మూడు కీలక అణు కేంద్రాలపై అమెరికా వైమానిక దాడులు చేసిన ఒకరోజు తర్వాత ఇరాన్‌లోని బదులు తీర్చుకునేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది.
దీంతో పశ్చిమాసియాలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి, ఆ ప్రాంతమంతా యుద్ధ మేఘాలు ఆవరించాయి. ఆదివారం రాత్రి అమెరికా బాంబు దాడులకు ప్రతీకారంగా ఇరాన్ మధ్యప్రాచ్యంలోని అమెరికన్ సైనిక స్థావరాలపై వరుస క్షిపణులను ప్రయోగించింది. ఖతార్ తన గగనతలాన్ని మూసేస్తున్నట్టు ప్రకటించిన కొద్దిసేపటికే ఈ దాడులు జరగడం గమనార్హం. ఖతార్‌లోని అల్-ఉదైద్‌లో ఉన్న అమెరికా ఆధీనంలోని ఎయిర్ ఆపరేషన్స్ సెంటర్ వైపు ఆరు క్షిపణులను పంపినట్టు ఇరాన్ వెల్లడించింది. మరొక క్షిపణి ఇరాక్ వైపు వెళ్లినట్టు కూడా చెబుతున్నారు. ఈ సెంటర్లో అమెరికాతో పాటు యూకేకు చెందిన సైనికులు కూడా ఉన్నారు. ప్రత్యక్ష సాక్షుల చెప్పిన వివరాల ప్రకారం, క్షిపణులను ప్రయోగించిన కొద్ది నిమిషాలకే ఖతార్ రాజధాని దోహాలో పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. ఇప్పటికే ఈ బేస్‌కు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, సైనికులు అత్యవసరంగా బంకర్లలోకి వెళ్లాలనే ఆదేశాలు అందాయి.
ఖతార్‌లోని అల్ ఉదైద్ వైమానిక స్థావరానికి ముప్పు ఉందనే విషయం వైట్‌హౌస్, రక్షణ శాఖకు తెలుసు, ఈ బేస్‌ను నిశితంగా పర్యవేక్షిస్తున్నాయని వైట్‌హౌస్ అధికారి ఒకరు తెలిపారు. ఆదివారం అమెరికా చేపట్టిన ఆపరేషన్ మిడ్‌నైట్ హ్యామర్‌కు ప్రతిస్పందనగా ‘బ్లెస్సింగ్స్ ఆఫ్ విక్టరీ’ అనే ఆపరేషన్‌లో భాగంగా ఈ దాడులు జరిగాయని ఇరాన్ ప్రభుత్వ మీడియా పేర్కొంది. దీనిపై ఇరాన్ ముందుగానే అమెరికాపై ప్రతీకారం తీర్చుకుంటామని ప్రకటించింది. యుద్ధాన్ని అమెరికా ప్రారంభించింది, దాన్ని మేము ముగిస్తామని స్పష్టం చేసింది. ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తుందని అమెరికా ముందుగానే ఊహించింది. కానీ దౌత్యపరమైన పరిష్కారం కోసం చూస్తున్నట్టు ప్రకటించింది. ఒకవేళ ఇరాన్ ప్రతీకారానికే మొగ్గుచూపితే, ఇప్పటికంటే ఎక్కువ దాడులు తప్పవనే హెచ్చరిక కూడా జారీ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇరాన్ దాడులు ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయనే ఆందోళన పెరుగుతున్నాయి.
































