నడక.. మిగతా వాటితో పోలిస్తే తేలికైన వ్యాయామం. మనం వేసే ప్రతి అడుగు ఆరోగ్యదాయని అని, మన ఆయుష్షును పెంచుతుందని ఇప్పటికే ఎన్నో సార్లు ఎన్నో అధ్యయనాల్లో వెల్లడైంది. మరి ఆరోగ్యకర జీవనానికి రోజుకు ఎన్ని అడుగులు వేయాలి? 10వేల అడుగులు వేస్తే చాలా ఆరోగ్య ప్రయోజనాలను (Health Benefits) పొందొచ్చని దశాబ్దాలుగా ఉన్న మాట. గత కొన్నేళ్లుగా వైద్య నిపుణులు, ప్రభుత్వాలు కూడా దీన్ని ప్రోత్సహిస్తున్నాయి. మరి ఈ ‘రోజుకు 10వేల అడుగులు (10,000 Steps a Day)’ అనేది ఎలా నిర్ధరించారు? దీనిపై నిపుణులు ఏమంటున్నారు?
గడియారాల కంపెనీ యాడ్‌తో మొదలై..
వాస్తవానికి రోజుకు 10వేల అడుగులు వేస్తే ఆరోగ్యానికి మంచిదనే సలహా శాస్త్రవేత్తల నుంచి వచ్చింది కాదు. 1964 టోక్యో ఒలింపిక్స్‌కు ముందు జపాన్‌కు చెందిన గడియారాల కంపెనీ (Japanese company) ‘యమసా’ తమ ఉత్పత్తుల కోసం ఇచ్చిన ఓ ప్రకటనలో ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఆ సమయంలో యమసా (Yamasa) కంపెనీ కొత్తగా ఓ ‘పెడోమీటర్’ను ఆవిష్కరించింది. అది మెటల్ బాల్‌తో ఉండే ఒక లెక్కింపు పరికరం. దాన్ని నడుముకు ధరిస్తే మనం రోజుకు ఎన్ని అడుగులు వేశామో లెక్కిస్తుంది. ఒలింపిక్స్ సమయంలో దానికి విశేష ఆదరణ దక్కడమే గాక.. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ‘రోజుకు 10వేల అడుగులు (10,000 Steps a Day)’ అనే మాట వ్యాప్తి చెందింది. ఆ తర్వాత ఈ సలహాపై శాస్త్రవేత్తలు అధ్యయనం చేయడం ప్రారంభించారు.
అధ్యయనాలు ఏం చెప్పాయంటే..?
దీనిపై గతేడాది అమెరికాకు చెందిన జాన్స్ హాప్‌కిన్స్ యూనివర్సిటీ, పోలండ్‌లోని లాడ్జ్ మెడికల్ యూనివర్సిటీ ఓ అధ్యయనాన్ని ప్రచురించాయి. ఇందుకోసం దాదాపు 2.26లక్షల మందితో 17 వేర్వేరు పరిశోధనలు జరిపింది. రోజుకు ఎంతసేపు నడవాలనే ప్రశ్నకు పరిశోధకులు రకరకాల ప్రత్యామ్నాయాలు సూచించారు. వేసే అడుగుల సంఖ్యను బట్టి విభిన్న ప్రయోజనాలుంటాయని వివరించారు.
‘‘రోజుకు దాదాపు 4వేల అడుగులు నడిస్తే అకాల మరణాలకు అడ్డుకట్ట వేయవచ్చు. ఇది అల్జీమర్స్, డిమెన్షియా వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. అధికబరువు/ఊబకాయం, డయాబెటిస్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. 2337 అడుగులతో గుండె సంబంధిత (కార్డియోవాస్కులర్) జబ్బులతో మరణించే అవకాశాలు తగ్గుతాయి. రోజుకు వెయ్యి అడుగుల చొప్పున నడకను అదనంగా పెంచుకోగలిగితే గుండెజబ్బుల మరణాలు 15 శాతం తగ్గిపోతాయి. 500 అడుగులు పెంచితే.. అవి ఏడు శాతం మేర తగ్గుతాయి. 60 ఏళ్లు పైబడినవారు రోజుకు ఆరు వేల అడుగుల నుంచి 10 వేల అడుగులు నడిస్తే అకాల మరణాల ముప్పు 42 శాతం తగ్గుతుంది’’ అని ఈ పరిశోధకులు సూచించారు.
చిన్న లక్ష్యాలు పెట్టుకోవాలి..
‘‘రోజూ గరిష్ఠంగా ఎంత నడవాలనే అంశంలో ఇప్పటికీ స్పష్టత లేదు. ఎంత ఎక్కువ నడిస్తే (Walking) అంత మంచి లాభాలుంటాయి. మెరుగైన ప్రయోజనాల కోసం 8వేల నుంచి 10వేల అడుగులు నడవడం అనేది ఉత్తమం. వీలైనంత ఉత్తేజంగా ఉండండి. వ్యాయామాన్ని ఆస్వాదించండి. కనీసం రోజుకు అరగంట అయినా వర్కౌట్ చేస్తే ఆరోగ్యకర ప్రయోజనాలు (Health Benefits) అందుతాయి’’ అని పరిశోధకులు చెబుతున్నారు. అయితే, ఒక్క రోజులోనే 10వేల అడుగులను చేరుకోలేకపోవచ్చు. వేగంగా నడవాలన్న ప్రయత్నంలో కొన్ని సార్లు గుండె మీద ఒత్తిడి పడుతుంది. కాబట్టి 2,500 నుంచి 3000లతో మొదలుపెట్టి నెమ్మదిగా ప్రతి 15రోజులకి ఐదు వందల చొప్పున పెంచుకుంటూ వెళ్లినా మేలే. బరువు ఉన్నవాళ్లు వెయ్యితో మొదలుపెట్టినా చాలు. అలాగే వృద్ధాప్యంలో ఉన్నవాళ్లు తమ శక్తి మేరకే లక్ష్యాన్ని పెట్టుకోవాలి అని సూచిస్తున్నారు.
గమనిక: ఈ సమాచారం వైద్య నిపుణులు, పరిశోధకుల అధ్యయనాలను పరిశీలించి ఇచ్చినది మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపై ముందుగా వైద్యులను సంప్రదించిన తర్వాతే ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవడమే ఉత్తమం..!