IRCTC గ్రూప్ టికెట్ బుకింగ్ గురించి తెలుసా: రూల్స్ ఇవే..

ట్రైన్ జర్నీ అనగానే.. ఐఆర్‌సీటీసీ లేదా ఇతర యాప్‌లలో టికెట్ బుక్ చేసేస్తారు. ఆన్‌లైన్‌ టికెట్ బుకింగ్స్ వచ్చిన తరువాత.. టికెట్ బుకింగ్ సెంటర్లకు వెళ్లడమే తగ్గిపోయింది. అయితే ఆన్‌లైన్‌లో ఒకసారికి ఆరుమంది కంటే ఎక్కువ బుక్ చేసుకోవడానికి వీలు కాదు. అలాంటప్పుడు చాలామంది వివాహ వేడుకలకు లేదా పాఠశాల విహారయాత్రలకు వెళ్లాలంటే.. అప్పుడు ఎలా బుక్ చేసుకోవాలనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం.


ఆన్‌లైన్‌లో మళ్ళీ మళ్ళీ బుక్ చేసుకుంటే.. ఎక్కువ మందికి టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. అయితే అందరికి ఒకేదగ్గర లేదా ఒకే బోగీలో సీట్లు దొరుకుతాయని మాత్రం చెప్పలేము. కాబట్టి ఎక్కువ మందికి టికెట్స్ బుక్ చేసుకోవాలంటే ఉత్తమమైన మార్గం.. బుకింగ్ సెంటర్లకు వెళ్లడమే.

ఆఫీస్, మతపరమైన యాత్రలు, వివాహం లేదా కుటుంబ సమూహాలతో కలిసి ట్రైన్ జర్నీ చేయాలనుకునే వారికి IRCTC గ్రూప్ బుకింగ్ సౌకర్యం అందిస్తోంది.

ప్రస్తుత ఒకేసారి 50 నుంచి 100 మంది ప్రయాణికులకు బల్క్ బుకింగ్‌ను ఐఆర్‌సీటీసీ అనుమతిస్తుంది. ఇక్కడ గుర్తుంచుకోవలసిన విషయం ఏమిటంటే.. అన్ని రైల్వే స్టేషన్లలోనూ ఈ బల్క్ బుకింగ్ ఆప్షన్స్ అందుబాటులో ఉండదు. బల్క్ బుకింగ్ చేసుకోవాలనుకువారు ముందుగా.. సమీపంలోని స్టేషన్‌లోని చీఫ్ రిజర్వేషన్ సూపర్‌వైజర్ లేదా కంట్రోలింగ్ ఆఫీసర్‌ను సంప్రదించి తెలుసుకోవాల్సి ఉంటుంది.

సాధారణంగా ఈ బల్క్ బుకింగ్స్ అనేది న్యూఢిల్లీలో బల్క్ బుకింగ్ రిజర్వేషన్ కాంప్లెక్స్, IRCA భవనంలో జరుగుతుంది. ఇది కూడా నామినేటెడ్ కౌంటర్లలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి దీని గురించి ముందుగానే తెలుసుకోవడం ఉత్తమం.

బల్క్ బుకింగ్ సర్వీస్ కింద టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి సంబంధిత అధికారులకు అభ్యర్థన లేఖను సమర్పించడం తప్పనిసరి. ఒక పాఠశాల / సంస్థ / విభాగం ఈ యాత్రను స్పాన్సర్ చేస్తుంటే.. వారికి సంబంధించిన సర్టిఫికేట్‌ను అభ్యర్థన లేఖతో పాటు అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది. వివాహ వేడుకలకు సంబంధించిన వారు అయితే.. వెడ్డింగ్ కార్డు లేదా నోటరీ చేసిన అఫిడవిట్‌ను అభ్యర్థన లేఖతో ఇవ్వాలి.

డాక్యుమెంట్స్ మాత్రమే కాకుండా.. ప్రయాణించే వ్యక్తుల పేర్లు, వయసు, లింగం, ఇతర వివరాలతో ప్రయాణీకుల జాబితాను అందించాలి. టిక్కెట్లను బుక్ చేసుకునే వ్యక్తి తన ఐడీ కార్డు ఫోటోకాపీని ఇవ్వాలి. బల్క్ టికెట్ బుకింగ్ చేసుకోవాలనుకునే వారు.. ఉదయం 8:00 గంటల నుంచి 9:00 వరకు మాత్రమే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.