రాజధానిలో భూములు కేటాయించిన సంస్థలకు ప్రభుత్వ నిర్దేశం
రాజధాని అమరావతిలో స్థలాలు తీసుకున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ, ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేటు సంస్థలు నిర్మాణాలు పూర్తిచేసేందుకు వాటికి రెండేళ్ల గడువు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీయే) 36వ అథారిటీ సమావేశం శుక్రవారం సచివాలయంలో జరిగింది. అమరావతి విధ్వంసమే లక్ష్యంగా ఐదేళ్లలో సాగిన జగన్ ప్రభుత్వ అరాచకంతో జరిగిన నష్టాన్ని సరిదిద్ది, మళ్లీ రాజధాని నిర్మాణాన్ని పూర్తిస్థాయిలో పరుగులు పెట్టించే దిశగా అథారిటీ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాజధానిలో భూ కేటాయింపులు చేసిన 130 సంస్థలతో వెంటనే సంప్రదింపులు జరపాలని పురపాలకశాఖ మంత్రి పి.నారాయణను, సీఆర్డీయే అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. గతంలో చేసిన కేటాయింపులపై పునఃసమీక్ష జరపాలని.. ఆసక్తి ఉన్న, పెట్టుబడులు పెట్టగలిగే సంస్థలకే అవకాశమివ్వాలని స్పష్టంచేశారు. అమరావతిని విద్యాకేంద్రంగా తీర్చిదిద్దేందుకు ఎలాంటి సంస్థలను ఆహ్వానించాలన్న అంశంపై లోతైన చర్చ జరిగింది. బిట్స్ లాంటి ప్రఖ్యాత సంస్థలను ఆహ్వానించాలని ముఖ్యమంత్రి సూచించారు. మొత్తం 12 అంశాలపై చర్చించారు. కేంద్రప్రభుత్వ సంస్థలతో సంప్రదింపులు జరిపి వాటి కార్యాలయాలను వీలైనంత త్వరగా అమరావతిలో ఏర్పాటుచేసేలా చూసే బాధ్యతను ఎంపీలకు అప్పగించనున్నారు. సమావేశంలో తీసుకున్న నిర్ణయాల్ని మంత్రి నారాయణ విలేకర్లకు తెలిపారు.
అంకురప్రాంత అభివృద్ధికి సింగపూర్ సంస్థలతో సంప్రదింపులు
అమరావతిలో అంకురప్రాంత అభివృద్ధికి సింగపూర్‌కి చెందిన అసెండాస్-సింగ్‌బ్రిడ్జ్, సెంబ్‌కార్ప్ సంస్థల కన్సార్షియంతో సంప్రదింపులు జరపాలని అథారిటీ సమావేశంలో నిర్ణయించారు. రాజధానిలోని సీడ్ డెవలప్‌మెంట్ ఏరియాలోని 1,691 ఎకరాల్ని అంకురప్రాంతంగా అభివృద్ధి చేసి, పెట్టుబడుల్ని ఆకర్షించేందుకు ఆ కన్సార్షియంను స్విస్‌ఛాలెంజ్ విధానంలో మాస్టర్ డెవలపర్‌గా అప్పటి ప్రభుత్వం ఎంపికచేసింది. వైకాపా అధికారంలోకి వచ్చాక ఆ కన్సార్షియంను బెదిరించి, ఒప్పందం రద్దుచేసింది.
రాజధానికి భూములిచ్చిన రైతులకు కౌలు మరో ఐదేళ్లు పొడిగింపు
రాజధానికి భూసమీకరణలో భూములిచ్చిన రైతులకు పదేళ్లపాటు వార్షికకౌలు చెల్లింపు ఈ ఏడాదితో ముగుస్తోంది. ఇంకా వారికి స్థలాలు అభివృద్ధి చేసి ఇవ్వలేదు కాబట్టి… మరో ఐదేళ్లపాటు వారికి కౌలు చెల్లించాలని అథారిటీ నిర్ణయించింది. ఏటా 10% చొప్పున కౌలు పెంచడం మాత్రం ఉండదు.
