలాడు పుల్. చుట్టుపక్కల వాళ్లెవరూ పట్టించుకోలేదు. చుట్టాలెవరూ దగ్గరకు తీయలేదు. ఎటెళ్లాలో తెలీక దిక్కుతోచని స్థితిలో ఉన్న పుల్‌ని పక్క వూళ్లొ ఉండే అతడి అత్తయ్య తీసుకెళ్లింది. అదీ అతడి మీద ప్రేమతోనో, చదివించి పెద్ద చేయాలనో కాదు… ఇంట్లో పనులకు పనికొస్తాడని.
• పదేళ్లకు వడ్రంగిగా…
ఆరేళ్ల వరకూ పుల్ బడి మొహాన్ని చూడలేదు. ప్రతిరోజూ అడవికెళ్లడం, కట్టెలు కొట్టుకొని రావడమే అత్తయ్యవాళ్లింట్లో అతని పని. పుల్ కట్టెలు తీసుకొస్తేనే అతడికి ఆ రోజు అన్నం దొరికేది. ఆటల్లో పడో, ఆరోగ్యం బాలేకో అడవికి వెళ్లలేకపోతే ఆ పూటకి పస్తులే. దాంతో చదువుకీ, అందమైన బాల్యానికీ దూరంగా అడవి చెట్ల మధ్యే పెరిగాడు. పదేళ్ల వయసొచ్చేసరికి పక్క వూళ్లొని ‘హవాయి క్రాఫ్ట్ సెంటర్’లో వడ్రంగి పని నేర్చుకోవడానికి వెళ్లాడు. అక్కడ రోజుకి రూపాయిన్నర స్టైపెండ్ అందేది. అత్తయ్య కుటుంబం మీద ఆధారపడకుండా ఆ డబ్బులతోనే ఎలాగోలా బండి నడిపించేవాడు. పనిలో నైపుణ్యం సాధించే కొద్దీ స్టైపెండ్ కూడా పెరుగుతూ వచ్చింది. దాంతో అక్కడే ఉంటూ కుర్చీలూ మంచాలతో మొదలుపెట్టి రెండేళ్ల పాటు చెక్కతో రకరకాల కళాకృతులు తయారు చేసేవరకు నైపుణ్యం పెంచుకున్నాడు. అతడి ప్రతిభ ఆ శిక్షణా కేంద్రం నిర్వాహకులనూ ఆకర్షించింది. అక్కడుండే ట్యూటర్ సెలవు మీద వెళ్లడంతో శిక్షణ పూర్తయ్యాక పుల్‌కే మూడు నెలల పాటు జీతమిచ్చి శిక్షకుడిగా పనిచేసే అవకాశం కల్పించారు.
• నేరుగా ఆరులోకి…
పుల్ పనిచేస్తోన్న హవాయి క్రాఫ్ట్ సెంటర్‌కు ఎక్కువగా ఆర్మీ, పారా మిలటరీ, ప్రభుత్వ అధికారులు వస్తుండేవారు. వాళ్లందరూ హిందీ, ఇంగ్లిష్‌లోనే మాట్లాడేవాళ్లు. పుల్‌కి అస్సమీస్ తప్ప మరో భాష రాదు. వినియోగదారులు చెప్పేది తనకు అర్థమవ్వాలంటే హిందీ కానీ, ఇంగ్లిష్ కానీ నేర్చుకోవాల్సిందే అనుకున్నాడు. దాంతో తప్పని పరిస్థితుల్లో పదకొండేళ్ల వయసులో ఓ నైట్ స్కూల్‌లో ఒకటో తరగతిలో చేరాడు పుల్. ఇతర సబ్జెక్టులతో తనకు అవసరం లేదనీ, హిందీ ఇంగ్లిష్ మాత్రమే బాగా నేర్పించమనీ టీచర్లని అడిగేవాడు. ఓరోజు పుల్ చదువుతోన్న స్కూల్‌కి ఆ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి, డిప్యూటి కమిషనర్ తనిఖీకి వచ్చారు. అందరికంటే పెద్దవాడు, చురుగ్గా ఉంటాడు కాబట్టి వాళ్లని ఆహ్వానించే బాధ్యతని స్కూల్ పుల్‌కే అప్పగించింది. స్కూల్లో చదువు ఎలా చెబుతున్నారంటూ మంత్రి అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన పుల్, చివర్లో ఓ ప్రార్థన గీతాన్నీ పాడాడు. చెక్క పని నేర్చుకునే పిల్లాడు అంత బాగా మాట్లాడటం, పాడటం డిప్యూటీ కమిషనర్ దృష్టిని ఆకర్షించింది. వెంటనే అతడి గురించి ఆరా తీశాడు. విషయం తెలుసుకొని ఆయనే చొరవ తీసుకుని పుల్‌ని డే స్కూల్‌కి మార్పించి, నేరుగా ఆరో తరగతిలో అడ్మిషన్ ఇప్పించాడు. అదే పుల్ జీవితానికి కీలక మలుపు. పొద్దున చదువుకుంటూనే రాత్రుళ్లు హస్తకళల కేంద్రంలో శిక్షకుడిగా పనిచేసేవాడు.
