తపాలా శాఖ అందించే బీమా పథకాలు

పీఎల్‌ఐ (పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌) పేరిట ప్రవేశపెట్టిన పలు రకాల పథకాలు ఎంతో మంది గ్రాడ్యుయేట్లకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తున్నాయి. వీటిని మొదట్లో తపాలా శాఖ ఉద్యోగుల సంక్షేమ పథకాలుగా ప్రవేశపెట్టారు. తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, భద్రతా సిబ్బందికి వర్తింపజేశారు. కాలక్రమేణా పీఎల్‌ఐ పథకాన్ని వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, సీఏ వంటి ప్రొఫెషనల్స్‌తో పాటు బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈ లలో నమోదు కంపెనీల ఉద్యోగులకు వర్తింపజేశారు. ఇటీవల గ్రాడ్యుయేట్లకు పీఎల్‌ఐ సౌకర్యాన్ని విస్తరించారు. దీంతో ఈ పథకాల వైపు గ్రాడ్యుయేట్లు ఆసక్తి చూపుతున్నారు.


యాంటిసిపేటెడ్‌ ఎండోమెంట్‌ అస్యూరెన్స్‌..

దీనిని మనీ బ్యాక్‌ పాలసీ అంటారు. 19 నుంచి 25 సంవత్సరాల మధ్య గలవారు ఈ పాలసీకి అర్హులు. బీమా రూ.20వేల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటుంది. పాలసీ కాలపరిమితి 15 నుంచి 20 సంవత్సరాలుగా నిర్ణయించారు. 15 ఏళ్ల పాలసీపై 6, 9, 12 సంవత్సరాలు పూర్తయితే 20 శాతం, మెచ్యూరిటీపై 40 శాతం బోనస్‌ లభిస్తుంది. 20 ఏళ్ల పాలసీపై 8, 12, 16 సంవత్సరాలు పూర్తయితే 20 శాతం, మెచ్యూరిటీపై 40 శాతం చొప్పున బోనస్‌ లభిస్తుంది. ఈ స్కీమ్‌లో ఉన్న లబ్ధిదారులకు సంవత్సరానికి ఒకసారి 1000 రూపాయలకు రూ. 48 చొప్పున బోనస్‌ లభిస్తుంది.

హోల్‌ లైఫ్‌ అస్యూరెన్స్‌…

ఈ పాలసీకి 19 నుంచి 55 సంవత్సరాల మధ్య గల వా రు అర్హులు. బీమా రూ.20వేల నుంచి 50 లక్షల వరకు ఉంటుంది. ప్రీమియం చెల్లించే వయసును 55, 58, 60 సంవత్సరాలుగా ఎంచుకునే అవకాశం కల్పించా రు. నాలుగేళ్ల తర్వాత రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. మూడేళ్లు దాటితే పాలసీ సరెండర్‌ చేసుకొనే వీలుంటుంది. ఐదేళ్ల లోపు సరెండర్‌ చేస్తే ఎలాంటి బో నసులు వర్తించవు. కోతలు విధిస్తారు. ప్రతిఏటా 1000కి రూ. 76 చొప్పున బోనస్‌ లభిస్తుంది. పాలసీదారుడికి 80 ఏళ్లు దాటినా లేదా మరణించినా వారసులకు బీమా సొమ్ము బోనస్‌ ప్రయోజనాలను చెల్లిస్తారు.

కన్వర్టబుల్‌ హోల్‌ లైవ్‌ అస్యూరెన్స్‌..

ఈ పాలసీకి 19 నుంచి 50 సంవత్సరాల వారు అర్హులు. రూ.20 వేల నుంచి రూ.50 లక్షల వరకు బీమా చెల్లింపులు చేయవచ్చు. మూడేళ్లు దాటితే ఎప్పుడైనా పాలసీ సరెండర్‌కు అవకాశం ఉంటుంది. ఐదేళ్ల లోపు సరెండర్‌ చేస్తే బోనస్‌ రాకపోగా కోతలు విధించే నిబంధనలు ఉన్నాయి. ప్రతి ఏటా రూ.1000 కి 76 రూపాయలు చొప్పున బోనస్‌ లభిస్తుంది..

ఎండోమెంట్‌ అస్యూరెన్స్‌..