రాజధానిలో భూమిలేని పేదలకు చెల్లిస్తున్న పింఛను కూడా మరో ఐదేళ్లపాటు ఇస్తారు. వేరే పనులు చేసుకుంటున్న వారికి నిలిపివేసిన పింఛన్లను పునరుద్ధరించడంపై కేబినెట్‌లో చర్చించి నిర్ణయిస్తారు.
నాలుగు వరుసలుగా కరకట్ట రోడ్డు
రాజధానిలోని కృష్ణా కరకట్ట రోడ్డును నాలుగు వరుసలుగా నిర్మించాలని అథారిటీ నిర్ణయించింది. ఆ మేరకు గతంలో డిజైన్లు సిద్ధం చేసి, టెండర్లు పిలిచారు. జగన్ అధికారంలోకి వచ్చాక రెండు వరుసల రోడ్డు సరిపోతుందంటూ, జలవనరులశాఖకు ఆ బాధ్యత అప్పగించారు. ఆ పనులు అర్ధంతరంగానే ఆగిపోయాయి. ఆ రోడ్డును గతంలో డిజైన్ చేసినట్లే టెండర్లు పిలిచి, వీలైనంత త్వరగా పనులు చేపట్టాలని సీఎం ఆదేశించారు.
రాజధానిలోని సీడ్ యాక్సెస్ రహదారిని మొదట చెన్నై-కోల్‌కతా జాతీయరహదారితో అనుసంధానం చేయాలని అప్పట్లో అనుకున్నారు. ఇప్పుడు రాజధానిలోని ఇ-5, ఇ-11, ఇ-13, ఇ-15 రోడ్లనూ జాతీయరహదారితో అనుసంధానిస్తారు.
త్వరలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టుకు టెండర్లు
సీఆర్డీయే ఆధ్వర్యంలో తలపెట్టిన గృహనిర్మాణ ప్రాజెక్టు ‘హ్యాపీనెస్ట్’కి త్వరలో మళ్లీ టెండర్లు పిలుస్తారు.
రాజధానిలో మధ్యతరగతి వర్గాలకు ఎంఐజీ, ఎల్‌ఐజీ ఇళ్లు కట్టించాలని సీఎం ఆదేశించారు.
మాస్టర్‌ప్లాన్‌కు విఘాతం కలిగించేందుకు వైకాపా ప్రభుత్వం రాజధానిలో ఏర్పాటుచేసిన ఆర్-5 జోన్‌పై క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయిస్తారు.
సీడ్ యాక్సెస్ రోడ్డును పూర్తిచేసేందుకు అవసరమైన భూమిని భూసమీకరణ విధానంలోనే తీసుకుంటారు. రాజధాని రైతులకు ఇచ్చిన ప్యాకేజినే ఇక్కడా ఇస్తారు.
రాజధాని పనులు ముమ్మరంగా జరుగుతున్నప్పుడు సీఆర్డీయేలో 778 మంది ఉద్యోగులు ఉండేవారు. వైకాపా ప్రభుత్వం వారిని 249కి కుదించింది. ఇప్పుడు మళ్లీ 778 మందిని తీసుకుంటారు. గతంలో 47 మంది కన్సల్టెంట్లు ఉండేవారు. వారిలో 15 మందికి పని పూర్తయినందున, 32 మంది సేవలను పునరుద్ధరిస్తారు.
సీఆర్డీయే, రాజధాని పరిధి పునరుద్ధరణ
సీఆర్డీయే పరిధిని 8,352.69 చదరపు కిలోమీటర్లుగా అప్పట్లో ప్రభుత్వం ఖరారుచేసింది. ఆ మొత్తం ప్రాంతానికి ముసాయిదా ప్రణాళిక సిద్ధమైంది. వైకాపా అధికారంలోకి వచ్చాక సీఆర్డీయే పరిధిని 6,993.24 చ.కి.మీ.కు తగ్గించింది. సీఆర్డీయే నుంచి కొన్ని ప్రాంతాలను తొలగించి కొత్తగా పల్నాడు, బాపట్ల డెవలప్‌మెంట్ అథారిటీలు ఏర్పాటుచేసింది. ఇప్పుడు సీఆర్డీయే పరిధిని మళ్లీ 8,352.69 చ.కి.మీ.కు పునరిద్ధరిస్తారు.