• ఆత్మహత్యవైపు అడుగులు
తరగతులు మారే కొద్దీ పుల్‌కి ఖర్చులూ ఎక్కువయ్యాయి. అతడు పనిచేసే చోట వచ్చే డబ్బులు బతకడానికీ చదువుకీ సరిపోయేవి కావు. దాంతో తెలిసిన వాళ్ల ద్వారా అతికష్టమ్మీద ఓ ప్రభుత్వ కార్యాలయంలో నైట్ వాచ్‌మన్‌గా ఉద్యోగం సంపాదించాడు. సాయంత్రం ఐదు గంటలకు ఆ కార్యాలయంలో జాతీయ జెండాను అవనతం చేయడం, ఉదయం ఐదింటికి జెండా ఎగరేయడం, ఆ మధ్యలో కార్యాలయానికి కాపలా కాయడం అతడి పని. నెలకు రూ.212 జీతం వచ్చేది. రాత్రి ఉద్యోగం, పొద్దున స్కూలుతో రోజుకి నాలుగైదు గంటలకు మించి నిద్ర ఉండేది కాదు. ఆ జీతం కూడా సరిపోకపోవడంతో ఖాళీ సమయంలో సిగరెట్లూ, పాన్‌లూ అమ్ముతూ ఎంతో కొంత సంపాదించుకునేవాడు. కానీ దురదృష్టం పుల్‌ని మరోసారి దెబ్బకొట్టింది. అనుభవిస్తోన్న పేదరికానికి తోడు కడుపులో అల్సర్ల సమస్య అతడిని మరింత బాధపెట్టింది. వైద్యం చేయించుకోవడానికి డబ్బుల్లేక ఆరేళ్లపాటు అలానే భరించాడు. కానీ చివరికి ఆపరేషన్ చేయించుకోకుంటే సమస్య పూర్తిగా ముదిరిపోయే పరిస్థితి వచ్చింది. డబ్బుల కోసం బంధువుల్ని ఆశ్రయిస్తే ఒకరు రెండు రూపాయలూ, మరొకరు ఐదు రూపాయలూ చేతిలో పెట్టారు. ఆ క్షణం తనకంటూ ఎవరూ లేరనీ, తాను బతికి సాధించేది ఏమీ లేదనీ పుల్‌కి అనిపించింది. ఆత్మహత్య చేసుకుందామని దగ్గర్లోని ఓ నదిమీదున్న బ్రిడ్జి పైకెక్కాడు. కానీ చుట్టూ మనుషులు ఉండటంతో దూకడానికి అతడికి ధైర్యం సరిపోలేదు. దాదాపు నలభై నిమిషాలు అక్కడే ఎదురు చూశాక, చనిపోవడం తనవల్ల కాదనిపించి వెనుతిరిగాడు.
చదువుకుంటూనే పని
జీవితంలో డబ్బు ఎంత అవసరమో బంధువుల ప్రవర్తనతో పుల్‌కి అర్థమైంది. ఎలాగైనా ఆపరేషన్ చేయించుకోవాలనీ, బతికి సాధించి తానేంటో నిరూపించాలనీ అనుకున్నాడు. నేరుగా తనని స్కూల్లో చేర్పించిన డిప్యూటీ కమిషనర్ నేగి దగ్గరకు వెళ్లి తన పరిస్థితి వివరించాడు. అతడిని చూసి జాలిపడ్డ నేగి చేతిలో రెండువేల ఐదొందలు పెట్టి పంపించాడు. ఆ డబ్బుతో చికిత్స చేయించుకున్న పుల్, తరవాత ముఖ్యమంత్రికి అభ్యర్థన పెట్టుకొని, దాన్నుంచి వచ్చిన మెడికల్ గ్రాంట్‌తో నేగి డబ్బులు తిరిగిచ్చేసి జీవితాన్ని మళ్లీ కొత్తగా మొదలుపెట్టాడు. క్రమంగా పుల్ ఆరోగ్యం మెరుగు పడింది. చేతిలో ఎంతో కొంత నైపుణ్యం ఉంది. చదువును కొనసాగిస్తూనే డబ్బులు సంపాదించడానికి వచ్చే ఏ ఒక్క అవకాశాన్నీ వదిలిపెట్టకూడదని నిర్ణయించుకున్నాడు. పుల్‌కి వెదురుతో ఫెన్సింగ్ నిర్మించడం, గుడిసెలు అల్లడం బాగా వచ్చు. అదే