విద్యుత్‌ లేకుండా 120 ఎకరాలకు సాగునీరు

www.mannamweb.com


” మా భూముల్లో సారం ఉంది. అన్ని రకాల ఆకుకూరలు, పండ్లు , చిరుధాన్యాలు పండుతాయి.కానీ నీటి వసతి మాత్రమే లేదయ్యా వర్షాధారం మీదనే సాగు చేయాలి.

వానలు దండిగా కురిసినప్పటికీ పల్లంలోకి జారి పోతాయి తప్ప చుక్క నీరు కూడా నేలలో ఇంకదు. సమీపంలో ఏలేరు రిజర్వాయర్‌ నుండి కొన్ని కాలువలు మా గ్రామాలకు సమీపం నుండి ప్రవహిస్తాయి. కానీ ఆ నీటిని వాడుకునే అవకాశం మాకు లేదు..” అంటారు రంపచోడవరం సమీపంలోని వేడమామిడిలో మాకు కనిపించిన రైతు కూలీలు.

‘అల్లూరి సీతారామరాజు జిల్లా, రంపచోడవరం, మారేడుమిల్లి మన్యం ప్రాంతంలో జలపాతాలు, వాగులు , వంకలు అనేకం ప్రవహిస్తుంటాయి. కానీ సేద్యమే జీవనోపాధిగా బతికే అక్కడి రైతులకు వాటిల్లో చుక్క నీరు కూడా ఉపయోగపడదు.

దానికి కారణం నీళ్లు కింద ప్రవహిస్తాయి, పొలాలు ఎగువన ఉంటాయి. ఆ నీళ్లు వారికందాలి అంటే లిఫ్ట్‌ ఇరిగేషన్‌ ఒక్కటే మార్గం . అదంతా భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. ప్రభుత్వం సహకారం లేకుండా అలాంటి ఇరిగేషన్‌ ప్రాజెక్టులు సాధ్యం కాదు.

అందుకే మేము అతి తక్కువ వ్యయంతో ‘హైడ్రాలిక ర్యామ్‌’ (hydraulic Ram )తో నీళ్లను ఎత్తిపోస్తున్నాం. దీనికి కరెంట్‌ అవసరం లేదు.” అన్నారు మాజీ ఐఎఎస్‌ ఆధికారి మనోహర ప్రసాద్‌ .
మనోహర ప్రసాద్‌

ఆయన మారేడు మిల్లి ఆదివాసీ ప్రాంతాల్లో విద్య, వ్యవసాయం, జీవనోపాదుల అభివృద్ధి కోసం ‘ సెంటర్‌ ఫర్‌ డెవలప్‌ మెంట్‌ రీసెర్చ్‌ ‘ స్వచ్ఛంద సంస్ధను నిర్వహిస్తున్నారు. సాగునీటి కోసం గిరిజన రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి అక్కడ వాగుల పై ఆరు హైడ్రో ర్యామ్‌లు ఏర్పాటు చేశారు. వాటి వల్ల సుమారు 120 ఎకరాలకు నీరు అందుతుంది.అన్ని రకాల పంటలు పండిస్తున్నారు.

హైడ్రాలిక్‌ ర్యామ్‌ అంటే ఏమిటి? ఎలా పనిచేస్తుంది?

తీవ్రమైన నీటి ఉధృతిని యాంత్రిక శక్తిగా మార్చడం ద్వారా ఈ హైడ్రాలిక్‌ ర్యామ్‌లు పనిచేస్తాయి. హైడ్రాలిక్‌ ర్యామ్‌ల కాన్సెప్ట్‌ను మొదటగా జోసెఫ్‌ మాంటగోల్ఫియర్‌ (Joseph Michel Montgolfier ) అనే ఫ్రెంచ్‌ ఇంజనీర్‌ 1796లో ఆవిష్కరించారు.

19వ శతాబ్దంలో ఇది మరింత అభివృద్ధి చెంది, ప్రాథమిక నీటి పంపింగ్‌ పరికరంగా గ్రామీణ వ్యవసాయ అవసరాలకు ఉపయోగ పడుతోంది.

విద్యుత్‌ మోటార్ల ద్వారా నీటిని ఎత్తడానికి వీలుపడని చోట విద్యుత్‌ రహిత పద్ధతిగా ప్రసిద్ధి చెందింది.

తెలుగు యువకుడి ఆవిష్కరణ

” హైడ్రాలిక్‌ ర్యామ్‌ ( hydraulic Ram )టెక్నాలిజీని మా దగ్గరున్న జలవనరుల ప్రవాహాలకు అనువుగా కొన్ని మార్పులు చేసి ‘హైడ్రో ర్యామ్‌’ గా రూపొందించాం. నీటి ఉధృతి ఎక్కువగా ఉండే చెక్‌డ్యామ్స్‌ , వాగుల దగ్గర నీటిని ఎత్తిపోయడానికి దీనిని ఏర్పాటు చేస్తాం. వాగులో 4 నుండి 6 అడుగుల ఎత్తు నుండి నీరు కిందికి పారుతున్న చోటు ఈ ర్యామ్‌ పంప్‌ ఏర్పాటు చేస్తాం. ఆ ప్రవాహానికి ఎదురుగా పొడవాటి ఇనుప గొట్టాన్ని అమర్చి దాని ద్వారా ఒడిసిపట్టిన నీటిని పిస్టన్ల ద్వారా ఎత్తిపోసేందుకు ఏర్పాటు చేస్తాం. ఆ పిస్టన్‌ను కాలితో రెండు సార్లు కిందికి నొక్కితే చాలు. ఇక వాటంతట అవే కిందికి మీదికి లేచిపడుతుంటాయి. అలా పిస్టన్లు పనిచేయడం వల్ల నీరు వత్తిడి ద్వారా పక్కనే ఏర్పాటు చేసిన పైప్‌ ద్వారా పొలాలకు నీరు ఎత్తిపోస్తారు.” అని వివరించారు. ఈ పంప్‌ను రూపొందించిన గ్రామీణ ఆవిష్కర్త పి.శ్రీనివాస్‌.