ఈ పాలసీకి 18 నుంచి 50 సంవత్సరాల వారు అర్హులు. కనీస బీమా రూ.20,000, గరిష్టంగా రూ.50 లక్షలు ఉంటుంది. పాలసీ తీసుకున్న మూడేళ్ల తర్వాత రుణ సదుపాయం, పాలసీ సరెండర్‌కి అవకాశం ఉంటుంది. ఐదేళ్లు దాటిన పాలసీల సరెండర్‌పై బోనసుల్లో కోతలు విధింపు తప్పవు. ప్రతి ఏటా రూ.1000 కి 52 రూపాయలు చొప్పున బోనస్‌ లభిస్తుంది.

జాయింట్‌ లైఫ్‌ అస్యూరెన్స్‌..

ఈ పాలసీకి 21 నుంచి 45 ఏళ్ల వయసు గల దంపతులు అర్హులు. బీమా రూ. 20వేల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటుంది. పాలసీ కాల పరిమితి ఐదు నుంచి 20 ఏళ్లు. పాలసీ తీసుకున్న మూడేళ్ల తర్వాత రుణ సదుపాయం ఉంటుంది. ఐదేళ్లు దాటిన పాలసీలు సరెండర్‌ పై బోనస్‌ల్లో కోత ఉంటుంది. పాలసీదారుడు మరణానంతరం ప్రయోజనాలు భాగస్వామి లేదా వారసులకు వర్తిస్తాయి. ప్రతి ఏటా రూ.1000కి 52 చొప్పున బోనస్‌ లభిస్తుంది. సింగిల్‌ ప్రీమియంతో దంపతులు బీమా కవరేజి పొడిగించుకోవచ్చు.

చిల్డ్రన్‌ పాలసీ..

పాలసీదారుల పిల్లల కోసమే ఈ పథకాన్ని తీసుకొచ్చారు. గరిష్టంగా ఇద్దరు పిల్లలకు బీమా చేసుకోవచ్చు. పిల్లల వయస్సు తప్పనిసరిగా ఐదు నుంచి 20 ఏళ్ల లోపు ఉండాలి. పిల్లలకు గరిష్టంగా రూ.3 లక్షలు లేదా పాలసీదారు బీమా ప్రకారం ఇన్సూరెన్స్‌ తీసుకోవచ్చు. పాలసీదారు ( పిల్లల తండ్రి) వయసు 40 ఏళ్లు దాటి ఉండకూడదు. పాలసీదారు చనిపోతే పిల్లలపై తీసుకున్న బీమాకు ప్రీమియం చెల్లించనక్కర్లేదు. కాలపరిమితి తీరాక బీమా సొమ్ము బోనసులు వర్తిస్తాయి. రుణ సదుపాయం సరెండర్‌ సౌకర్యాలు ఈ స్కీమ్‌ లో ఉండవు. ప్రీమియం తల్లిదండ్రులు చెల్లించాలి. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. వీరికి ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించరు. ఎండోమెంట్‌ పాలసీ ప్రకారం బోనసులు వర్తిస్తాయి.

దరఖాస్తు చేయడం ఇలా….

పోస్టల్‌ లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలనుకునేవారు కావాల్సిన పత్రాలను విధిగా సంబంధిత అధికారులకు సమర్పించాలి. గ్రాడ్యుయేట్‌, పదో తరగతి, డిగ్రీ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. పాలసీని బట్టి వివిధ వైద్య పరీక్షలు ఉంటాయి, స్మార్ట్‌ ఫోన్‌ వినియోగదారులు పోస్ట్‌ ఇన్ఫో యాప్‌ డౌన్లోడ్‌ చేసుకోవచ్చు. లేదా సమీప పోస్ట్‌ ఆఫీస్‌ను సంప్రదించి స్కీంలో భాగస్వాములు కావచ్చు.

ఉమ్మడి జిల్లాలో 3,79,680 పాలసీదారులు

పీఎల్‌ఐ పథకంలో ఉమ్మడి వైఎస్‌ఆర్‌ జిల్లాలో 3,79,680 మంది పాలసీదారులు ఉన్నారు. ఇందులో కడప డివిజన్‌లో 2,08,722, ప్రొద్దుటూరు డివిజన్‌లో 1,70,958 పాలసీదారులు ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన పీఎల్‌ఐ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. గ్రాడ్యుయేట్లు, విద్యావంతులు, ఈ పథకంలో చేరి వివిధ పథకాల్లోని ప్రయోజనాలను పొందవచ్చు. తక్కువ బీమాతో ఎక్కువ ప్రీమియంలు పొందవచ్చు. పోస్టల్‌ ఉద్యోగులు పీఎల్‌ఐ పథకాలపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.