జీవితంలో ఎదగాలనే కసి నీకుంటే తప్పకుండా గొప్ప స్థాయికి చేరుకుంటావు. దీనికి నిలువెత్తు నిదర్శనమే ‘దిల్‌ఖుష్ సింగ్’ సక్సెస్ జర్నీ.
ఒకసారి ప్యూన్ ఉద్యోగం కోసం వెళ్తే..
సహర్సాలోని ఒక చిన్న గ్రామానికి చెందిన ‘దిల్‌ఖుష్ సింగ్’ ఇంటర్ మీడియట్ మాత్రమే చదివి ఈ రోజు ఎంతోమందికి ఉపాధి కల్పిస్తున్నాడు. ఈ రోజు అతని సంవత్సరాదాయం సుమారు రూ.20 కోట్లు వరకు ఉంటుందని అంచనా. ఈ స్థాయికి రావడానికి దిల్‌ఖుష్ ఎంతో కష్టపడ్డాడు. రిక్షా లాగించేవాడు, బతుకుదెరువు కోసం పాట్నాలో కూరగాయలు కూడా అమ్మేవాడు. ఒకసారి ప్యూన్ ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ ఇవ్వడానికి వెళితే యాపిల్ లోగోను గుర్తించమని అడిగారని ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు.
ఈ ఐడియాతోనే..
దిల్‌ఖుష్ సింగ్ రాడ్‌బెజ్ అనే కంపెనీ ప్రారంభించి బీహార్‌లో క్యాబ్‌లను అందించడం మొదలెట్టాడు. అయితే ఇది ఓలా, ఉబర్ సంస్థలకు పూర్తిగా భిన్నంగా ఉంటుంది. ఓలా, ఉబర్ కంపెనీలు నగర ప్రయాణాలపై మాత్రమే దృష్టి పెడుతుంటే.. ఈ కంపెనీ నగరం నుంచి 50 కిమీ దూరం వెళ్లి కూడా సర్వీస్ చేస్తుంది. రాడ్‌బెజ్ కంపెనీ ట్రావెల్ కంపెనీలతో పాటు వ్యక్తిగత క్యాబ్ డ్రైవర్లతో టై-అప్లను కలిగి ఉంది. అయితే వారి ప్రయాణం ముగించుకుని తిరిగి వచ్చేటప్పటికి ప్రయాణీకులను ఎంపిక చేసుకోమని వారు క్యాబ్ డ్రైవర్లను అడుగుతారు. వారు తిరుగు ప్రయాణాలలో ప్రయాణికులు లేకుండా వస్తారు కాబట్టి, మార్కెట్ ధరల కంటే తక్కువ తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు. దీని ద్వారా ప్రతి వినియోగదారుడు ఒక్కో ట్రిప్పుకు కనీసం రూ.1500 ఆదా చేసే అవకాశం ఉందని చెబుతున్నారు.
కేవలం ఆరు నెలల్లోనే..
ఆ తరువాత ఆర్య గో క్యాబ్స్‌గా తన బిజినెస్ ప్రారంభించాడు. టాటా నానో కారుతో కంపెనీని ప్రారభించి, కేవలం ఆరు నెలల్లో కోట్ల రూపాయల సంపాదించగలిగాడు. ఇప్పటికి అతని సంపాదన రూ. 20 కోట్లకి చేరింది. అతని లక్ష్యం రూ. 100 కోట్లకి చేరుకోవడమే అని గతంలో వెల్లడించారు. తన కంపెనీలో పనిచేసే డ్రైవర్లకు ఎటువంటి నష్టం జరగకుండా చూడటానికి నష్టపరిహారం వంటివి కూడా అందేలా చర్యలు తీసుకుంటున్నారు. ఒక డ్రైవర్ తన ప్లాట్‌ఫామ్ ద్వారా నెలకు రూ.55,000 నుంచి రూ. 60,000 వరకు సంపాదించవచ్చని చెబుతున్నారు. ఐఐటీ గౌహతి నుంచి, ఐఐఎంల నుంచి చాలా మంది తమ ప్లాట్‌ఫామ్‌లో పార్ట్‌టైమ్‌గా పనిచేస్తున్నారని దిల్‌ఖుష్ చెప్పుకొచ్చారు. ఉద్యోగం రాలేదు.. నా వల్ల కాదు.. అనే నిరుత్సాహంతో ఉండే వారికి.. దిల్‌ఖుష్ సింగ్ సక్సెస్ జర్నీ ఒక స్ఫూర్తిదాయకంగా ఉంటుంది.