రాజధాని అమరావతి పరిధిని 217 చ.కి.మీ.గా గతంలో ఖరారుచేసి, మాస్టర్‌ప్లాన్ రూపొందించగా… జగన్ ప్రభుత్వం దాన్ని 163 చ.కి.మీ.కు కుదించింది. రాజధాని పరిధిలోని పెనుమాక, ఉండవల్లి, నిడమర్రు, కురగల్లు, బేతపూడి గ్రామాల్ని మంగళగిరి-తాడేపల్లి నగరపాలకసంస్థ పరిధిలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు మళ్లీ ఆ గ్రామాల్ని రాజధానిలోకి తెస్తూ, అమరావతి పరిధిని 217 చ.కి.మీ.కు పునరుద్ధరిస్తూ అథారిటీ నిర్ణయం తీసుకుంది.
కృష్ణానదిపై ఆరు ఐకానిక్ బ్రిడ్జిలు
కృష్ణానదిపై ఓఆర్‌ఆర్, ఐఆర్‌ఆర్, తూర్పు, పశ్చిమ బైపాస్‌లకు వచ్చే ఆరు బ్రిడ్జిలను ఐకానిక్‌గా నిర్మించాలని సీఎం ఆదేశించినట్టు నారాయణ తెలిపారు. ప్రస్తుతం పశ్చిమ బైపాస్‌కు బ్రిడ్జి నిర్మాణంలో ఉందని, అదికాకుండా మరో ఐదు బ్రిడ్జిలు వస్తాయని ఆయన చెప్పారు. ఇన్ని బ్రిడ్జిలు రానున్న నేపథ్యంలో… గతంలో అటు ఇబ్రహీంపట్నం నుంచి ఇటు అమరావతికి తలపెట్టిన ఐకానిక్ బ్రిడ్జి అవసరమా.. లేదా అన్నదానిపై అధ్యయనం చేసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
రాజధానిలో నిర్మించిన భవనాలు, ఐకానిక్ భవనాల పునాదులు ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ ఉండిపోయినందున వాటిని ఎలా ముందుకు తీసుకెళ్లాలన్నదానిపై హైదరాబాద్, మద్రాస్ ఐఐటీల నిపుణులు అధ్యయనం చేస్తున్నారని, వారి నివేదిక ఆధారంగా భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తామని తెలిపారు.
రాజధానిలోని కంపలు నెలరోజుల్లో తొలగింపు
ఈనాడు – అమరావతి: రాజధానిలోని కంప తొలగింపు పనులను నెలరోజుల్లో పూర్తి చేయాలని సీఆర్డీఏ నిర్ణయించింది. ఈ పనులకు సంబంధించిన టెండరు నాగార్జున కన్‌స్ట్రక్షన్స్‌కు (ఎన్‌సీసీఎల్‌కు) దక్కింది. గత ఐదేళ్లలో అమరావతిలో అడ్డదిడ్డంగా పెరిగిన కంప చెట్లను తొలగించేందుకు సీఆర్డీఏ గత నెలలో రూ. 30.8 కోట్లతో టెండర్లు పిలిచింది. దీనికి ఎన్‌సీసీఎల్, మేఘా బిడ్లు దాఖలు చేశాయి. శుక్రవారం జరిగిన ఎగ్జిక్యూటివ్ కమిటీ సమావేశంలో ఎన్‌సీసీఎల్ బిడ్‌కు ఆమోదముద్ర పడింది. యుద్ధప్రాతిపదికన పనులు ప్రారంభించి నెల రోజుల్లో పూర్తి చేయాలని సీఆర్డీఏ గడువు విధించింది.