విషయాన్ని తనకు పరిచయమున్న వాళ్లందరికీ చెబుతూ, ఏదైనా అవసరముంటే కబురుపెట్టమనేవాడు. అలా ఓ జూనియర్ ఇంజినీర్ ఇంటిచుట్టూ వెదురుతో ఫెన్సింగ్ నిర్మించే పని దొరికింది. మూడ్రోజుల పాటూ ఒక్కడే అడవికి వెళ్లి వెదురుని నరుక్కొని వచ్చి ఆ నిర్మాణాన్ని పూర్తిచేశాడు. దానికి అతడికి దక్కిన మొత్తం నాలుగొందల రూపాయలు. ఆ తరవాత ఆరొందల రూపాయలకు ఓ గుడిసె నిర్మించే పని దొరికింది. కొన్ని రోజులకు రెండు వేల రూపాయలకు ఓ వెదురు ఇంటిని నిర్మించే పనీ ఒప్పుకున్నాడు. అలా చదువుకుంటూనే ఓ చిన్నస్థాయి కాంట్రాక్టర్‌గా మారాడు. పనికీ, చదువుకీ మధ్య పుల్ నిద్రనీ, వ్యక్తిగత జీవితాన్నీ త్యాగం చేశాడు తప్ప పుస్తకాలని ఏ రోజూ పక్కకి పెట్టలేదు. ఓవైపు ఇంటర్ చదువుతూనే మరోపక్క తాను సంపాదించుకున్న డబ్బులతో నాలుగు సెకండ్ హ్యాండ్ ట్రక్కులనీ కొని వాటిని అద్దెకి తిప్పేవాడు.
• పాతికేళ్లకే ఎమ్మెల్యే
చిన్న కాంట్రాక్టర్‌గా మొదలుపెట్టి డిగ్రీకి వచ్చేనాటికి పక్కా ఇళ్లు నిర్మించే కాంట్రాక్టులూ చేసే స్థాయికి పుల్ ఎదిగాడు. చదువూ, కాంట్రాక్టులకి తోడు కాలేజీ విద్యార్థి సంఘానికి జనరల్ సెక్రటరీ బాధ్యతలతో పుల్ క్షణం తీరికలేకుండా గడిపేవాడు. డిగ్రీ చివరి సంవత్సరానికి వచ్చేనాటికి పుల్ మూడు లక్షల ఖర్చుతో ఓ సొంత ఇంటినీ నిర్మించుకున్నాడు. అల్సర్ నుంచి బయటపడ్డ నాటి నుంచీ అతడి సంపాదనలో సగం సొంతానికీ, మిగతా సగం పేద రోగుల వైద్యానికీ కేటాయిస్తూ వస్తున్నాడు. కాంట్రాక్టర్‌గా మారాక ప్రభుత్వాసుపత్రులకు వెళ్తూ రోగుల అవసరాలు తెలుసుకొని ఆర్థిక సాయం చేసేవాడు. అలా క్రమంగా అతడి ఔదార్యం గురించి ఆనోటా ఈనోటా అందరికీ తెలియడం మొదలుపెట్టింది. విద్యార్థి సంఘం నాయకుడిగానూ మంచి పేరు సంపాదించాడు. డిగ్రీ పూర్తయ్యాక, లా కాలేజీలో చేరాడు. మరోవైపు కాంట్రాక్టర్‌గా ఎదుగుతూ 37 ప్రభుత్వ భవనాలూ, డజనుకు పైగా బ్రిడ్జిలూ, వందల కిలోమీటర్ల రోడ్లూ నిర్మించాడు. అతడు నిర్మించిన భవనాల నాణ్యత నచ్చడంతో ప్రభుత్వం టెండర్లు లేకుండానే అతడికి పనులను అప్పజెప్పేది. చిన్న వయసులోనే స్థానికంగా పుల్ సంపాదించిన పేరు కాంగ్రెస్ పార్టీ దృష్టిని ఆకర్షించింది. అతడు పార్టీలో సభ్యుడుకాకపోయినా తమ తరఫున పోటీ చేయాలంటూ ఎమ్మెల్యే టికెట్ ఇచ్చింది. ప్రభుత్వ కాంట్రాక్టులనే ప్రజా సేవగా భావిస్తూ చేస్తూ వచ్చాడు పుల్. అలాంటిది నేరుగా ప్రభుత్వం తరఫునే పనిచేసే అవకాశం వచ్చేసరికి ఆనందంగా ఒప్పుకున్నాడు.
