ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. పథకాల అమలు ముహూర్తం ఖరారు చేసారు. సూపర్ సిక్స్ లో ప్రధానమైన మూడు పథకాలను జూన్ లోగా అమలు చేయనున్నట్లు వెల్లడించారు.
ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం అమలు చేస్తున్నారు. కాగా, మత్య్సకారుల నిధుల అమలుకు సిద్దమయ్యారు. మంత్రులంతా ప్రతీ వారం నియోజకవర్గాల్లో గ్రీవెన్స్ సెల్ నిర్వహించాలని చంద్రబాబు ఆదేశించారు.
పథకాల అమలు
టీడీపీ పాలిట్ బ్యూరో సమావేశంలో పలు కీలక అంశాల పైన చర్చ జరిగింది. పథకాల అమలు గురించి క్షేత్ర స్థాయి రిపోర్టును సమావేశంలో ప్రస్తావించారు. దీంతో, జూన్ లోగానే ప్రధానమైన మూడు పథకాలను అమలు చేస్తామని చంద్రబాబు వెల్లడించారు. 2014-19 మధ్య జరిగిన తప్పిదాలు పునరావృతం కాకుండా.. పక్కాగా అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అందు లో భాగంగా తల్లికి వందనం, అన్నదాత-సుఖీభవ పథకాలు ఈ ఏడాదే ప్రారంభించాలని సీఎం స్పష్టం చేశారు. అన్నదాత సుఖీభవకి కేంద్రం 6 వేల రూపాయలు ఇచ్చినా మిగిలిన 14 వేలు రాష్ట్ర ప్రభుత్వమే భరించి 3 విడతల్లో 20 వేలు చెల్లిద్దామని చంద్రబాబు ప్రతిపాదించారు.
రైతుల ఖాతాల్లో నిధులు
దీంతో, ఫిబ్రవరిలో కేంద్రం పీఎం కిసాన్ నిధులు విడుదల చేసిన తరువాత మూడు విడతలుగా రాష్ట్ర ప్రభుత్వం మిగిలిన 14 వేలను రైతుల ఖాతాల్లో జమ చేయనుంది. అదే విధంగా తల్లికి వందనంలో భాగంగా చదువుకునే పిల్లలు ఉన్న తల్లుల ఖాతాల్లో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే నిధుల జమ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు పథకం అర్హుల లెక్కలు ఖరారు పైన కసరత్తు జరుగుతోంది. ఇక, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉగాది నుంచి అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకం అమలు దిశగా అధికారులు పూర్తి నివేదిక సమర్పించారు. ఆర్డికంగా భారం పైన చర్చించారు.
చంద్రబాబు సూచనలు
ఉచిత బస్సు ప్రయాణం హామీ అమలు కోసం ఆర్టీసీ నుంచి వచ్చిన కొత్త బస్సులు..సిబ్బంది అంశం పైనా ప్రభుత్వం ఫోకస్ చేసింది. యువతకు నిరుద్యోగ భృతి అంశం పైన చర్చకు వచ్చింది. ఇచ్చిన హామీలు అమలు చేస్తామని సీఎం చెప్పినట్లు తెలుస్తోంది. ఇక..రెండు నెలల్లో మత్స్యకారులకు డబ్బులు చెల్లిస్తామని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేసారు. ఇక, కీలకమైన బనకచర్ల ప్రాజెక్టు నిధులు పీపీపీ మోడల్లో రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం, కాంట్రాక్టర్లు 50 శాతం పెట్టుకునేలా ప్రణాళికలు చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. ఏడు నెలల పాలనలో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు.. పెట్టుబడి ఒప్పందాల గురించి మంత్రులు.. ఎమ్మెల్యేలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు ఆదేశించారు.