ర్యామ్‌తో ఆవిష్కర్త శ్రీనివాస్‌

కాకినాడ జిల్లా.కైకవోలుకు చెందిన శ్రీనివాస్‌ ఏజెన్సీ ప్రాంతాల్లో తిరుగుతూ రైతులు సాగునీటి సమస్యలు ఎదుర్కోవడం గమనించాడు. పక్కనే నీళ్లు ప్రవహిస్తున్నప్పటికీ వాటిని వాడుకోలేని స్ధితిలో ఉన్న రైతుల పేదరికం అతడిని కదిలించింది. డీజిల్‌,విద్యుత్‌ లేకుండా తక్కువ ఖర్చుతో నీటిని ఎత్తిపోసే ఆలోచన నుండి పుట్టిందే హైడ్రో ర్యామ్‌. దానిని హైడ్రో లిఫ్ట్‌ అని కూడా పిలుస్తారు. చదివింది ఐటిఐ మాత్రమే. అయినప్పటికీ అనేక ప్రయోగాలు చేసి,నిపుణులకు కలిసి చర్చించి చివరికి ఈ పరికరం ఆవిష్కరించాడు.

వాగులో ఏర్పాటు చేసిన హైడ్రో ర్యామ్‌

ఏన్జీఓల సహకారంతో….

ఈ హైడ్రాలిక్‌ ర్యామ్‌లు ఏర్పాటులో సీడీఆర్‌ సంస్ధకు సాంకేతిక సహకారం అందించినట్టు శ్రీనివాస్‌ చెప్పారు. ఈ పంప్‌ల తయారీకి టాటా ట్రస్ట్‌, సీడీఆర్‌ ఆర్దిక సహాయం చేశారు.

సీడీఆర్‌ టీమ్‌

ఈ పరికరం ఏర్పాటుకు దాదాపు రూ 2,50,000 వరకు ఖర్చు అవుతుంది.

నిముషానికి 60లీటర్ల నీటిని 20 అడుగుల ఎత్తుకు లిఫ్ట్‌ చేసే శక్తి ఈ హైడ్రోర్యామ్‌కి ఉంది. ఒక సారి పెట్టుబడి పెడితే రోజుకు కనీసం 8 నుండి 10 ఎకరాలకు నీరు పారించ వచ్చు. రైతులు డ్రిప్‌ వాడితే నీటిని పొదుపు చేసి రెట్టింపు ఎకరాలకు నీరు అందుతుంది. విద్యుత్‌ అవసరం ఉండదు. నిర్వహణ ఖర్చులుండవు.

హైడ్రో ర్యామ్‌ పరికరాలు

పల్లెలకు వెలుగు

ఈ పరికరాన్ని మరింత అభివృద్ధి చేసి నీటిని ఎత్తిపోయడానికే కాకుండా జలవిద్యుత్‌ని కూడా తయారు చేయడానికి మరిన్ని పరిశోధనలు చేయబోతున్నట్టు శ్రీనివాస్‌ చెబుతున్నారు. ప్రభుత్వం సహకరిస్తే నీటి కొరతనే కాదు,విద్యుత్‌ కొరతను కూడా పరిష్కరించవచ్చు అన్నారు.

ఇవే కాక మరికొన్ని ఆవిష్కరణలు కూడా చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన పెట్రోల్‌ డీజిల్‌ లేకుండా నడిచే బైక్‌ను తయారు చేసే 70 శాతం సక్సెస్‌ అయ్యాడు. ప్రభుత్వ అనుమతుల కోసం ఎదురు చూస్తున్నాడు.

తూరుపు మన్యం కొండ ప్రాంతంలో ప్రకృతి సహజంగా జలపాతాలు, ఊటనీటి ప్రవాహాలు ఎక్కువగా ఉంటాయి. ఆ నీటిని వాడుకునే టెక్నాలజీ అందుబాటులో లేక వృదాగా పల్లపు ప్రాంతాలకు వెళ్లిపోతున్నాయి. గిరిజన రైతుల్లో కొత్త ఆశలు రేపుతున్న ఈ హైడ్రో ర్యామ్‌ల ద్వారా వాటి నుండి సాగునీటిని తక్కువ ఖర్చుతో పొందవచ్చు. ఇవి ఎత్తైన పంటభూములకు నీటిని పంపించడంలో సహాయపడతాయి. విద్యుత్‌ వాడకం లేక పోవడం వల్ల ఇది పర్యావరణ హితం. ఈ యువ ఇంజనీర్‌కి ప్రభుత్వం, ఇతర సంస్ధలు సహకరిస్తే ఆదివాసీ ప్రాంతాలు సస్య శ్యామలం అవుతాయి!