• మంత్రిగా 22ఏళ్లు
తొలి ఎన్నికల్లో పుల్ అద్భుతమైన మెజారిటీతో విజయం సాధించి, పాతికేళ్లకే మంత్రిగా మారాడు. ఆ తరవాత జరిగిన అన్ని ఎన్నికల్లో ప్రత్యర్థులపైన 90శాతం కంటే ఎక్కువ ఓట్ల మెజారిటీతోనే గెలుస్తూ వచ్చాడు. మంత్రిగా ఉన్నప్పుడే పెళ్లి చేసుకున్నాడు. ‘ఒకప్పుడు ఆపరేషన్ కోసం ప్రభుత్వానికి అర్జీ పెట్టుకుంటే ముఖ్యమంత్రి అపాంగ్ రెండువేల ఐదొందలు గ్రాంట్ ఇచ్చారు. అదే వ్యక్తి ఈ రోజు నా పెళ్లికి అతిథిగా హాజరవడాన్ని నమ్మలేకపోతున్నా’ అంటూ పుల్ తన పెళ్లిలో కన్నీటి పర్యంతమయ్యారు. 23ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 22ఏళ్లు పుల్ మంత్రిగా పనిచేశారంటేనే ప్రజలకూ అధికార పక్షానికీ ఆయనపైన ఎంత నమ్మకమో అర్థమవుతుంది. ఈటానగర్‌లోని పుల్ అధికార నివాసం ఓ ఆస్పత్రినే తలపిస్తుంది. నిత్యం ఆయన సాయం కోరి వచ్చే రోగులు ఉండటానికి ఆయన ఇంట్లోనే కొన్ని గదులు కేటాయించారు. ఇరవై నాలుగ్గంటలూ అక్కడ వైద్యులను అందుబాటులో ఉంచి వచ్చిన వాళ్లను పరీక్షించే ఏర్పాట్లు చేశారు. ఇరవై ఏళ్లుగా రాజకీయంగానూ బలపడుతూ వచ్చిన పుల్, అరుణాచల్ ప్రదేశ్‌లో అనిశ్చితి కారణంగా కొనసాగిన రాష్ట్రపతి పాలనకు ఇటీవలే తెరదించారు. ఇతర ఎమ్మెల్యేల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఆ రాష్ట్రానికి తొమ్మిదో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
‘నాకు దేవుడిపైన నమ్మకం లేదు, ఎందుకంటే నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన ఒక్కసారి కూడా నాకు సాయపడలేదు. కానీ కష్టమే దేవుడని నమ్ముతా. అదే జీవితంలో ఎదురుదెబ్బలు తగిలిన ప్రతిసారీ నన్ను నిలబెట్టింది. ఇప్పుడు నా కారుమీద ఎగిరే జెండాను చూస్తున్నప్పుడల్లా ఒకప్పుడు చౌకీదార్‌గా నేను రోజూ జెండాను ఎగరేసిన రోజులు గుర్తొస్తుంటాయి. ఇప్పటికీ నా తొలిరోజుల్నాటి చెక్క పనిముట్లు నా దగ్గర భద్రంగా ఉన్నాయి. నా ఐదుగురు కొడుకులకూ వాటిని చూపిస్తూ నా గతాన్ని గుర్తు చేస్తా. నన్ను మంత్రిగా కాకుండా ఓ మామూలు కార్పెంటర్‌గా, కాంట్రాక్టర్‌గానే చూడమని వాళ్లకు చెబుతా. ఒకప్పుడు రోజుకు పన్నెండు గంటలు ప్రభుత్వ వాచ్‌మన్‌గా పనిచేసిన నేను ఇప్పుడు ఇరవై నాలుగ్గంటలూ ప్రభుత్వాన్ని నడిపించే స్థాయికి చేరుకున్నా. నేను సాధించినప్పుడు మీరెందుకు సాధించలేరు’ అంటూ యువతను ప్రశ్నిస్తారు పుల్.
నిజమే… ఎందుకు సాధించలేరు?
• ఇంకొంత
భారత్-చైనా సరిహద్దుకు రెండు వైపులా నివసించే కమన్ మిష్మి అని ఓ చిన్న తెగలో కలిఖో పుల్ పుట్టారు. కుటుంబంలో బడికెళ్లి చదువుకున్న మొదటి వ్యక్తి ఆయనే.
* పుస్తకాలు చదవడం, పర్యటనలకు వెళ్లడం, స్నేహితులతో చదరంగం ఆడటాన్ని బాగా ఇష్టపడతారు. ఖాళీ దొరికనప్పుడల్లా తన పిల్లలను అనాథ శరణాలయాలకు తీసుకెళ్లడం, వాళ్లతో కలిసి స్వచ్ఛంద సంస్థలు నిర్వహించే కార్యక్రమాల్లో పాలుపంచుకోవడం అలవాటు.
* విద్య, వైద్యం, ఆర్థిక, న్యాయ, విద్యుత్, సాంఘిక శిశు సంక్షేమం లాంటి అన్ని ప్రధాన శాఖల్లో ఆ రాష్ట్ర క్యాబినెట్ మంత్రిగా పనిచేసిన అనుభవం పుల్ సొంతం.