యాపిల్ ప్రాడెక్ట్ లవర్స్‌కి గుడ్‌న్యూస్. 2024 యాపిల్ ఈవెంట్ డేట్ వచ్చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 9వ తేదీన ఈవెంట్ (Apple Event)) నిర్వహించనున్నట్లు యాపిల్ సంస్థ అధికారికంగా ప్రకటించింది. యాపిల్ సంస్థ కొత్త ఉత్పత్తులు, వాటి ఫీచర్లకు సంబంధించి ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న విషయం తెలిసిందే. ప్రతి ఏడాది సెప్టెంబర్ రెండో వారంలో యాపిల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఈసారి సెప్టెంబర్ 10వ తేదీన ఈవెంట్‌ను నిర్వహించనున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఒకరోజు ముందుగానే యాపిల్ ఈవెంట్ డేట్‌ను ప్రకటించింది.
కాలిఫోర్నియాలోని స్టీవ్ జాబ్స్ థియేటర్‌లో యాపిల్ తన ఈవెంట్ కార్యక్రమాన్ని నిర్వహించనుంది. ప్రపంచ వ్యాప్తంగా ఈ ఈవెంట్ యాపిల్ యూట్యూబ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ ఈవెంట్ యాపిల్ పార్క్ నుంచి ఉదయం 10 గంటలకు ప్రసారం అవుతుంది. అంటే భారత కాలమానం ప్రకారం సెప్టెంబర్ 9వ తేదీ రాత్రి 10:30 గంటలకు ఈవెంట్ లైవ్ అవుతుంది. ఈ ఈవెంట్ యూట్యూబ్, యాపిల్ ఈవెంట్ ప్లాట్ఫామ్లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఈసారి యాపిల్ ఈవెంట్ ట్యాగ్ లైన్‌ను ‘ఇట్స్ గ్లోటైమ్’గా పేర్కొంది. యాపిల్ ఇంటెలిజెన్స్ ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.
యాపిల్ వెంట్‌లో భారీగా కొత్త ప్రొడక్ట్‌లను ప్రకటించనుంది. ఐఫోన్ 16 సిరీస్ (iPhone 16), యాపిల్ వాచ్, ఎయిర్‌పాడ్స్ ప్రొడక్ట్స్‌ను ప్రకటించే అవకాశం ఉంది. వీటితో పాటుగా కొత్త హార్డ్‌వేర్‌ను ప్రకటించనుంది. ఐఫోన్ 16 సిరీస్ ఫోన్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో రానున్నట్లు సమాచారం. నాలుగు మోడళ్లు ఐఫోన్ 16, ఐఫోన్ ప్లస్, ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మాక్స్‌లను ప్రకటించే అవకాశం ఉంది. ఈసారి అన్ని మోడళ్లలో యాక్షన్ బటన్ ఇవ్వనున్నట్లు సమాచారం. గతంలో 15 సిరీస్ ప్రో మోడల్స్‌లో మాత్రమే ఈ యాక్షన్ బటన్‌ను ఇచ్చారు. ఈ సారి అన్నిమోడళ్లు లేటెస్ట్ జెన్ హార్డ్‌వేర్, ఏఐతో రానున్నాయి. ఇక ఐఓస్ 18తో పాటు ఇతర సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను సైతం వెల్లడించే అవకాశం ఉంది.
ఐఫోన్ 16 ఫీచర్స్పై గత కొంతకాలంగా రూమర్స్ వినిపిస్తున్నాయి. ఐఫోన్ 16లో 48 మెగా పిక్సెల్ మెయిన్, 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో పాటు స్పేషియల్ వీడియో సపోర్ట్తో డ్యూయెల్ కెమెరా ఉంటుందని సమాచారం. మెరుగైన పనితీరు, ఏఐ ఫీచర్ల కోసం, ఐఫోన్ 16 కొత్త ఏ18 ప్రో చిప్సెట్తో వస్తుందని అంచనాలు ఉన్నాయి. అయితే.. ఈ ఫీచర్స్ లీక్స్ మాత్రమే. త్వరలో స్పష్టత రానుంది.